శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.






బ్లాగర్లకి జాతీయ సైన్స్ దిన శుభాకాంక్షలు!
ఈ సందర్భంగా నిన్న చెన్నై  బి రేడియో స్టేషన్ లో నా ప్రసంగం ఒకటి వచ్చింది … అని అనుకుంటున్నాను. రేడియో స్టేషన్ అధికారి చెప్పిన టైమ్ శనివారం ఫిబ్రవరి 27, ఉదయం 8:15  గంటలకి. కాని నా వద్ద రేడియో లేక  అది వినడం సాధ్యపడలేదు.
ఆ ప్రసంగంలోని అంశాలు ఇక్కడ ఇస్తున్నాను.
 ---


మన సమాజంలో సైన్స్ చదువు, సైన్స్ అవగాహన

ఈ నెల 28 వ తారీఖుని National Science Day  గా మన ప్రభుత్వం ప్రకటించింది. 1928 లో సర్ సివి రామన్ కి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఈ రోజుకి ఇలాంటి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
ఇరవయ్యొకటవ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ ప్రభావం బలంగా ఉండడం మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా సైన్స్ చదువుల పట్ల, science career  పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. సైన్స్ కే అంకితమైన ఐసర్ ల లాంటి కొత్త సంస్థల స్థాపన మాత్రమే కాక, ..టి.ల వంటి మేటి విద్యాసంస్థల్లో కూడా సైన్స్ పరిశోధనకి, పి.హెచ్.డి ప్రోగ్రామ్లకి నానాటికి ప్రాముఖ్యత పెరగడం విశేషం.

అయితే విద్యా రంగంలో సైన్స్ విషయంలో ఎంతో పురోగతి జరుగుతున్నా, భారతీయ సమాజంలో మాత్రం సైన్స్ ఇంకా తగినంత లోతుగా  పాతుకుపోలేదని అనిపిస్తుంది. సైన్స్ ఇచ్చే పరికరాలని మనం విరివిగా వాడుతున్నాం గాని, సైన్స్ భావనల అవగాహన విషయంలో మాత్రం మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ విషయం గురించి నేను ప్రత్యక్షంగా చూసినవి గాని, పరోక్షంగా విన్నవి గాని కొన్ని ఉదాహరణలు పేర్కొంటాను.
మొదటి ఉదాహరణ. ఎయిడ్ ఇండియా అనే ఎన్.జి.వో లో పని చేసే నా మిత్రుడొకడు, తమిళనాడులో తను పని చేసిన కొన్ని పల్లెటూరి పాఠశాలలో కలిగిన ఒక స్వీయానుభవం చెప్తాడు. ‘భూమి గుండ్రంగా ఉందిఅన్న భావన చాలా మంది పిల్లలకి మింగుడు పడదట. మరి భూమి గుండ్రంగా ఉన్నట్లయితే, దక్షిణ గోళార్థంలో ఉన్న మనుషులంతా రాలికిందపడిపోవాలి కదా? అన్నది వారి సందేహం! భూమి గుండ్రంగా వుంది అన్నది ఒక ప్రాథమిక వైజ్ఞానిక సత్యం. అలాంటి విషయంలో ఈ రోజుల్లో కూడా అపోహలు ఉండడం కొంచెం ఆలొచించదగ్గ విషయం.

రెండో ఉదాహరణ. 2008 లో ఇస్రో సంస్థ పంపిన చంద్రయాన్ మిషన్ వల్ల చందమామ మీద నీరు ఉందని తెలిసిన విషయం మనకి తెలుసు. మిషన్ స్పేస్ రంగంలో మన దేశం సాధించిన ప్రగతికి చిహ్నం. భారతీయులకి అది ఎంతో గర్వకారణం. వార్త వచ్చిన నేపథ్యంలో ఒక వెబ్ సైట్ లో ఒకాయన తెలుగులో ఇలా రాస్తున్నాడు – “చందమామ మీద నీరు ఉన్న విషయం శాస్త్రవేత్తలకి రోజు తెలిసొచ్చిందేమో గాని, ప్రాచీన భారతీయులకి ఇది అనాదిగా తెలిసిన విషయం. ఎందుకంటే… “ ( వివరణ మహా తమాషాగా వుంటుంది,) “మన  పురాణాల ప్రకారం శివుడి తల మీద గంగాదేవి వుంటుంది. శివుడి తల మీద చంద్రరేఖ కూడా వుంటుంది. ఎగసిపడే గంగాజలంలో కొంత చంద్రుడి మీడ పడడం వల్ల చందమామ  మీద నీరు చేరుతుంది. అంటే మన పూర్వీకులకి చంద్రుడి మీద నీరు ఉందన్న విషయం ఏనాడో తెలుసు అన్నమాట.” వివరణ చదివి నాకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాలేదు. విధంగా పురాణాలని అడ్డం పెట్టుకుని ఎలాగైనా వాదించొచ్చు. ప్రతీది మనకి ముందే తెలుసని, ఇక మనం తెలుసుకోవలసినది ఏమీ లేదని బొంకచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇక కొత్త సత్యాలని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు  చేసే విశ్వప్రయత్నం అంతా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.

మూడో ఉదాహరణ. ఒకసారి పెద్ద పుస్తకాల షాపులో కొత్త పుస్తకాలు ప్రదర్శించే చోట భారీ తెలుగు పుస్తకం కనిపించింది. పుస్తకం పేరుప్రాచీన జ్ఞాన నిధులు.’ అలవోకగా పేజీ వద్ద తెరిచి చూశాను. సంస్కృతంలో (తెలుగులో చెప్తే జనం నమ్మరు గనుక!) ఏదో పద్యం, దానికి తెలుగులో టీకా తాత్పర్యం ఉంది. పద్యం స్త్రీల బహిష్టు గురించి. బహిష్టు అంటే periods నక్షత్రంలో జరిగితే, ఎలాంటినిష్కృతిచెయ్యాలో చెప్తోందా పద్యం. అది చదివి అదిరిపోయాను

అసలు బహిష్టుకి నక్షత్రాల స్థానాలకి సంబంధం ఏమిటి? స్త్రీల సమస్యల గురించి అత్యంత ప్రాథమికమైన  వైద్య  సమాచారం కూడా మామూలుగా తెలుగులో దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అశాస్త్రీయమైన సమాచారం ఇంత ఖరీదైన పుస్తకాల రూపంలో ప్రచురించబడడం  ఆశ్చర్యం కలిగించింది.

నాలుగో ఉదాహరణ. ఇలాంటి పాతకాలపు నమ్మకాలు పట్టుకుని వేలాడే వారు సైన్స్ గురించి బొత్తిగా తెలీని వారు అయితే అర్థం చేసుకోవచ్చు. కాని సైన్స్ బాగా తెలిసిన వారు కూడా ఇలాంటి అనిర్ధారిత నమ్మకాలని పట్టుకుని వేలాడటం ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది

ఒక సారి ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అంటుండగా విన్నాను – “అందుకేనేమో మన పూర్వీకులు బంగారాన్ని ఒంటికి పైభాగంలోను, వెండిని ఒంటికి కింద భాగంలోను ధరించాలని అంటారు. ఎందుకంటే బంగారం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వెండి రక్త ప్రసరణ పెంచుతుంది”(!!!) అది విని నేనుదీని భావమేమి?’ అని దీర్ఘాలోచనలో పడ్డాను. ఒంటి మీద ధరించే బంగారు అభరణాలు ఒంట్లోని రక్తాన్ని ఎలా శుధ్ధి చేస్తాయి? అసలు రక్తాన్నిశుధ్ధిచెయ్యడం అంటే ఏంటి? కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించి, ఆక్సిజన్ ని చొప్పించడమా? అలాగే పాదాలని అలంకరించే వెండి గజ్జెలు రక్తప్రసరణని ఎలా పెంచుతాయి? సమాధానాలు లేని నూరు ప్రశ్నలు లేవదీయొచ్చు
ఐదో ఉదాహరణ. ఒక రోజు మణులు అంటే gems గురించి TV లో advertisement  చూస్తున్నాను. అందరిలాగా కాక వాళ్లు మణులనిసైంటిఫిక్ గా సర్టిఫై చేసిఅమ్ముతారని గొప్పగా చెప్తున్నాడు సేల్స్ మన్. మణి కట్టుకుంటే వ్యాధి నయం అవుతుందో అంతా సైంటిఫిక్ గా తేల్చి చెప్తామని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ సైన్స్ ని తప్పుగా వాడుకోవడం మనకి కనిపిస్తుంది. నిజంగానే gemology అనే శాస్త్రం వుంది. అది మణుల నాణ్యత గురించి  శాస్త్రీయంగా నిర్ధారించి చెప్తుంది. మణుల crystal structure, specific gravity, refractive index మొదలైన లక్షణాల బట్టి, మణి యొక్క spectroscopic analysis బట్టి మణి నాణ్యతని వెలకట్టొచ్చు. అంతవరకు అంతా శాస్త్రీయమే. కాని మణి ఒంటి మీద పెట్టుకుంటే జబ్బులు నయం కావడాలు, ఉద్యోగాలు రావడాలు, పెళ్ళి సంబంధాలు  కుదరడాలు మొదలైనవన్నీ అశాస్త్రీయమైన విషయాలు

పై ఉదాహరణలలో మనకి శాస్త్రీయ విషయాలని విచ్చలవిడిగా అశాస్త్రీయమైన కలిపేసి ప్రచారం చెయ్యడం కనిపిస్తుంది

ఒరవడి మన సమాజంలో తరచు చూస్తుంటాం. మన సమాజంలో ప్రముఖులు కూడా సైన్స్, అధ్యాత్మికత, మతం మొదలైన వన్నీ విచ్చలవిడిగా కలగాపులగం చేసి మాట్లాడడం చూస్తుంటాం.  సైన్స్, అధ్యాత్మికత, మతం ఇవన్నీ వేరు వేరు విషయాలు. వాటి రంగాలు వేరు, వాటి లక్ష్యాలు వేరు. వాటిని  విచక్షణారహితంగా కలిపితే సమాజంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సమాజాన్ని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది.

మరి మన దేశంలో ఇన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా? ఇక్కడ బోలెడంత సైన్స్ నేర్పిస్తున్నారు కదా? అయినా కూడా సైన్స్ పట్ల మన సమాజంలో ఇంత తప్పుడు అవగాహన ఎందుకు ఉంది? అని మరి సహజంగా అడగొచ్చు.

మన విద్యా సంస్థల్లో సైన్స్ బోధనలో కొన్ని లోతైన సమస్యలు ఉన్నాయి అనిపిస్తుంది. పరీక్షల్లో మార్కులు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా గల మన విద్యా సంస్థల్లో సైన్స్ ని కూడా బట్టీ పద్ధతిలో నేర్పించడం కొంత వరకు జరుగుతోంది. ఎందుకంటే మన పరిక్షల్లో ప్రతీ ప్రశ్నకి ఒక ప్రత్యేకమైన సమాధానం రాస్తేనే మార్కులు పడతాయి. వాస్తవంలో అది తప్పయినా ఫరవాలేదు. అది తప్పా కాదా తేల్చుకునే అవకాశం పిల్లలకి దొరకదు. పిల్లలు కావాలనుకున్నా అవకాశాన్ని మన విద్యా వ్యవస్థ ఇవ్వదు

ఇందుకు చిన్న ఉదాహరణ. ఇది కూడా నిజంగా ఒక బడిలో జరిగింది.
ఊదితే దీపం ఎందుకు ఆరిపోతుంది?” అని బళ్ళో ఒక పాపకి సందేహం వచ్చింది.  
దానికి టీచరు సమాధానం ఇలా వుంది. “మనం విడిచే గాలిలో కార్బన్ డయాక్సయిడ్ ఎక్కువగా ఉంటుంది. దీపం మండడానికి ఆక్సిజన్ అవసరం. కనుక దీపం ఆరిపోతుంది.”
ఇది వినడానికి బానే వుంది కాని పూర్తిగా నిజం కాదు. కాని టీచరు చెప్పింది పిల్లలంతా బట్టీ పట్టి పరీక్షల్లో చకచకా రాసేస్తారు

కాబట్టి విషయం గురించి కాస్త లోతుగా ఆలోచిద్దాం. మనం విడిచే గాలిలో కార్బన్ డయాక్సయిడ్ పాలు కేవలం 4%  మాత్రమే. మనం లోనికి తీసుకునే గాలిలో అది ఇంకా తక్కువ. అది వేరే సంగతి.  మరి కాస్తకే దీపం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుందా? మరో విషయం ఏంటంటే,  ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి జెట్ ని దీపం మీదకి గురి పెట్టినా కూడా దీపం ఆరిపోతుందని సులభంగా చూపించొచ్చు. ఆక్సిజన్ మండడానికి అవసరం కదా? మరి ఆక్సిజన్ వల్ల దీపం ఆరిపోవడం ఏంటి? దీన్ని బట్టి అసలు దీపం ఎందుకు మండుతుంది అన్న ప్రశ్న లోతైన ప్రశ్న అని అర్థమవుతుంది.

కాని అలా విషయంలోకి లోతుగా పోయి శోధించే అవకాశం మన పాఠశాలల్లో పిల్లలకి ఉండదు.
మరో సమస్య ఏంటంటే సైన్స్ చదువుల్లో ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల సైజుని నానాటికి పెంచేస్తున్నారు. .సి.ఎస్.సి. బోర్డులో 11, 12 తరగతులకి చెందిన మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాలలో ఒక్కొక్క దాంట్లో 1400-1500 పేజీలు ఉంటాయి. పేజీలు అయితే పెరిగాయి గాని అందులో ఎంత భాగం పిల్లల మనసుల్లోకి ప్రవేశిస్తోంది, ఎంత మేరకు నిజంగా జీర్ణం అవుతోంది అన్న విషయం  మన విద్యాప్రణాళికల సృష్టికర్తలకి పట్టనట్టుంది

రోజుల్లో పోర్షన్ అంత ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు జ్ఞాపక శక్తి మీద ఆధారపడతారు. కాని సైన్స్ అనేది ఊరికే చదివి గుర్తుపెట్టుకునే విషయం కాదు. చూసి, చేసి, అనుభవించి అర్థం చేసుకోవలసిన విషయం. కేవలం జ్ఞాపక శక్తి మీద ఆధారపడి చదివే సైన్స్ చదువు అసలు చదువే కాదు.
సైన్స్ చదువులో, సైన్స్ అవగాహనలో ఇలాంటి లొసుగులని పూరించాలంటే సమాజ వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలంటాను.

1.     ప్రభుత్వ పాఠశాలలలో గ్రంథాలయాలని బలోపేతం చెయ్యాలి. టీవీ ప్రభావం వల్ల  పుస్తకం చదివే అలవాటు తగ్గిపోతోంది. అందుకే గ్రంథాలయాలు కూడా శిధిలావస్థలో ఉన్నాయి. ప్రతీ ప్రభుత్వ పాఠశాలకి, పాఠశాల వున్న పేటకి చెందిన ప్రజలు అందరూ కలిసి, పాఠశాలలోని గ్రంథాలయంలో మంచి పుస్తకాలు ఉండేలా చూడాలి
2.    Donate a book అనే ప్రాజెక్ట్ ని ప్రారంబించి ప్రాజెక్ట్ ద్వార  స్కూలు కి ఎలాంటి పుస్తకాలు కావాలో ఇంటర్నెట్ ద్వార తెలుసుకుని, దాతలు పుస్తకాలు స్కూల్ కి అందేలా ప్రయత్నించాలి.

3.    స్థానిక గ్రంథాలయాలకి కొత్త ఊపిరి పోయాలి.  అమెరికాలో అన్ని ఊళ్లలోను ప్రతీ పేటలోను community libraries  అని ఉంటాయి. పేటలోని ప్రజలకి గ్రంథాలయాల నిర్వహణలో భాగస్వామ్యం ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయాలలో దొరొకుతాయి. అలాంటి గ్రంథాలయాలు మన ఊళ్లలో కూడా వాడవాడలో ప్రత్యక్షం కావాలి.

4.    రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎన్నో ఇంజినీరింగ్ కాలేజిలు ఉన్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు తీరిక వేళల్లో చుట్టుపక్కల గ్రామాలలో ఉండే బడులకి వెళ్లి వాళ్లకి సరదాగా పాఠాలు చెప్పడం, సైన్స్ ప్రయోగాలు చేసి చూపించడం వంటి కార్యక్రమాలు చెయ్యొచ్చు.

5.    సరళమైన భాషలో, కథా రూపంలో కూడా ఎంతో సైన్స్ ని ప్రచారం చెయ్యొచ్చు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, సైన్స్ చరిత్ర లోని ఘట్టాలు సరదాగా, ఆసక్తికరంగా చెప్తే పిల్లలు సైన్స్ అంటే ఇష్టపడతారు

6.    తోలుబొమ్మలాటలు, బుర్రకథలు మొదలైన సాంప్రదాయక మాధ్యమాల ద్వార కూడా సైన్స్ సంగతులని సమాజంలో ప్రచారం చేసే వినూత్న ప్రయోగాలు చెయ్యొచ్చు.

7.    మన సమాజంలో వివిధ రంగాలకి చెందిన నిపుణులు (వీళ్లు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, మరే ఇతర రంగానికి చెందిన వారైనా కావచ్చు) ఎప్పుడైనా కాస్త తీరిక చేసుకుని స్థానిక పాఠశాలలో తమ వృత్తి జీవితం గురించి, వృత్తి జీవనంలో వాళ్లు ఎదుర్కునే సవాళ్ల గురించి పిల్లలకి చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల అయా వృత్తుల పట్ల పిల్లలలో చక్కని అవగాహన ఏర్పడుతుంది.

8.    సైన్స్ అనేది కేవలం పుస్తక పఠనం చేత కాక ప్రయోగాత్మకంగా తెలుసుకోవలసిన విషయం. అయితే టెస్ట్ ట్యూబ్ లు, వోల్ట్ మీటర్లు మొదలైన శాస్త్రీయ పరికరాలతో  పద్ధతిగా  సైన్స్ ప్రయోగాలు చెయ్యాలంటే కాస్త ఖర్చుతో కూడిన విషయం. అందుకే పూనేకి చెందిన అరవింద్ గుప్తా అనే విద్యా వేత్త  మామూలు రోజూవారీ పదార్థాలతో, (వాడేసిన అగ్గిపుల్లలు, చిత్తు కాగితాలు, పాత సైకిల్ టైర్లు మొదలైన వాటితో) అమూల్యమైన సైన్స్ ప్రయోగాలు ఎలా చెయ్యొచ్చో చూపించాడు. అలాంటి సరదా పద్ధతులని మన పాఠశాలలలో కూడా ప్రవేశపెట్టాలి
9.    మన పాఠశాలలలో ఎందరో టీచర్లు సృజనాత్మకమైన బోధనా పద్ధతులతో పిల్లలకి సైన్స్ నేర్పిస్తుంటారు. అలాంటి టీచర్లకి ప్రత్యేక గుర్తింపు నిచ్చి వారిని మరింత ప్రోత్సహించాలి.

10.  ఇంగ్లీష్ లో వున్న సైన్స్ సాహిత్యాన్ని వీలైనంత వరకు తెలుగులోకి అనువదించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలి.  క్రీ.. 1085 లో  స్పెయిన్ ని ఆరవ ఆల్ఫోన్సో అనే రాజు పాలించేవాడు. రాజు యూరప్ నలుమూలల నుండి పండితులని పిలిపించి రోజుల్లో అరబిక్ లో ఉండే ఎన్నో అమూల్యమైన వైజ్ఞానిక గ్రంథాలని ప్రాంతీయ భాష అయిన స్పానిష్ లోకి తర్జుమా చేయించాడు. అలాంటి బృహత్కార్యం ఏదో ప్రస్తుతం మన దేశంలో ప్రతీ రాష్ట్రం చేపట్టాలంటాను.
11.   మన దేశంలో మొత్తం 700 దాకా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఎంతో మంది ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు ఉంటారు. విశ్వవిద్యాలయాలలో ప్రతి ఒక్క ప్రొఫెసర్ సమాజంలో సైన్స్ పట్ల అవగాహనని పెంచే విధంగా ఏదో ఒకవిధమైన outreach కార్యక్రమాన్ని చేపట్టగలిగితే భారతీయ సమాజం మీద ఎంతో గాఢమైన ప్రభావాన్ని చూపించగలుగుతారు.
12.  మన రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 67%. దేశ సగటు అక్షరాస్యత (74%) తో పోల్చినా ఇది చాలా తక్కువ.  ప్రపంచ సగటు అక్షరాస్యతతో (84%) పోల్చితే మరీ తక్కువ. ఇక అభివృద్ధి చెందిన దేశాలలో సామాన్యంగా అక్షరాస్యత 98%-99% స్థాయిలో ఉంటుంది. ఇంత ముఖ్యమైన రంగంలో, 21 శతాబ్దంలో, మన దేశంలో ఇంత వెనుకబాటుతనం ప్రమాదకరం. కాబట్టి చదువు అనే లక్ష్యాన్ని కేవలం ప్రభుత్వ యంత్రాంగానికే వదిలేయకుండా, సమాజంలో ప్రతీ ఒక్కరు దీని గురించి ఆలోచించి నిర్మాణాత్మకంగా ఏదో ఒకటి చెయ్యాలి.

ప్రస్తుతం మన దేశం అన్ని రంగాలలో అతి వేగంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు చైనాని దాటుతోందని నిపుణులు అంటున్నారు. సమాజ వ్యాప్తంగా సైన్స్ చదువుని, అవగాహనని మరింత పటిష్టం చెయ్యగలిగితే వృద్ధికి బలమైన పునాదులు వేసిన వాళ్లం అవుతాము.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts