ఉత్తర గోళార్థంలో అతి పెద్ద మంచు ప్రాంతం గ్రీన్లాండ్ కేంద్రంగా విస్తరించి ఉంది. ఆ ప్రాంతాన్ని ఎన్నో వైజ్ఞానిక బృందాలు పర్యటించాయి. 840,000 చదరపు మైళ్ల విస్తీర్ణత ఉన్న ఆ దీవిలో 640,000 చదరపు మైళ్ల ప్రాంతం మంచుతో కప్పబడి ఉంది. కొన్ని చోట్ల ఆ మంచు పొర మందం 1 మైలు దాకా కూడా ఉండొచ్చని అంచనా.
పేరుకున్న మంచు భారం పెరుగుతున్న కొద్దీ, మంచు ముక్కలు ముక్కలుగా విరిగి మంచుశిఖరులు (ice bergs) ఏర్పడతాయి. ఏటా ఉత్తర గోళార్థంలో అలా 16,000 మంచు శిఖరులు ఏర్పడతాయని అంచనా. ఈ మంచు శిఖరులు నెమ్మదిగా దక్షిణంగా, ముఖ్యంగా పశ్చిమ అట్లంటిక్ సముద్ర భాగం వెంట కొట్టుకొస్తాయి. ఉత్తర అమెరికా ఖండం లో North-East కొస వద్ద ఉన్న న్యూ ఫౌండ్ లాండ్ ప్రాంతం ద్వారా ఏటా 400 మంచుశిఖరులు కొట్టుకొచ్చి సముద్ర రవాణా మార్గాలకి భంగం కలిగిస్తాయి. 1870-1890 నడిమి కాలంలో వీటి వల్ల 14 ఓడలు మునిగిపోయాయి. మరో 40 ఓడలు ఈ మంచుశిఖరులని ఢీకొని తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
1912 లో జరిగిన ఉపద్రవంతో ఈ ఒరవడి తారస్థాయిని చేరుకుంది. నౌకా చరిత్రలోనే సాటిలేనిది అని చెప్పుకోదగ్గ టైటానిక్ మహానౌక ఆ ఏడాది తన మొదటి యాత్రలోనే ఓ మంచుశిఖరికి గుద్దుకుని నీట మునిగింది. అప్పట్నుంచి ఈ జీవంలేని మంచు రాకాసుల కదలికలని కనిపెడుతూ అంతర్జాతీయ, పర్యవేక్షణ, సహకారం మొదలయ్యింది. ఈ ’మంచు గస్తీ’ మొదలైన నాటి నుండి మంచుశిఖరులని ఢీకొని ఒక్క ఓడ కూడా మునిగిపోలేదు.
0 comments