(చిత్రం - క్రీ.పూ. 405 లో గ్రీకు యాత్రికుడు డయొనీషియస్ గీసిన ప్రపంచ పటం)
ప్రియమైన బ్లాగర్లూ,
ప్రపంచ చరిత్ర
అనే అంశం మీద ఆరంభించబడిన ఈ కొత్త బ్లాగ్ కి స్వాగతం!
ఈ బ్లాగ్ ఎందుకు
ప్రారంభించాలి అనిపించింది?
కిందటి ఏడు ‘ఖగోళ
శాస్త్ర చరిత్ర’ అనే పుస్తకం రాయడం కోసం ఎంతో సమాచారం సేకరించాను. అందులో భాగంగా ప్రాచీన
సంస్కృతులలో ఖగోళ శాస్త్రం అనే అంశం మీద కొన్ని విషయాలు చదివాను. ప్రాచీన భారతంలోనే
కాక, ఎన్నో ఇతర ప్రాచీన ప్రపంచ సంస్కృతులలో కూడా (గ్రీక్, రోమన్, మెసొపొటోమియన్, మాయన్,
అరబిక్, చైనీస్, పాలినేషియన్ మొ॥) ఎంతో విస్తృతమైన
ఖగోళ విజ్ఞానం ఉండేదని తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగింది. ఈ సంస్కృతులలో గత మూడు, నాలుగు సహస్రాబ్దాలుగా చెప్పుకోదగ్గ ఖగోళ
విజ్ఞానం ఉందని తెలిశాక మిగతా ప్రపంచం పట్ల నా దృక్పథం కొంచెం మారింది.
ఆ విధంగా ప్రాచీన
సైన్స్ చరిత్ర గురించి చదువుతుంటే క్రమంగా మామూలు చరిత్ర – అంటే సామాజిక, రాజకీయ చరిత్ర
- మీదకి మనసు మళ్లింది. చిన్నప్పుడు బళ్ళో
చరిత్ర చదువుతున్నప్పుడు “పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందో బట్టీపట్టు” అనే పద్ధతిలో ఎదో చదివాం తప్ప చరిత్రలోని ఆనందాన్ని
ఎప్పుడూ జుర్రుకున్న జ్ఞాపకం లేదు. కారణాలు ఎన్నయినా ఉండొచ్చు. కాని సైన్స్ చరిత్ర
నుండి సామాన్య చరిత్రకి వెళ్ళి ప్రపంచ చరిత్ర గురించి చదువుతుంటే ప్రపంచ చరిత్రలో ఎంత
రసం, రుచి, ఆనందం, మేధస్సుకి సవాలు ఉందో చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి.
అలా చరిత్ర మీదకి
దృష్టి మళ్లగానే ఎప్పట్లాగే నా favorite ప్రశ్న ఒకటి నాకు నేను వేసుకున్నాను.
తెలుగులో చరిత్ర ఏ స్థాయిలో వుంది?
తెలుగులో చరిత్ర
చాలానే వుంది కాని అది అధికశాతం ఆంధ్రచరిత్రకి, భారత చరిత్రకి పరిమితమై వుంటుంది అని
నా నమ్మకం. అది రూఢి చేసుకోడానికి తెలుగు సాహిత్య స్థితిగతుల గురించి బాగా తెలిసిన
కొందరి వద్ద వాకబు చేశాను. నా నమ్మకం నిజమేనని తెలిసింది. అప్పటి నుండి ప్రపంచ సాహిత్యం
గురించి ఇంగ్లీష్ లో సాహిత్యం సేకరించడం మొదలెట్టాను.
నిజానికైతే తెలుగులో
ప్రపంచ సాహిత్యం గురించి రాయాంటే చరిత్రలో నిపుణులు రంగంలోకి దిగి దానికి న్యాయం చేకూర్చాలి.
కాని మరి అలాంటి మహత్యం ఇంత కాలం ఎందుచేతనో జరగలేదు.
అప్పడో చిన్న
ఆలోచన వచ్చింది. ఆలోచన కన్నా దాన్ని కల అనాలేమో. చరిత్ర బాగా తెలిసిన వాళ్లు ఓ పది
మంది కలిసి తలా ప్రాంతాన్ని తిసుకుని క్రీ.పూ. 2000 నుండి నేటి వరకు ప్రపంచ చరిత్ర
ని విపులంగా ఓ 5,000 నుండి 10,000 పేజీల పరిమాణంలో
తెలుగులో రాస్తే ఎంత గొప్పగా ఉంటుంది! తెలుగు సాహిత్యంలో అలాంటి పరిణామం గాఢమైన ముద్ర
వేస్తుంది. అలాంటి చారిత్రక సాహిత్యం ఎన్నో ఇతర రంగాల్లో గొప్ప సృజనకి హేతువు కాగలదు.
చరిత్ర నుండి స్ఫూర్తి తీసుకుని, చారిత్రక ఘట్టాలని నమూనాలుగా చేసుకుని, కుప్పలు తెప్పలుగా
నవళ్ళు, కథలు, నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు పుట్టుకొస్తాయని పిస్తుంది. (ఇటీవలి
కాలంలో అలాంటి నిదర్శనాలు లేకపోలేదు. స్టార్ వార్స్ కథలకి స్ఫూర్తి జపనీస్ సమూరాయ్
ల గాధలేనని అంటాడు జార్జ్ లూకాస్.)
అయితే అంత పెద్ద
ఎత్తున ప్రపంచ చరిత్రని తెలుగులో ఎవరు, ఎప్పుడు రాస్తారో నాకు తెలియదు. అంతకాలం ఎదురు
చుసే ఓపిక నాకైతే లేదు.
కాబట్టి కేవలం
నా సంతృప్తి కోసం ప్రపంచ చరిత్రలో నాకు నచ్చిన, కాస్తో కూస్తో అర్థమైన ఘట్టాల గురించి,
వ్యక్తుల గురించి తెలుగులో రాద్దామని పించింది.
ఆ ఆలోచనకి మూర్తిరూపమే
ఈ బ్లాగ్.
శాస్త్రవిజ్ఞానం
బ్లాగ్ (http://scienceintelugu.blogspot.in/)
ని ఆదరించినట్టుగానే
ఈ http://charitrakathalu.blogspot.in/
బ్లాగ్ ని కూడా ఆదరిస్తారని తలుస్తూ…
-
శ్రీనివాస
చక్రవర్తి
Thanks a lot ! Happy Blogging !
All the Best Sriniva Sir, I really appreciate all your efforts.Your blog posts help me alot while teaching my kids.
Thank you Niharika garu, thank you Anonymous garu!
thank you sreenivas garu