ఆల్ప్స్ కి చెందిన్ హిమానీనదాల గురించి చాలా కాలంగానే అధ్యయనాలు జరుగుతున్నాయి. 1820 లలో జె. వెన్టెజ్ మరియు జాన్ ద కార్పెంట్యే అనే ఇద్దరు స్విస్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. ఆల్స్ప్ పర్వత ప్రాంతపు కేంద్ర భాగంలో ఉండాల్సిన రాళ్లు కొన్ని బాగా ఉత్తరంగా ఉన్న తలాల మీద కూడా ఉండడం కనిపించింది. పర్వతాల మీద ఉండే రాళ్లు తలాలకి ఎలా తరలాయి? దీన్ని బట్టి పర్వతాల మీద ఉండే హిమానీనదాలు ఒకప్పుడు మరింత విశాలమైన భూభాగం మీద విస్తరించి ఉండేవని ఆ శాస్త్రవేత్తలు ఊహించారు. అలా అమిత దూరాలు ప్రయాణించిన హిమానీనదాలు వాటి దారిలో పెద్ద పెద్ద బండలని విడిచి ఉండొచ్చు అన్నారు.
తరువాత స్విస్ జంతు శాస్త్రవేత్త జాన్ లూయీ రోడోల్ఫ్ అగాస్సీ ఈ భావనని మరింత లోతుగా పరిశీలించాడు. హిమానీనదాల్లో వరుసలుగా కమ్మీలు పాతి అవి కదులుతాయో లేదో గమనించాడు. అలాంటి పరిశీధనలతో 1840 కల్లా హిమానీనదాలకి సంబంధించిన ఓ ముఖ్యమైన సత్యాన్ని అతడు నిర్ధారించాడు. ఇవి కూడా నదులలాగే ప్రవహిస్తాయని, అయితే వాటి ప్రవాహ వేగం చాలా తక్కువని, ఏడాదిగి రమారమి 225 అడుగులు కదులుతాయని నిరూపించాడు. తదనంతరం యూరప్ అంతా విస్తృతంగా పర్యటించి హిమానీనదాల ఆనవాళ్లు, అవశేషాలు ఫ్రాన్స్ లోను, ఇంగ్లండ్ లోను కూడా కనుక్కున్నాడు. అసందర్భ పరిసరాలలో ఉన్న పెద్ద పెద్ద శిలలను ఎన్నో చోట్ల కనుక్కున్నాడు. చిన్న రాళ్లని కూడా మోసుకుపోయే హిమానీనదాలలో జరిగే మంచు మథనం వల్ల పెద్ద బండల్లో పడ్డ లోతైన గాట్లని గమనించాడు.
1846 లో అగాస్సీ అమెరికా దేశానికి వెళ్లి అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరాడు. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో, మిడ్వెస్ట్ ప్రాంతంలోను హిమావరణానికి (glaciation) సంబంధించిన ఆనవాళ్లు కనుక్కున్నాడు. అలాంటి పరిశోధనల వల్ల 1850 కల్లా ఒక విషయం మాత్రం రూఢి అయ్యింది. ఒకప్పుడు ఉత్తర గోళార్థం లో అధిక భాగం విశాలమైన ఖండాంతర హిమానీనదం చేత కప్పబడి ఉండేదని స్పష్టం అయ్యింది. అగాస్సీ కాలం నుండి హిమానీనదాలు విడిచి పెట్టిన అవశేషాలని ఎంతో మంది క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అధ్యయనాలలో మంచు నాలుగు సార్లు ముందుకి ప్రవహించి మళ్లీ వెనక్కి మళ్లిందని తేటతెల్లం అయ్యింది. 18,000 ఏళ్ల క్రితం అమెరికాలో సిన్సినాటీ నగరం వరకు కూడా ఈ హిమానీనదం విస్తరించి ఉండేదన్నమాట. మంచు మరింత ముందుకి వచ్చినప్పుడు దక్షిన గోళార్థం మరింత తడిగా, చలిగా ఉండేది. మంచు వెనక్కు మళ్లినప్పుడు దక్షిణం మరింత వెచ్చగా, పొడిగా మారేది. మంచు వెనక్కు పోయినప్పుడే ఆ దారిలో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. కెనేడియన్-అమెరికన్ మహా సరస్సులు అలా ఏర్పడ్డవే.
క్రిందటి సారి జరిగిన మంచు తిరోగమనం 8,000-12,000 ఏళ్లకి పూర్వం జరిగింది. ఈ మంచు యుగాలని పూర్వం భూమీ మీద సుమారు 100 మిలియన్ సంవత్సరాల కాలం పాటు వెచ్చని వాతావరణం నెలకొంది. ఆ కాలంలో ధృవాల వద్ద కూడా ఖండాంతర హిమానీనదాలు ఉండేవి కావు. స్పిట్జ్ బెర్గెన్ లో కనుక్కోబడ్డ బొగ్గు గనులు, అంటార్కిటికాలో కూడా కనిపించిన బొగ్గు యొక్క అవశేషాలు ఈ వాస్తవానికి సాక్ష్యాధారాలు. ఎందుకంటే గతంలో ఆ ప్రాంతంలో పచ్చని అటవీ సంపద ఉండేది అనడానికి బొగ్గు ఓ చక్కని సంకేతం.
హిమానీనదాల రాకపోకల ప్రభావం కేవలం పృథ్వీ వాతావరణం మీదే కాదు, ఖండాల ఆకారం మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి అంటార్కిటికాలోను, గ్రీన్లాండ్ లోను ప్రస్తుతం తరిగిపోతున్న హిమ సంపద పూర్తిగా కరిగిపోయిందంటే, సముద్ర మట్టం సుమారు 200 అడుగులు పెరుగుతుంది. దాంతో అన్ని ఖండాలలోను తీర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అంటే ప్రపంచ తీరాల మీద వెలసిన ఎన్నో మహానగరాలన్నీ జలమయం అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి న్యూ యార్క్ నగరంలోని మన్హాటన్ ప్రాంతంలో నీరు ఇరవయ్యవ అంతస్థు వరకు వస్తుంది అన్నమాట. తీరప్రాంతాల మాట అలా ఉంటే, ప్రస్తుతం తీవ్రమైన చలి గుప్పెటలో ఉన్న అలాస్కా, కెనడా, సైబీరియా, గ్రీన్లాండ్, మాత్రమే కాక అంటార్కిటికా కూడా మరింత మానవ నివాస యోగ్య ప్రాంతాలుగా పరిణతి చెందగలవు.
(to be continued...)
0 comments