“ఇదుగో వస్తున్నా. ఇప్పుడే అటో ఇటో తేల్చుకుంటా!” కోపంగా ప్రసారం ఆఫ్ చేస్తూ అన్నాడు వర్మ.
“దెబ్బకి దిగొచ్చాడు... పెద్ద వీర విలేకరి!” కచ్చగా అన్నాడు శేషు.
అంతలో ఎయిర్లాక్ తెరుచుకుని అభినవ్ వర్మ లోపలికి ప్రవేశించాడు. ధుమధుమలాడుతూ ఉంటాడని అనుకున్నాం. కాని అంతలో శాంతంగా మారిపోయి
“ఏంటండీ ఇదంతా! ఇదంతా అసలేవైనా బావుందా చెప్పండి?”
“మీకు కొత్తగా చెప్పేదేవుంది వర్మగారు. పంచమం నుండి ఏమీ బయటికి తీసుకుపోకూడదని నియమం ఉంది. మీకు చెందని దాన్ని తీస్కెళ్తున్నారు. అది చౌర్యం అవుతుంది.” ప్రొఫెసర్ నెమ్మదిగా అన్నాడు.
“ఇదంతా మీ సొంతమేం కాదే! ఏంటి ఈ గ్రహం మీద ఉన్నదంతా మీ సొమ్మన్నట్టు మాట్లాడుతున్నారు?” వర్మ గొంతు పెద్దది చేశాడు.
“ఇది గ్రహం కాదు. ఇదో నౌక. మరమ్మత్తులు కావలసిన నౌక. ఈ సందర్భంలో పూర్తిగా భిన్నమైన చట్టాలు వర్తిస్తాయి.”
“మీరు చెప్పేది నేను చచ్చినా ఒప్పుకోను. ఈ లా పాయింట్లు తేల్చుకోడానికి కోర్టులు ఉన్నాయి. లాయర్లు ఉన్నారు. మీ పద్ధతేం బాలేదు.” ఇంచుమించు అరుస్తున్నట్టుగా అన్నాడు వర్మ.
“నే చెప్పేది కాస్త శాంతంగా వినండి వర్మగారు!” అవతలి వాడు నిప్పులు కక్కుతున్నా మా పెద్దాయన మాత్రం ప్రసన్నంగా మంతనం చేస్తున్నాడు. “మీరు తీసుకున్న వస్తువు ఇక్కడ మేం కనుక్కున్న వాటి లోకెల్లా అత్యంత అమూల్యమైన వస్తువు. నాలాగా మీరు పురావస్తు పరిశోధకులైతే ఆ వస్తువు విలువేంటో మీకు తెలిసి ఉండేది. సరే ఆ సంగతి వొదిలేద్దాం. ఆ వస్తువు తిరిగి ఇచ్చేయండి. మీ ఇంధనం మీకు తిరిగి ఇచ్చేస్తాం.”
వర్మ ధుమ్మెక్కిన పిచ్చుక గూడు లాంటి తన గడ్డాన్ని ఓసారి సాలోచనగా గోక్కున్నాడు.
“అయినా ఇక్కడ ఇన్ని వస్తువులు ఉండగా ఆ ఒక్క వస్తువు గురించి మీరు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు.
“మోనా లీసా చిత్రాన్ని కొట్టేసి అదే మ్యూజియంలో ఇంకా ఎన్నో చిత్రాలు ఉన్నాయి కదా, ఏం కొంపలు అంటుకు పోయాయి అని వాదించే దొంగలాగా ఉంది మీ పద్ధతి. మీరు కాజేసిన కళాఖండాన్ని పోలిన వస్తువు ఈ సౌరమండలంలోనే లేదు. ప్రాణాలొడ్డి అయినా దాన్ని తిరిగి సాధిస్తాను.” ప్రొఫెసర్ ఆవేశంగా అన్నాడు.
“వేశావు ప్రొఫెసరూ, పప్పులో కాలు” మనసులోనే అనుకున్నాను. బేరసారాలు జరిపేటప్పుడు ఎప్పుడూ ఓ ముఖ్య సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మనం బేరం ఆడుతున్న వస్తువు దొరక్కపోతే మనం తలతెగ్గోసుకోడానికి సిద్ధంగా ఉన్నామన్న భావన అవతలి వాడికి ఎట్టిపరిస్థితిలో కలిగించకూడదు. ఇప్పుడు ప్రొఫెసర్ చేసిన పొరబాటు సరిగ్గా అదే. ఆ వస్తువు కోసం ప్రొఫెసర్ ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని వర్మకి ఆ సంభాషణతో అర్థమయ్యింది.
“ఒక్క అరగంట గడువు ఇవ్వండి. ఆలోచించుకోవాలి,” అంటూ వర్మ తన నౌకకి తిరిగి వెళ్లిపోయాడు,
“అరగంట కన్నా ఒక్క సెకను కూడా ఎక్కువ ఆగను,” పట్టుదలగా అన్నాడు ప్రొఫెసర్.
ఈ సంభాషణ తరువాత వర్మ తెలివితేటల పట్ల నా గౌరవం మరి కాస్త పెరిగింది. అంతలో వర్మ నౌక మీది ఏరియెల్ కాసేపు అటు ఇటు తిరిగి గానిమీడ్ దిసగా గురిపెట్టబడడం కనిపించింది. గానిమీడ్ కి సందేశం పంపుతున్నాడా? ఎందుకో? అతి దగ్గర ఫ్యూయెల్ స్టేషన్ గానిమీడ్ మీద ఉందని ఆ మధ్య కెప్టెన్ వర్ధమాన్ అనడం గుర్తు. వాళ్ల సందేశాన్ని రహస్యంగా టాప్ చెయ్యాలని చూశాం. కాని వర్మ గట్టివాడే. తన సందేశాన్ని స్క్రాంబుల్ చేయబడింది. కొన్ని నిముషాల తరువాత వాళ్లకి ఏదో సమాధానం కూడా వచ్చింది. అది కూడా స్క్రాంబుల్ చెయ్యబడింది.
పరిస్థితి చేజారిపోతోంది. ప్రొఫెసర్ ముఖం జేవురించి ఉంది. ఏ క్షణాన అయినా అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది.
(సశేషం...)
0 comments