వృత్తి రీత్యా శాస్త్రవేత్తని కనుక పైన చెప్పిన విషయాలు నిజమని అనుభవం మీద తెలుసు. కాని సైన్సు లోని సత్యాలని అనుభవించడానికి, సైన్సు మన జీవితాన్ని మార్చడానికి మనం వృత్తి రిత్యా శాస్త్రవేత్తలం కానక్కర్లేదు అని కూడా తెలుసు. కాలబిలాల గురించి, మహావిస్ఫోటం (big bang) గురించి చెప్తున్నప్పుడు పిల్లల కళ్లలో కాంతులు చిందడం నేను కళ్లారా చూశాను. హై స్కూలు తరువాత బడి మానేసిన వాళ్లు కూడా మానవ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివి సైన్సు మీద, చదువు మీద ఉత్సాహం పుట్టుకొచ్చి మళ్లీ కాలజిలో చేరిన పిల్లలు నాకు తెలుసు. ఇందాక నేను ప్రస్తావించిన సైనికుడు కూడా తన ఉత్తరంలో, దుమ్ము కొట్టుకుపోయిన, ప్రమాదకరమైన బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో సాపేక్షతా సిద్ధాంతం గురించి, క్వాంటం మెకానిక్స్ గురించి చదువుతుంటే ఏదో నూతన జీవనోత్సాహం కలుగుతోందని, ఓ మహత్తర యదార్థంలో మనమంతా భాగమన్న ఏదో కొత్త అవగాహన కలుగుతోందని రాశాడు.
అయినా కూడా సైన్సు అంటే ఏ పరీక్ష కోసమో క్లాస్ రూమ్లో చర్చించుకునే ప్రత్యేక అంశంగానో, వాస్తవ ప్రపంచంలో ఉన్నట్లుండి ఏ సాంకేతిక పరికరంలోనో అభివ్యక్తం అయ్యే ఏదో గూఢవిద్య లాగానో పరిగణించబడుతూ ఉంటుంది. కాని నిజానికి సైన్స్ అంటే జీవనోత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించే ఓ అందమైన భాష. మన ఊహకి ఊపిరి పోసే కమ్మని కవితలు వైజ్ఞానిక ఆవిష్కరణలు.
సైన్స్ కి మీకు పొత్తు కుదరదని మీరు అనుకుంటే (చాలా మంది విషయంలో ఇది నిజం) సైన్స్ యొక్క ఈ పార్శ్వాన్ని మీరు ఎన్నడూ అనుభూతి చెందలేదన్నమాట. హైస్కూలు వరకు సైన్స్ చదువుకుని ఆ తరువాత సైన్స్ వొదిలిపెట్టిన ఎంతో మందితో మాట్లాడాను. చాలా మందిలో సైన్స్ అంటే ఒక విధమైన బెదురు, అది జీవితానికి సంబంధించిన ఏదో లోకోత్తర విషయం అన్న భావనే ఉంది. ఈ పరిణామం అంత మంచిది కాదు.
కళ, సంగీత, సాహిత్యాలు లేని జీవితం ఎలాగైతే శున్యంగా, అసంపూర్ణంగా తోచుతుందో, సైన్స్ లేని జీవితంలో కూడా ఓ ముఖ్యమైన, మౌలికమైన అంశం లోపిస్తుందని చెప్పొచ్చు.
ఉదాహరణకి రాత్రి వేళ ఆకాశంలో మినుకు మినుకు మనే వేవేల తారలని చూసి అందరం అబ్బురపడడం ఒక ఎత్తు. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం, మహావిస్ఫోటం జరిగిన తరుణంలో, అత్యంత క్రమబద్ధమైన పరిస్థితులలో ఆ తారలన్నీ ఆవిర్భవించాయని తెలియడం మరో ఎత్తు. అక్కడితో ఆగక తారలు కేంద్రక కొలిములని, కార్బన్, నైట్రోజెన్, ఆక్సిజన్ లని విశ్వానికి అవే సరఫరా చేస్తాయని, ఆ మూలకాలు మన జీవపదార్థ నిర్మాణానికి ముడిసరుకు అని తెలియడం మూడో ఎత్తు.
ఇంకా ముందుకు వెళ్తే విశ్వమంతా వ్యాపించిన ద్రవ్యరాశిలో తారల ద్రవ్యరాశి కేవలం 4% మాత్రమే నని తెలుస్తుంది. ఇక తక్కిన పదార్థం ఎక్కడుంది, ఎలా వుంది అన్న విషయం గురించి ఇప్పటికీ ముమ్మరంగా పరిశోధన జరుగుతోంది. దానికి చీకటి పదార్థం అని చీకటి శక్తి అని మాత్రం పేర్లు పెట్టారు.
(సశేషం...)
0 comments