శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

నవ్వు ఎందుకు వస్తుంది?

Posted by V Srinivasa Chakravarthy Tuesday, June 29, 2010


నవ్వు ఎందుకు వస్తుంది?

తెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వు ఎందుకు వస్తుంది? ఓ బాపు కార్టూన్ ని చూసినప్పుడో, ఓ పి.జి. వుడ్ హౌస్ నవల చదివినప్పుడో నవ్వుఎందుకు వస్తుంది? అసలు నవ్వు ఎందుకు వస్తుంది? చక్కలిగిలి పెట్టినప్పుడు నవ్వు ఎందుకు వస్తుంది? కాని ఎవరికి వారే, బోరు కొట్టినప్పుడల్లా తమకి తాము చక్కలిగిలి పెట్టుకుని ఎందుకు నవ్వుకోలేరు?

“కాదేదీ సైన్స్ కనర్హం” కనుక ఈ నవ్వు గురించి కూడా నాడీశాస్త్రంలో కొంత పరిశోధన జరిగింది. అయితే నవ్వు ఓ వ్యాధి కాదు కనుక, ఓ మెదడు వ్యాధి మీద జరిగేటంత పెద్ద ఎత్తున దీని మీద పరిశోధన జరగలేదు. కాని కొన్ని మెదడు సమస్యల నేపథ్యంలో ఆపుకోలేని, అసహజమైన నవ్వు రావడం విశేషం. ఉదాహరణకి ఎపిలెప్సీ వ్యాధి గురించి అందరం వినే వుంటాం. దీన్నే సామాన్య పరిభాషలో ’ఫిట్స్’ అంటారు. ఈ ఫిట్స్ లేదా seizures వచ్చినప్పుడు కొన్ని సార్లు రోగి గిల గిల తన్నుకోవడం కనిపిస్తుంది. కొన్ని రకాల సీజర్స్ వచ్చినప్పుడు రోగి నిశ్చలంగా ఉండిపోతాడు. కాని ఆ సమయంలో తనకి పరిసరాల స్పృహ ఉండదు. ఇక మరికొన్ని రకాల సీజర్స్ లో రోగులు హఠాత్తుగా పెద్ద పెట్టున నవ్వడం, ఏడవడం వంటివి చేస్తారు. ఇలాంటి సీజర్స్ ని gelastic seizures అంటారు. (మరి గ్రీకులో Gelos అంటే నవ్వు!)

ప్రఖ్యాత నేచర్ పత్రికలో ( vol 391, page 650, 1998) లో, “Electric current stimulates laughter” అన్న పేరు గల వ్యాసంలో, నవ్వుకి మెదడుకి మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ప్రకటించబడింది. మెదడులో కొన్ని చోట్ల విద్యుత్ కరెంటు ని ప్రవేశపెడితే, అలాంటి ప్రేరణ నిచ్చిన వ్యక్తి నవ్విందట. ఏ.కె. అన్న పేరు గల 16 ఏళ్ల అమ్మాయికి ఎపిలెప్సీ ఉంది. అందుకు చికిత్సగా ఆమెకి సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేసి మెదడులో ఏ భాగం వల్ల ఈ ఎపిలెప్సీకి సంబంధించిన సీజర్స్ వస్తున్నాయో తెలుసుకుని ఆ భాగాన్ని తొలగిస్తారు, లేదా నాశనం (lesion) చేస్తారు. అయితే మెదడులో “మంచి” భాగాలు, ఎపిలెప్టిక్ సీజర్స్ కలుగజేసే “చెడు” భాగాలు రెండూ ఒక్కలాగాలే ఉంటాయి కనుక, మెదడులో వివిధ ప్రాంతాలకి విద్యుత్ ప్రేరణ (electric stimulation) ఇచ్చి దాని ప్రతిస్పందన ఎలా ఉందో చూసి, మంచి చెడులు నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఎక్కడ ప్రేరణ ఇస్తే సీజర్ పుడుతుందో సమస్య అక్కడ ఉందన్నమాట. ఇలాంటి అన్వేషణలో మెదడులో పలు ప్రాంతాల్లో ప్రేరణ నిస్తూ పోతున్న సమయంలో అనుకోకుండా ఒక ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు ఆ అమ్మాయి గట్టిగా నవ్విందట. ఆ ప్రాంతంలో ప్రేరణ నిచ్చిన ప్రతీ సారి అమ్మాయి అలాగే నవ్విందట. అయితే ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పాలంటే మెదడు నిర్మాణం గురించి ఓ సారి గమనించాలి.

మెదడులో రెండు గోళార్థాలు (hemispheres) ఉన్నాయని, ప్రతి గోళార్థంలోను నాలుగు విభాగాలు (lobes) ఉన్నాయని చిన్నప్పుడు వినే వుంటాం. ఇందులో మెదడులో ముందు పక్క కనిపిస్తున్న పెద్ద విభాగం frontal lobe. మెదడు ఉపరితలం అంతా మిట్ట పల్లాలుగా ఉంటుందని, “మిట్ట” లని gyri అని, “పల్లాల”ని sulci అని అంటారని కిందటి పోస్ట్ లో చెప్పుకున్నాం. ఎడమ గోళార్థంలో (left hemisphere) frontal lobe లో పై భాగంలో ఉండే superior frontal gyrus అనే 2cm X 2cm విస్తీర్ణం గల ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు పుడుతోంది. మెదడు వ్యాధి ఉన్న వారి నవ్వుకి, ఈ నవ్వుకి మధ్య లక్షణంలో తేడా ఉందని గమనించారు డాక్టర్లు. విద్యుత్ ప్రేరణ వల్ల పుట్టిన ఈ నవ్వులో ఆనందాతిరేకం (mirth) ఉందని ఏ.కె. స్వయంగా చెప్పుకుంది. అలాగే ఈ ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు మాత్రమే వచ్చింది గాని, సీజర్స్ రాలేదు. ఎందుకు నవ్వావు? అని అడిగితే ప్రతీ సారీ ఏదో కొత్త కథ చెప్పేది.
మామూలుగా మనం నవ్వినప్పుడు ముందు ఏదో బాహ్య సన్నివేశం ఉంటుంది (ఉదా: బ్రహ్మానందం), దాని కారణంగా నవ్వు వస్తుంది. కాని ఈ కృత్రిమ నవ్వు విషయంలో ముందు నవ్వు వస్తుంది, ఆ తరువాత కారణంగా భావింపబడ్డ ఏదో కథ కల్పించబడుతుంది. కాని అసలు కారణం ఆ కథ కాదు – విద్యుత్ ప్రేరణ మాత్రమే.

అయితే నవ్వడం అనే చర్యని కేవలం మెదడులో superior frontal gyrus మాత్రమే శాసిస్తుందని కాదు. ఏ చర్యనయినా మెదడులో పలు ప్రాంతాలు కలిసి సమిష్టిగా నియంత్రిస్తాయి. కనుక superior frontal gyrus అనేది నవ్వుని శాసించే ఓ పెద్ద circuit లో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే నవ్వులో ఎన్నో అంశాలు ఉన్నాయి.

1. నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. (భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది.)
2. నవ్వు వచ్చినప్పుడు ఒక జోక్ ని గాని, ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకుని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయగ్రహణం (cognition) కి సంబంధించిన విషయం.
3. నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచెయ్యాలి? కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉంది.
ఈ మూడు రకాల అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పని చేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది.

నవ్వుకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాం. నవ్వుని తెప్పించే సులభ మార్గాలు – కితకితలు.
అసలు కితకితలు ఎందుకు? అవి అవతలి వాళ్ళు పెడితేనే ఎందుకు నవ్వొస్తుంది? “స్వయం కితకితలు” ఎందుకు పనిచెయ్యవు?
ఈ సమస్యలకి సమాధానాలు వచ్చే పోస్ట్ లో....

References:
http://faculty.washington.edu/chudler/laugh.html
http://health.howstuffworks.com/mental-health/human-nature/other-emotions/laughter1.htm


7 comments

  1. KAMAL Says:
  2. haha ahahaha hahahah good post

     
  3. gaddeswarup Says:
  4. This article may also be of interest:
    http://www.frontiersin.org/neuroscience/humanneuroscience/paper/10.3389/fnhum.2010.00046/html/
    I came across it via MindHacks post:
    http://www.mindhacks.com/blog/2010/06/a_cortical_atlas_of_.html

     
  5. jeevani Says:
  6. మీ ప్రయత్న ఫలం పిల్లలకు దక్కాలని నా ఆశ. కానీయండి కాలమే నెరవేరుస్తుంది.

     
  7. మంచి విషయాలు వివరిస్తున్నారు.
    మీ టపాకు సంబంధం లేని వ్యాఖ్య రాస్తున్నందుకు క్షమించండి. మా అబ్బాయి గాలి ఎందుకు కనపడదు అని అడిగాడు. వినడానికి చిన్న ప్రశ్నలా ఉన్నా నాకు సమాధానం తెలీదు. మీకు వీలైతే కొంచెం వివరించగలరా?

     
  8. @స్నేహ గారు, ఈ విశ్వంలో మనం ఏదన్నా వస్తువును చూడాలంటే, కాంతి ఆ వస్తువుపై పడి పరావర్తనం చెంది తిరిగి మన కంటిని చేరినప్పుడు మాత్రమే చూడగలం.

    ఇక గాలి విషయానికి వస్తే, వాతావరణంలో గాలి సాంధ్రత తక్కువగా ఉంటుంది. గాలి సాంధ్రత తక్కువ కాబట్టి, వాటి బణువులు (molecules) కూడా ఒకదాని నుంచి మరొకటి దూరంగా అమరి ఉంటాయి. ఒక్కో గాలి బణువు పరిమాణం (సైజు) దాదాపుగా 10^-15 ఉంటుంది. అలాగే కాంతి కిరణం యొక్క తరంగ ధైర్ఘ్యం (wave length) దాదాపుగా 10^-6 ఉంటుంది. ఇది గాలి బణువులతో పోలిస్తే, చాలా పెద్ద పరిమాణం. ఉదాహరణకు, క్రికెట్ బంతిని గాలి బణువుగా అనుకుంటే, క్రికెట్ స్టేడియాన్ని కాంతి తరంగం (light wave) అనొచ్చు. కాబట్టి, ఆ బణువుల మీద పడ్డ కాంతి పరావర్తనం చెందదు. అలా పరావర్తనం చెందకపోవడం వల్ల ఆ బణువుల మీద పడ్డ కాంతి మన కంటికి చేరదు. ఈ కారణం చేత గాలి మనకు కనిపించదు.

    పై వివరణ మీ అబ్బాయికి అర్థమవుతుందో లేదో అని నా డౌటు. మీ అబ్బాయి ఏమి చదువుతున్నాడో నాకు తెలియదు.

     
  9. నాగప్రసాద్ గారు,
    మా అబ్బాయి యు.కె.జి చదువుతున్నాడు.మీరు చెప్పినవి వాడికి అర్థం కాకపోవచ్చు.వాడి వయసు (5 యేళ్ళు)కి అర్థం అయ్యేలా చెప్పడానికి సాధ్యం కాదంటారా?

     
  10. lalithag Says:
  11. ఆసక్తికరంగా ఉంది స్నేహ గారి అబ్బాయి అడిగిన ప్రశ్న.
    రంగు లేనందువల్ల కాదా గాలి కనిపించక పోవడం?
    ఏదో ప్రయత్నం చేశా. సమాచారం వెతికి చూస్తాను.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts