1982 లో ఎస్.క్యు. కాసిమ్ నేతృత్వంలో అంటార్కిటికాని దర్శించిన మొట్టమొదటి భారతీయ పర్యటనా బృందం అయ్యింది. 21 మంది సిబ్బంది కలిగిన ఈ బృందం ఓ పది రోజుల పాటు ఆ ఖండంలో వివిధ ప్రాంతాలని చూసి వచ్చింది.
అంటార్కిటికాని సందర్శించిన మొట్టమొదటి భారతీయ మహిళ కన్వల్ వికూ. 19 వ భారతీయ అంటార్కిటికా పర్యటనా బృందంలో భాగంగా వెళ్లిన ఈ మహిళ 15 నెలల పాటు ఆ ఖండం మీద గడిపింది.
అంతర్జాతీయ అంటార్కిటిక్ ఒప్పందంలో ఇండియా భాగస్వామి అయ్యాక మన అంటార్కిటికా ఉద్యమం మరింత ఊపందుకుంది.
దక్షిణ గంగోత్రి:
1983 లో దక్షిణ గంగోత్రి అన్న పేరుతో మొట్టమొదటి భారతీయ అంటార్కిటికా పరిశోధనా కేంద్రం స్థాపించబడింది. అయితే 1989 లో విపరీతంగా మంచు పడి ఈ కేంద్రం మంచులో కప్పబడి పోవడంతో దాన్ని విడిచిపెట్టడం జరిగింది.
మైత్రి:
అప్పటికే రెండవ భారతీయ పరిశోధనా కేంద్రం అక్కడ పనిచెయ్యడం మొదలెట్టింది. దీని పేరు మైత్రి. షిర్మాకర్ ఒయాసిస్ అనే మంచులేని శిలాప్రాంతం మీద ఈ కేంద్రం నిర్మించబడింది. దక్షిణ గంగోత్రికి 90 కిమీల దూరంలో నిర్మించబడ్డ ఈ కొత్త కేంద్రంలో ఏడాది పొడవునా సిబ్బంది ఉంటారు. ఈ కేంద్రం చుట్టూ ’ప్రియదర్శిని’ అన్న పేరు గల ఓ మంచినీటి సరస్సుని ఇండియా నిర్మించింది.
భారతి: మూడవ కేంద్రం:
లార్స్మన్ హిల్ సమీపంలో మూడవ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడానికి పథకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో సర్వేలు పూర్తయ్యాయి. 2012 లో ఈ కొత్త కేంద్రం పనిచెయ్యడం మొదలెడుతుందని ఆశిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే, అంటార్కిటికా మీద ఒకటి కన్నా ఎక్కువ పరిశోధనా కేంద్రాలు గల బహుకొద్ది దేశాలలో ఇండియా ఒకటవుతుంది. ఈ కేంద్రం పేరు ’భారతి.’
అంటార్కిటికా మీద ఇండియా స్థాపించిన పరిశోధనా కేంద్రాలకి ఎన్నో వైజ్ఞానిక లక్ష్యాలు ఉన్నాయి.
- మంచు-నీరు మధ్య జరిగే పరస్పర చర్యలని, పృథ్వీవాతావరణం మీద ఆ చర్యల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం.
- ప్రాచీన పర్యావరణాన్ని, ప్రాచీన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం
- అంటార్కిటిక్ పర్యావరణ అధ్యయనం
- భౌగోళిక పరిణామ క్రమం మీద అధ్యయనాలు మొ||
Reference:
http://en.wikipedia.org/wiki/Indian_Antarctic_Program
0 comments