శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఖండపు అరలు (continental shelves)

Posted by V Srinivasa Chakravarthy Monday, May 31, 2010 2 comments
హిమ యుగం పతాక
స్థాయిలో ఉన్న స్థితిలో ఇందుకు భిన్నమైన పరిణామాలు కనిపిస్తాయి. నేల మీద విస్తరించిన హిమభూమికలలో ఎంత నీరు బంధించబడి ఉంటుందంటే (ప్రస్తుత పరిమాణానికి మూడు, నాలుగు రెట్లు ఎక్కువ మంచు ఉంటుంది), ఆ దశలో సముద్ర మట్టం ప్రస్తుతం ఉన్న మట్టం కన్నా సుమారు 440 అడుగులు కిందకి ఉంటుంది. సముద్రపు నీరు అంత కిందికి పోయినప్పుడు ఖండపు అరలు (continental shelves) బట్టబయలు అవుతాయి.

ఖండాల తీరాలకి సమీపంలో కాస్త లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతమే ఖండపు అర (continental shelf) అంటారు. తీరం నుండి సముద్రం లోకి చొచ్చుకుపోతున్నప్పుడు సముద్రం లోతు 130 మీటర్లు చేరిన దాకా లోతు క్రమంగా, నెమ్మదిగా పెరుగుతుంది. ఆ సరిహద్దు దాటాక లోతు మరింత వేగంగా పెరగడం ఆరంభిస్తుంది. శాస్త్రపరంగా చూస్తే ఖండపు అరలు అవి ఉన్న ఖండపు భూభాగంలో భాగాలే. ఖండం యొక్క అసలు సరిహద్దు తీరం కాదు, ఖండపు అర యొక్క అంచే ఖండం యొక్క సరిహద్దు.

ఈ ఖండపు అరల విస్తీర్ణత కూడా తక్కువేమీ కాదు. వాటి వెడల్పులో ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకి అమెరికా దేశానికి తూర్పు తీరంలో ఖం
డపు అర చాలా వెడల్పుగా ఉంటుంది. కాని పశ్చిమ తీరంలో ఖండపు అర వెడల్పు తక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఖండాలన్నిటిని చూస్తే ఖండపు అర యొక్క సగటు వెడల్పు 50 మైళ్లు ఉంటుంది. దీని మొత్తం విస్తీర్ణత 10 మిలియన్ చదరపు మైళ్లు ఉంటుంది. అంటే సోవియెట్ యూనియన్ కన్నా విశాలమైన ప్రాంతం అన్నమాట.

(Indian continental Shelf)

హిమావరణం గరిష్ఠ స్థాయిలో ఉన్న దశలలో ఈ ఖండపు అరలు బహిర్గతం అవుతాయి. గతంలో వచ్చిన మహా హిమయుగాలలో సరిగ్గా అదే జరిగింది. ఉదాహరణకి నేల మీద సంచరించే జంతువుల శిలాజాలు (ఏనుగుల దంతాల వంటివి), ఖండపు అర ప్రాంతంలో తీరం నుండి మైళ్ల దూరంలో, నీట్లో కొన్ని గజాల లోతులో దొరికాయి. అంతే కాక ఉత్తర గోళార్థంలో అధిక భాగం మంచులో కప్పబడి పోగా, మరింత దక్షిణ ప్రాంతాల్లో వర్షాపాతం ఇప్పటికన్నా ఎక్కువగా ఉండేది. ఉదాహరణకి సహారా ఎడారి ఆ దశలో ఓ విశాలమైన పచ్చిక బయలుగా ఉండేది. హిమ ప్రాంతం తరిగిపోవడం ఆరంభిస్తుంటే క్రమంగా సహారా కూడా ఎండిపోవడం మొదలెట్టింది. మనకు తెలిసిన మానవ చరిత్రకి కొంచెం ముందే ఈ పరిణామాలన్నీ జరిగాయి.

ఆ విధంగా భూమి మీద వివిధ ప్రాంతాల్లో మానవనివాసయోగ్యత లోలకపు చలనంలా మారుతూ వచ్చింది. సముద్ర మట్టం తగ్గుతూ ఉంటే విశాలమైన ఖండాలు మంచు ఎడారులుగా మారిపోతాయి. కాని ఖండపు అరలు, ప్రస్తుతం ఎడారులుగా ఉన్న భూములు మరింత నివాస యోగ్యంగా మారుతాయి. సముద్ర మట్టం పెరుగుతుంటే దిగువ నున్న భూములన్నీ జలమయం అవుతాయి. ధృవప్రాంతాలు మరింత నివాస యోగ్యం అవుతాయి. ఎడారి ప్రాంతాలు తరిగిపోతాయి.

(to be continued)

హిమానీనదాలు (glaciers)

Posted by V Srinivasa Chakravarthy Saturday, May 29, 2010 0 comments

భూమి మీద మంచుతో కప్పబడ్డ ప్రాంతం మొత్తం భూభాగంలో 10% ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న మంచు పరిమాణం 9 మిలియన్ ఘనమైళ్లు. ఆ హిమంలో 86% అట్లాంటిక్ ఖండ హిమానీనదంలో పోగై ఉంది. మరో 10% గ్రీన్లాండ్ హిమానీనదంలో ఉంది. ఇక మిగతా 4% ఐస్లాండ్, అలాస్కా, హిమాలయలు, ఆల్ప్స్ మొదలైన ప్రాంతాల్లో ఉన్న కాస్త చిన్నపాటి హిమానదాల్లో ఉంది.

ఆల్ప్స్ కి చెందిన్ హిమానీనదాల గురించి చాలా కాలంగానే అధ్యయనాలు జరుగుతున్నాయి. 1820 లలో జె. వెన్టెజ్ మరియు జాన్ ద కార్పెంట్యే అనే ఇద్దరు స్విస్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. ఆల్స్ప్ పర్వత ప్రాంతపు కేంద్ర భాగంలో ఉండాల్సిన రాళ్లు కొన్ని బాగా ఉత్తరంగా ఉన్న తలాల మీద కూడా ఉండడం కనిపించింది. పర్వతాల మీద ఉండే రాళ్లు తలాలకి ఎలా తరలాయి? దీన్ని బట్టి పర్వతాల మీద ఉండే హిమానీనదాలు ఒకప్పుడు మరింత విశాలమైన భూభాగం మీద విస్తరించి ఉండేవని ఆ శాస్త్రవేత్తలు ఊహించారు. అలా అమిత దూరాలు ప్రయాణించిన హిమానీనదాలు వాటి దారిలో పెద్ద పెద్ద బండలని విడిచి ఉండొచ్చు అన్నారు.

తరువాత స్విస్ జంతు శాస్త్రవేత్త జాన్ లూయీ రోడోల్ఫ్ అగాస్సీ ఈ భావనని మరింత లోతుగా పరిశీలించాడు. హిమానీనదాల్లో వరుసలుగా కమ్మీలు పాతి అవి కదులుతాయో లేదో గమనించాడు. అలాంటి పరిశీధనలతో 1840 కల్లా హిమానీనదాలకి సంబంధించిన ఓ ముఖ్యమైన సత్యాన్ని అతడు నిర్ధారించాడు. ఇవి కూడా నదులలాగే ప్రవహిస్తాయని, అయితే వాటి ప్రవాహ వేగం చాలా తక్కువని, ఏడాదిగి రమారమి 225 అడుగులు కదులుతాయని నిరూపించాడు. తదనంతరం యూరప్ అంతా విస్తృతంగా పర్యటించి హిమానీనదాల ఆనవాళ్లు, అవశేషాలు ఫ్రాన్స్ లోను, ఇంగ్లండ్ లోను కూడా కనుక్కున్నాడు. అసందర్భ పరిసరాలలో ఉన్న పెద్ద పెద్ద శిలలను ఎన్నో చోట్ల కనుక్కున్నాడు. చిన్న రాళ్లని కూడా మోసుకుపోయే హిమానీనదాలలో జరిగే మంచు మథనం వల్ల పెద్ద బండల్లో పడ్డ లోతైన గాట్లని గమనించాడు.

1846 లో అగాస్సీ అమెరికా దేశానికి వెళ్లి అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరాడు. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో, మిడ్వెస్ట్ ప్రాంతంలోను హిమావరణానికి (glaciation) సంబంధించిన ఆనవాళ్లు కనుక్కున్నాడు. అలాంటి పరిశోధనల వల్ల 1850 కల్లా ఒక విషయం మాత్రం రూఢి అయ్యింది. ఒకప్పుడు ఉత్తర గోళార్థం లో అధిక భాగం విశాలమైన ఖండాంతర హిమానీనదం చేత కప్పబడి ఉండేదని స్పష్టం అయ్యింది. అగాస్సీ కాలం నుండి హిమానీనదాలు విడిచి పెట్టిన అవశేషాలని ఎంతో మంది క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అధ్యయనాలలో మంచు నాలుగు సార్లు ముందుకి ప్రవహించి మళ్లీ వెనక్కి మళ్లిందని తేటతెల్లం అయ్యింది. 18,000 ఏళ్ల క్రితం అమెరికాలో సిన్సినాటీ నగరం వరకు కూడా ఈ హిమానీనదం విస్తరించి ఉండేదన్నమాట. మంచు మరింత ముందుకి వచ్చినప్పుడు దక్షిన గోళార్థం మరింత తడిగా, చలిగా ఉండేది. మంచు వెనక్కు మళ్లినప్పుడు దక్షిణం మరింత వెచ్చగా, పొడిగా మారేది. మంచు వెనక్కు పోయినప్పుడే ఆ దారిలో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. కెనేడియన్-అమెరికన్ మహా సరస్సులు అలా ఏర్పడ్డవే.

క్రిందటి సారి జరిగిన మంచు తిరోగమనం 8,000-12,000 ఏళ్లకి పూర్వం జరిగింది. ఈ మంచు యుగాలని పూర్వం భూమీ మీద సుమారు 100 మిలియన్ సంవత్సరాల కాలం పాటు వెచ్చని వాతావరణం నెలకొంది. ఆ కాలంలో ధృవాల వద్ద కూడా ఖండాంతర హిమానీనదాలు ఉండేవి కావు. స్పిట్జ్ బెర్గెన్ లో కనుక్కోబడ్డ బొగ్గు గనులు, అంటార్కిటికాలో కూడా కనిపించిన బొగ్గు యొక్క అవశేషాలు ఈ వాస్తవానికి సాక్ష్యాధారాలు. ఎందుకంటే గతంలో ఆ ప్రాంతంలో పచ్చని అటవీ సంపద ఉండేది అనడానికి బొగ్గు ఓ చక్కని సంకేతం.

హిమానీనదాల రాకపోకల ప్రభావం కేవలం పృథ్వీ వాతావరణం మీదే కాదు, ఖండాల ఆకారం మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి అంటార్కిటికాలోను, గ్రీన్లాండ్ లోను ప్రస్తుతం తరిగిపోతున్న హిమ సంపద పూర్తిగా కరిగిపోయిందంటే, సముద్ర మట్టం సుమారు 200 అడుగులు పెరుగుతుంది. దాంతో అన్ని ఖండాలలోను తీర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అంటే ప్రపంచ తీరాల మీద వెలసిన ఎన్నో మహానగరాలన్నీ జలమయం అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి న్యూ యార్క్ నగరంలోని మన్హాటన్ ప్రాంతంలో నీరు ఇరవయ్యవ అంతస్థు వరకు వస్తుంది అన్నమాట. తీరప్రాంతాల మాట అలా ఉంటే, ప్రస్తుతం తీవ్రమైన చలి గుప్పెటలో ఉన్న అలాస్కా, కెనడా, సైబీరియా, గ్రీన్లాండ్, మాత్రమే కాక అంటార్కిటికా కూడా మరింత మానవ నివాస యోగ్య ప్రాంతాలుగా పరిణతి చెందగలవు.

(to be continued...)

అంటార్కిటికా పర్యటనా చరిత్ర

Posted by V Srinivasa Chakravarthy Thursday, May 27, 2010 2 commentsఆధునిక యుగంలో ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాలు గొప్ప అంతర్జాతీయ వైజ్ఞానిక పరిశోధనా లక్ష్యాలుగా పరిణమించాయి. అలాంటి అంతర్జాతీయ వైజ్ఞానిక సహకారం 1882-1883 కాలంలో మొదలయ్యింది. ఆ సంవత్సరాన్ని ’అంతర్జాతీయ ధృవ సంవత్సరం’ గా చాటి ఎన్నో దేశాలు ధృవాల సమిష్టి పర్యటనలోను, పరిశోధనలోను పాల్గొన్నాయి.


ఆ పరిశోధనలో ధృవాల వద్ద ప్రత్యేక ఆకర్షణలైన రంగురంగుల అరోరా బోరియాలిస్ ప్రదర్శనలని, భూమి అయస్కాంత క్షేత్రాన్ని, ఇలా ఎన్నో ఆసక్తికరమైన భౌతిక పరిస్థితులని సమిష్టిగా పరిశోధించాయి. తరువాత 1932-1933 సంవత్సరాన్ని కూడా రెండవ అంతర్జాతీయ ధృవసంవత్సరంగా చాటారు. 1950 లో అమెరికా దేశానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త లాయిడ్ బెర్క్నర్ (మొట్టమొదటి బర్డ్ అంటార్కిటిక్ పర్యటనా బృందంలో ఇతడు పాల్గొన్నాడు) మూడవసారి అంతర్జాతీయ సంవత్సరాన్ని ప్రకటిస్తే బావుంటుందని సూచించాడు. ఈ ప్రతిపాదనకి ’అంతర్జాతీయ సమిష్టి వైజ్ఞానిక సదస్సు’ ఉత్సాహంగా స్పందించింది. ఈ సారి శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన అధునాతన వైజ్ఞానిక పరికరాలతో, తేలని చిక్కు ప్రశ్నలతో ధృవ యాత్రకి సిద్ధం అయ్యారు. కాస్మిక్ కిరణాల గురించి, వాతావరణంలో పైపొరల గురించి, సాగర గర్భం గురించి, అంతరిక్ష యాత్రల గురించి ఎన్నో ప్రశ్నల పరిశోధనకి పూనుకున్నారు.


చివరికి ఓ ’అంతర్జాతీయ భూభౌతిక సంవత్సరం’ (International Geophysical Year, IGY) ప్రకటించబడింది. ఈ సారి జులై 1, 1957 కి డిసెంబర్ 31, 1858 నడిమి కాలాన్ని ఎంచుకున్నారు. ఆ దశలో ప్రత్యేకించి సూర్యబిందువుల (sunspot) కి సంబందించిన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆ కాలాన్ని ఎంచుకున్నారు. ఈ బృహత్ ప్రయత్నంలో నానా దేశాలు వాటి శత్రుత్వాలని మరచి ఉత్సాహంగా పాల్గొన్నాయి. అమెరికా, రష్యా దేశాలు కూడా వాటి చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఓ మహత్తర వైజ్ఞానిక లక్ష్యసాధనలో చెయ్యి కలిపాయి.


సమాజం దృష్టిలో అంతర్జాతీయ భూభౌతిక సంవత్సరం వల్ల కలిగిన అతి ముఖ్యమైన ఫలితాలు అమెరికా, రష్యాలు పంపిన కృత్రిమ ఉపగ్రహాలు. కాని విజ్ఞాన పరంగా ఆ ఏడాది మరెన్నో చక్కని పరిణామాలు జరిగాయి. వాటిలో ఒకటి విస్తృతంగా జరిగిన అంతర్జాతీయ అంటార్కిటికా పర్యటన. అమెరికా దేశం అంటార్కిటికాలో ఏడు కేంద్రాలని స్థాపించింది. మంచు లోపలికి మైళ్ల లోతుకి తవ్వి అక్కడ మంచులో చిక్కుకున్న గాలి బుడగలని (ఇవి కొన్ని మిలియన్ సంవత్సరాలకి పూర్వానివి అయ్యుండొచ్చు), బాక్టీరియా అవశేషాలని సేకరించింది. మంచు నేలలో కొన్ని వందల అడుగుల లోతు నుండి పైకి తీసిన బాక్టీరియా మళ్లీ ప్రాణం పొసుకుని మామూలుగా ఎదిగాయి.


జనవరి 1958 లో సోవియెట్ బృందం అంటార్కిటికా ఖండంలో బాగా లోపలికి ’Pole of Inaccessibility’ అని ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దక్షణ ధృవం నుండి 600 మైళ్ల దూరంలో ఉన్న స్థావరం వద్ద రికార్డు స్థాయిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1960 లో ఆగస్టు నెలలో, అంటార్కిటికాలో శీతా కాలం నడుస్తున్న సమయంలో కార్బన్ డయాక్సయిడ్ కూడా గడ్డ కట్టేటంత తక్కువ ఉష్ణోగ్రత

-127 oC నమోదు అయ్యింది. ఆ తరువాతి దశాబ్దంలో ఏడాది పొడవునా పని చేసే వైజ్ఞానిక స్థావరాలు డజన్ల కొద్దీ అంటార్కిటికా మీద స్థాపించబడ్డాయి.


ఈ దశలోనే అంటార్కిటికా పర్యటనా చరిత్రలో ఓ కొత్త విజయం సాధించబడింది. వివియన్ ఎర్నెస్ట్ ఫుక్స్, మరియు ఎడ్మండ్ పర్సివల్ హిలరీ ల నేతృత్వంలో బ్రిటిష్ పర్యటనా బృందం చరిత్రలో మొట్టమొదటిసారిగా అంటార్కిటికా ఖండాన్ని ఒక కొస నుండి అవతలి కొసకి దాటింది. (అయితే ఈ ప్రయత్నంలో వాళ్లు ప్రత్యేక వాహనాలు, అధునాతన వైజ్ఞానిక సదుపాయాలు వాడుకున్నారన్న విషయం గమనించాలి.) ఎడ్మండ్ హిలరీ పేరు మనం మరో సందర్భంలో కూడా తలచుకుంటాం. టెన్సింగ్ నార్కే అనే షేర్పాతో కలిసి ఇతడు 1953 లో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాడు.

IGY సాధించిన వైజ్ఞానిక విజయాల కారణంగా, ప్రపంచ దేశాలు తమ శత్రుత్వాన్ని విస్మరించి ప్రదర్శించిన సుహృద్భావం కారణంగా 1959 లో పన్నెండు దేశాలు కలిసి ఓ ఒప్పందానికి వచ్చాయి. అంటార్కిటికా భూమిని సైనిక వ్యవహారాలకి దూరంగా ఉంచాలని ఆ ఒప్పందంలోని సారాంశం. అప్పట్నుంచి అంటార్కిటికా కేవలం వైజ్ఞానిక, పర్యటనా వ్యవహారాలకి మాత్రమే వేదిక అయ్యింది.

దక్షిణ ధృవం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, May 25, 2010 1 comments


ఇక దక్షిణ ధృవంలో ఖండం అంతా వ్యాపించిన హిమ ప్రాంతం ఉత్తరంలోని గ్రీన్లాండ్ కన్నా విశాలమైనది. అంటార్కిటిక్ హిమ ప్రాంతం వైశాల్యంలో గ్రీన్లాండ్ హిమానీనదం కన్నా 7 రెట్లు పెద్దది. అంటార్కిటిక్ మంచు పొర యొక్క సగటు మందం 1.5 మైళ్లు. కొన్ని చోట్ల 3 మైళ్లు కూడా ఉంటుంది. దీనికి కారణం అంటార్కిటికా ఖండం యొక్క 5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణతే. అందులో ఎంత భాగం నేలో, ఎంత భాగం సముద్రం మీద వ్యాపించిన మంచుగడ్డో ఇప్పటికీ ఎవరికీ కచ్చితంగా తెలీదు. అసలు అంటార్కిటికా కొన్ని ద్వీపాల సముదాయం అని, వాటన్నిటినీ కప్పే మంచే వాటిని కలిపి ఉంచుతోందని ఎంతో మంది నమ్ముతున్నారు. కాని ప్రస్తుతానికి మాత్రంఅంటార్కిటికా ఓ అఖండ ఖండం అన్న భావనదే పైచేయి అవుతోంది.అంటార్కిటిక్ వృత్తాన్ని దాటిన మొట్టమొదటి యూరోపియన్ ఇంగ్లండ్ కి చెందిన పేరు మోసిన నావికుడు జేమ్స్ కుక్ (ఈయన్నే కాప్టెన్ కుక్ అని కూడా పిలుస్తుంటారు). 1773 లో ఇతడు అంటార్కిటిక్ ప్రాంతం అంతా ప్రదక్షిణ చేసివచ్చాడు. (బహుశ ఈ మహా యాత్రే ఇంగ్లీష్ కవి సామ్యుయెల్ టెయిలర్ కోలెరిడ్జ్ 1798 లో రాసిన ’The rime of the Ancient Mariner’ అనే కవితకి స్ఫూర్తినిచ్చి ఉంటుంది. అతివిశాలమైన అంటార్కిటికా ప్రాంతం ద్వారా అట్లాంటిక్ నుండు పసిఫిక్ సముద్రానికి చేసిన యాత్రే ఈ కవిత్వంలోని కథావస్తువు.1819 లో బ్రిటిష్ పర్యాటకుడు విలియమ్ స్మిత్ దక్షిణ షెట్లాండ్ దీవులని కనుక్కున్నాడు. ఇవి అంటార్కిటికా తీరానికి కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్నాయి. 1821 లో ఓ రష్యన్ పర్యాటక బృందం అంటార్కిటిక్ వృత్తం లోపలే ఓ కొత్త దీవిని కనుక్కుంది. (దీనికి పీటర్-I అని పేరు పెట్టారు). అదే సంవత్సరంలో ఇంగ్లీష్ నావికుడు జార్జ్ పొవెల్ మరియు అమెరికన్ నావికుడు నథానియల్ బి. పామర్ లు కలిసి అంటార్కిటికా ఖండంలో భాగం అయిన ఓ ద్వీపకల్పాన్ని మొట్టమొదటిసారిగా చూశారు. దీనికే తరువాత పామర్ ద్వీపకల్పం (Palmer peninsula) అని పేరు వచ్చింది.


ఆ తరువాత వరుసగా రెండు మూడు దశాబ్దాలు ఎంతో మంది పర్యాటకులు దక్షిణ ధృవం మీదకి దండయాత్ర చేశారు. 1840 లో చార్లెస్ విల్కిస్ అనే అమెరికన్ నౌకాదళాధికారి అంటార్కిటికా పరిసరాలలో అంతవరకు పర్యాటకులకి ఎదురైన దీవుల వెనుక ఓ మహాఖండం ఉందని చాటాడు. అతడు చెప్పింది తరువాత నిజమయ్యింది. ఆ మహాఖండమే అంటార్కిటికా.


జేమ్స్ వెడెల్ అనే ఇంగ్లీష్ నావికుడు పామర్ ద్వీపకల్పానికి తూర్పు తీరం వైపు ఉన్న సముద్రంలో ముందుకి సాగి దక్షిణ ధృవానికి 900 మైళ్ల దూరం వరకు పోగలిగాడు. జేమ్స్ క్లార్క్ రాస్ అనే మరో బ్రిటిష్ నావికుడు అంటార్కిటికా కి మరింత దగ్గరిగా తీసుకుపోయే మరో సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఆ సముద్రాన్నే ప్రస్తుతం రాస్ సముద్రం అంటున్నాం. ఈ మార్గం వెంట దక్షిణ ధృవానికి 710 మైళ్ల దూరానికి పోగలిగాడు.

1902-1904 ప్రాంతాల్లో రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అనే మరో బ్రిటిష్ నావికుడు రాస్ మంచు అర (Ross ice shelf) మీద ప్రయాణించి దక్షిణ ధృవానికి 500 మైళ్ల దూరానికి పోగలిగాడు. తరువాత 1909 లో షాకెల్టన్ అనే మరో ఇంగ్లీష్ నావికుడు ఆ మంచు ప్రాంతాన్ని దాటి ధృవానికి 100 మైళ్ల వరకు పోగలిగాడు.


చివరికి 16 డిసెంబర్, 1911 లక్ష్యం నెరవేరింది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నవాడు నోర్వేజియన్ అన్వేషి రోవాల్డ్ అముండ్సెన్. మొదటి సారి విఫలుడైనా స్కాట్ మరో సారి ధృవం మీదకి దండెత్తాడు. అముండ్సెన్ ధృవాన్ని చేరుకున్న మూడు వారాల తరువాత స్కాట్ బృందం అక్కడికి చేరుకుంది. తమ కన్నా ముందే అముండ్సెన్ బృందం అక్కడ ఎగరేసిన జెండాని చూసి స్కాట్ బృందం నీరుగారిపోయారు. కాళ్లీడ్చుకుంటూ వెనక్కి బయల్దేరిన స్కాట్ బృందం మంచులో చిక్కుకుని ప్రాణాలు విడిచారు.


1920 లలో విమానం ద్వారా అంటార్కిటికా విజయం పూర్తయ్యింది. ఆస్ట్రేలియాకి చెందిన జార్జ్ హ్యూబర్ట్ విల్కిన్స్ అనే అన్వేషి అంటార్కిటికా తీరం వెంట 1200 మైళ్లు ఎగిరాడు. అలాగే 1929 లో రిచర్డ్ ఎవెలిన్ బర్డ్ కూడా విమానంలో దక్షిణ ధృవం మీదుగా ఎగిరాడు. అప్పటికే అమెరికా దేశం ’లిటిల్ అమెరికా-I’ అనే ఓ స్థావరాన్ని కూడా ఆ ఖండం మీద ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Robert Falcon Scott

ఉత్తర ధృవం

Posted by V Srinivasa Chakravarthy Monday, May 24, 2010 0 comments


ఉత్తర గోళార్థంలో అతి పెద్ద మంచు ప్రాంతం గ్రీన్లాండ్ కేంద్రంగా విస్తరించి ఉంది. ఆ ప్రాంతాన్ని ఎన్నో వైజ్ఞానిక బృందాలు పర్యటించాయి. 840,000 చదరపు మైళ్ల విస్తీర్ణత ఉన్న ఆ దీవిలో 640,000 చదరపు మైళ్ల ప్రాంతం మంచుతో కప్పబడి ఉంది. కొన్ని చోట్ల ఆ మంచు పొర మందం 1 మైలు దాకా కూడా ఉండొచ్చని అంచనా.

పేరుకున్న మంచు భారం పెరుగుతున్న కొద్దీ, మంచు ముక్కలు ముక్కలుగా విరిగి మంచుశిఖరులు (ice bergs) ఏర్పడతాయి. ఏటా ఉత్తర గోళార్థంలో అలా 16,000 మంచు శిఖరులు ఏర్పడతాయని అంచనా. ఈ మంచు శిఖరులు నెమ్మదిగా దక్షిణంగా, ముఖ్యంగా పశ్చిమ అట్లంటిక్ సముద్ర భాగం వెంట కొట్టుకొస్తాయి. ఉత్తర అమెరికా ఖండం లో North-East కొస వద్ద ఉన్న న్యూ ఫౌండ్ లాండ్ ప్రాంతం ద్వారా ఏటా 400 మంచుశిఖరులు కొట్టుకొచ్చి సముద్ర రవాణా మార్గాలకి భంగం కలిగిస్తాయి. 1870-1890 నడిమి కాలంలో వీటి వల్ల 14 ఓడలు మునిగిపోయాయి. మరో 40 ఓడలు ఈ మంచుశిఖరులని ఢీకొని తీవ్రంగా దెబ్బ తిన్నాయి.1912 లో జరిగిన ఉపద్రవంతో ఈ ఒరవడి తారస్థాయిని చేరుకుంది. నౌకా చరిత్రలోనే సాటిలేనిది అని చెప్పుకోదగ్గ టైటానిక్ మహానౌక ఆ ఏడాది తన మొదటి యాత్రలోనే ఓ మంచుశిఖరికి గుద్దుకుని నీట మునిగింది. అప్పట్నుంచి ఈ జీవంలేని మంచు రాకాసుల కదలికలని కనిపెడుతూ అంతర్జాతీయ, పర్యవేక్షణ, సహకారం మొదలయ్యింది. ఈ ’మంచు గస్తీ’ మొదలైన నాటి నుండి మంచుశిఖరులని ఢీకొని ఒక్క ఓడ కూడా మునిగిపోలేదు.

ధృవ ప్రాంతాలు

Posted by V Srinivasa Chakravarthy Saturday, May 22, 2010 0 comments


ధృవ ప్రాంతాలు

భూమి యొక్క ధృవ ప్రాంతాలు ఎంతో కాలంగా మానవ మేధస్సును ఆకట్టుకున్నాయి. మానవ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన పర్వం ధృవప్రాంతాల అన్వేషణ, పర్యటన. ఇక్కడి కన్నుల విందు చేసే దృశ్యాలు, అలౌకిక పరిసరాలు, మనిషి మనసును దోచుకున్నాయి. అరోరాలు అనబడే రమ్యమైన ఆకాశకాంతులు, అతిశీతల పరిస్థితులు, పృథ్వీ వాతావరణాన్న్ నియంత్రిస్తూ మానవ భవితవ్యాన్ని నిర్ణయించే బృహత్తర హిమాశయాలు – ఇవీ భూమి ధృవాల విశేషాలు.


Arora Borealis

A scene of Arctic ocean seen from Norway coast

ధ్రూవాల గురించి చూచాయగా ఎంతో కాలంగా తెలిసినా, ధృవాలని సందర్శించే ప్రయత్నం ఇటీవలి కాలంలోనే జరిగింది. క్రిస్టఫర్ కొలంబస్ చేసిన అమెరికా ఖండాల ఆవిష్కరణతో భూమి నలుమూలలని పర్యటించాలనే ఉత్సాహం పెరిగింది.

ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరంగా సముద్ర మార్గాలని కనుక్కోవాలనే ఉద్దేశంతో ఆర్కిటిక్ ధృవ ప్రాంతాన్ని మొట్టమొదటి సాగిగా పర్యటించడం జరిగింది. హోలండ్ రాజ్యంలో నియామకంలో ఉన్న బ్రిటిష్ నావికుడు హెన్రీ హడ్సన్ ఉత్తర ధృవం కోసం గాలిస్తూ బయలుదేరి ఆ ప్రయత్నంలో హడ్సన్ ఖాతం (Hudson Bay) ని కనుక్కున్నాడు. కాని దురదృష్టవశాత్తు ఆ యాత్రలోనే తన జీవన యాత్ర సమాప్తం అయ్యింది. మరో ఆరేళ్ల తరువాత విలియన్ బఫిన్ అనే మరో ఇంగ్లీష్ నావికుడు ఉత్తర ధృవానికి ఇంచుమించు 800 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలిగాడు. ఇతడు కనుక్కున్న మరో ఖాతానికే బఫిన్ ఖాతం (Baphin Bay) అని పేరు వచ్చింది.

A map of Arctic Ocean (Baffin Bay can be seen)


తదనంతరం 1848-1848 ప్రాంతాల్లో జాన్ ఫ్రాన్క్లిన్ అనే బ్రిటిష్ నావికుడు కెనడా ఉత్తర తీరం వెంట ప్రయాణించి ’North-West Passage’ మార్గాన్ని కనుక్కున్నాడు. ఇతడు కూడా ఆ యాత్రలోనే మరణించాడు.

అప్పట్నుంచి ఓ అర్థశతాబ్ద కాలం పాటు ఉత్తర ధృవాన్ని చేరే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. ఎలాగైనా ఉత్తర ధృవాన్ని ముందు చేరుకోవాలన్న పోటీయే ఆ ప్రయత్నాల ఊపిరి పోసింది. 1873 లో జూలియస్ పేయర్ మరియు కార్ల్ వేయ్ప్రెక్ట్ అనే ఇద్దరు ఆస్ట్రియాకి చెందిన నావికులు ఉత్తర ధృవానికి 600 మైళ్ల దూరం వరకు వెళ్లగలిగారు. అక్కడ వాళ్లు కనుక్కున్న ఓ ద్వీపమాలికకు ఆస్ట్రియన్ చక్రవర్తి గౌరవార్థం ఫ్రాన్స్ జోసెఫ్ లాండ్ అని పేరు పెట్టారు. 1896 లో నార్వే కి చెందిన ఫ్రిడ్జఫ్ నాన్సెన్ అనే అన్వేషి ధృవానికి 300 మైళ్ల దూరం వరకు పోగలిగాడు. చివరికి 1909 లో ఏప్రిల్ 6 నాడు అమెరికన్ నావికుడు రాబర్ట్ ఎడ్విన్ పియరీ ధృవాన్ని జయించగలిగాడు.
Robert Edwin Peary


ఇక వర్తమానంలో ఉత్తర ధృవానికి సంబంధించిన రహస్యాలేవీ మిగలలేదనే చెప్పాలి. మంచు మీద, గాలిలోను, నీటి అడుగున ఉత్తర ధృవ ప్రాంతాన్ని విస్తృతంగా పర్యటించడం జరిగింది. 1926 లో రిచర్డ్ ఎవెలిన్ బర్డ్ మరియు ఫ్లాయిడ్ బెనెట్ లు విమానంలో ధృవం మీదుగా మొట్టమొదటి సారిగా ఎగిరారు. ఉత్తర ధృవం వద్ద నీటిలో జలాంతర్గాములు కూడా పర్యటించాయి.


An American submarine (USS Perch) in the Arctic (1950)(to be continued...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email