ఇక దక్షిణ ధృవంలో ఖండం అంతా వ్యాపించిన హిమ ప్రాంతం ఉత్తరంలోని గ్రీన్లాండ్ కన్నా విశాలమైనది. అంటార్కిటిక్ హిమ ప్రాంతం వైశాల్యంలో గ్రీన్లాండ్ హిమానీనదం కన్నా 7 రెట్లు పెద్దది. అంటార్కిటిక్ మంచు పొర యొక్క సగటు మందం 1.5 మైళ్లు. కొన్ని చోట్ల 3 మైళ్లు కూడా ఉంటుంది. దీనికి కారణం అంటార్కిటికా ఖండం యొక్క 5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణతే. అందులో ఎంత భాగం నేలో, ఎంత భాగం సముద్రం మీద వ్యాపించిన మంచుగడ్డో ఇప్పటికీ ఎవరికీ కచ్చితంగా తెలీదు. అసలు అంటార్కిటికా కొన్ని ద్వీపాల సముదాయం అని, వాటన్నిటినీ కప్పే మంచే వాటిని కలిపి ఉంచుతోందని ఎంతో మంది నమ్ముతున్నారు. కాని ప్రస్తుతానికి మాత్రంఅంటార్కిటికా ఓ అఖండ ఖండం అన్న భావనదే పైచేయి అవుతోంది.
అంటార్కిటిక్ వృత్తాన్ని దాటిన మొట్టమొదటి యూరోపియన్ ఇంగ్లండ్ కి చెందిన పేరు మోసిన నావికుడు జేమ్స్ కుక్ (ఈయన్నే కాప్టెన్ కుక్ అని కూడా పిలుస్తుంటారు). 1773 లో ఇతడు అంటార్కిటిక్ ప్రాంతం అంతా ప్రదక్షిణ చేసివచ్చాడు. (బహుశ ఈ మహా యాత్రే ఇంగ్లీష్ కవి సామ్యుయెల్ టెయిలర్ కోలెరిడ్జ్ 1798 లో రాసిన ’The rime of the Ancient Mariner’ అనే కవితకి స్ఫూర్తినిచ్చి ఉంటుంది. అతివిశాలమైన అంటార్కిటికా ప్రాంతం ద్వారా అట్లాంటిక్ నుండు పసిఫిక్ సముద్రానికి చేసిన యాత్రే ఈ కవిత్వంలోని కథావస్తువు.
1819 లో బ్రిటిష్ పర్యాటకుడు విలియమ్ స్మిత్ దక్షిణ షెట్లాండ్ దీవులని కనుక్కున్నాడు. ఇవి అంటార్కిటికా తీరానికి కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్నాయి. 1821 లో ఓ రష్యన్ పర్యాటక బృందం అంటార్కిటిక్ వృత్తం లోపలే ఓ కొత్త దీవిని కనుక్కుంది. (దీనికి పీటర్-I అని పేరు పెట్టారు). అదే సంవత్సరంలో ఇంగ్లీష్ నావికుడు జార్జ్ పొవెల్ మరియు అమెరికన్ నావికుడు నథానియల్ బి. పామర్ లు కలిసి అంటార్కిటికా ఖండంలో భాగం అయిన ఓ ద్వీపకల్పాన్ని మొట్టమొదటిసారిగా చూశారు. దీనికే తరువాత పామర్ ద్వీపకల్పం (Palmer peninsula) అని పేరు వచ్చింది.
ఆ తరువాత వరుసగా రెండు మూడు దశాబ్దాలు ఎంతో మంది పర్యాటకులు దక్షిణ ధృవం మీదకి దండయాత్ర చేశారు. 1840 లో చార్లెస్ విల్కిస్ అనే అమెరికన్ నౌకాదళాధికారి అంటార్కిటికా పరిసరాలలో అంతవరకు పర్యాటకులకి ఎదురైన దీవుల వెనుక ఓ మహాఖండం ఉందని చాటాడు. అతడు చెప్పింది తరువాత నిజమయ్యింది. ఆ మహాఖండమే అంటార్కిటికా.
జేమ్స్ వెడెల్ అనే ఇంగ్లీష్ నావికుడు పామర్ ద్వీపకల్పానికి తూర్పు తీరం వైపు ఉన్న సముద్రంలో ముందుకి సాగి దక్షిణ ధృవానికి 900 మైళ్ల దూరం వరకు పోగలిగాడు. జేమ్స్ క్లార్క్ రాస్ అనే మరో బ్రిటిష్ నావికుడు అంటార్కిటికా కి మరింత దగ్గరిగా తీసుకుపోయే మరో సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఆ సముద్రాన్నే ప్రస్తుతం రాస్ సముద్రం అంటున్నాం. ఈ మార్గం వెంట దక్షిణ ధృవానికి 710 మైళ్ల దూరానికి పోగలిగాడు.
1902-1904 ప్రాంతాల్లో రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అనే మరో బ్రిటిష్ నావికుడు రాస్ మంచు అర (Ross ice shelf) మీద ప్రయాణించి దక్షిణ ధృవానికి 500 మైళ్ల దూరానికి పోగలిగాడు. తరువాత 1909 లో షాకెల్టన్ అనే మరో ఇంగ్లీష్ నావికుడు ఆ మంచు ప్రాంతాన్ని దాటి ధృవానికి 100 మైళ్ల వరకు పోగలిగాడు.
చివరికి 16 డిసెంబర్, 1911 లక్ష్యం నెరవేరింది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నవాడు నోర్వేజియన్ అన్వేషి రోవాల్డ్ అముండ్సెన్. మొదటి సారి విఫలుడైనా స్కాట్ మరో సారి ధృవం మీదకి దండెత్తాడు. అముండ్సెన్ ధృవాన్ని చేరుకున్న మూడు వారాల తరువాత స్కాట్ బృందం అక్కడికి చేరుకుంది. తమ కన్నా ముందే అముండ్సెన్ బృందం అక్కడ ఎగరేసిన జెండాని చూసి స్కాట్ బృందం నీరుగారిపోయారు. కాళ్లీడ్చుకుంటూ వెనక్కి బయల్దేరిన స్కాట్ బృందం మంచులో చిక్కుకుని ప్రాణాలు విడిచారు.
1920 లలో విమానం ద్వారా అంటార్కిటికా విజయం పూర్తయ్యింది. ఆస్ట్రేలియాకి చెందిన జార్జ్ హ్యూబర్ట్ విల్కిన్స్ అనే అన్వేషి అంటార్కిటికా తీరం వెంట 1200 మైళ్లు ఎగిరాడు. అలాగే 1929 లో రిచర్డ్ ఎవెలిన్ బర్డ్ కూడా విమానంలో దక్షిణ ధృవం మీదుగా ఎగిరాడు. అప్పటికే అమెరికా దేశం ‘’లిటిల్ అమెరికా-I’ అనే ఓ స్థావరాన్ని కూడా ఆ ఖండం మీద ఏర్పాటు చెయ్యడం జరిగింది.
Robert Falcon Scott
శ్రీనివాస చక్రవర్తి గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.