శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మెండెలేతర జన్యుశాస్త్రం - 2

Posted by V Srinivasa Chakravarthy Tuesday, January 1, 2013
బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!


రచన - రసజ్ఞ


2.1.1.b మాతృ నిర్ణయము (Mother determination):

ఇది శాశ్వతంగా ఉండే మాతృ ప్రభావం. Diver, Boycott & Garstang అనే శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల (1925 - 1931) ద్వారా, Lymnaea peregra అనే మంచి నీటి నత్త (fresh water snail) లలో గుల్ల (shell) ఏర్పడేటప్పుడు, ఆ గుల్ల కుడి వైపుకు చుట్టుకుంటే వాటిని సవ్య (dextral) గుల్లలనీ, ఎడమ వైపుకి చుట్టుకుంటే అపసవ్య (synstral) గుల్లలనీ అంటారు. వీటిల్లో D అనే జన్యువు ఉంటే కుడి వైపుకీ (dextral), d అనే జన్యువు ఉంటే ఎడమ వైపుకీ (synstral) చుట్టుకుంటాయి. అయితే, వీటిల్లో కుండలీకరణం (shell coiling) ఎటు వైపు జరుగుతుంది అనే విషయం మాత్రం ప్రాణి స్వంత జన్యువులు కాకుండా వాటి తల్లి యొక్క జన్యువులు నిర్ణయిస్తాయి. అంటే, ఇప్పుడు మనం DD ఉన్న నత్తలని తల్లిగా dd ఉన్న నత్తలని తండ్రిగా తీసుకుంటే Dd ఉన్న పిల్లలు వస్తారు. మెండెల్ చెప్పిన బహిర్గతత్వ సిద్ధాంతం ప్రకారం పిల్లల దృశ్యరూపం dextral ఉండాలి, అలాగే వచ్చింది. కానీ, DD ఉన్న నత్తలు తండ్రిగా, dd ఉన్న నత్తలు తల్లిగా తీసుకున్నా కూడా మెండెల్ సిద్ధాంతం ప్రకారం Dd ఉన్న పిల్లల దృశ్య రూపం dextral ఉండాలి కానీ ఇక్కడ మాత్రం synstral గమనించారు. పిల్ల నత్తలలో ఈ కుండలీకరణం ఎటువైపు జరుగుతుంది అనేది అండంలో ఉండే జన్యువులు నిర్ణయిస్తాయి కనుక మాతృ నిర్ణయమనీ, ఒకసారి గుల్ల ఏర్పడ్డాక, మార్చలేము కనుక ఇటువంటి మాతృ ప్రభావం శాశ్వతం అనీ వివరించారు.

2.1.1.c. క్షీర కారకము (Milk factor):

తల్లి పాల ద్వారా పిల్లలకి ఏమయినా లక్షణాలు వస్తే వాటిని క్షీర కారకాలు అంటారు. John Joseph Bittner (February 25, 1904 – December 14, 1961) అనే శాస్త్రవేత్త తల్లి పాల ద్వారా కాన్సర్ సుగ్రాహ్యత (sensitivity) ని ప్రేరేపించే పదార్ధము పిల్లలకి ప్రసారమవుతుంది అని ప్రయోగాల ద్వారా నిరూపించాడు. దీని కోసం రెండు విభాగాల ఎలుకలని తీసుకుని కొన్ని తరాల దాకా పెంచాడు. మొదటి విభాగం ఎలుకలకు అన్ని తరాలలోనూ కాన్సర్ ఉంటే, రెండవ విభాగంలోని ఎలుకలకు ఏ తరంలోనూ కాన్సర్ లేదు. ఇప్పుడు ఈ మొదటి విభాగం (తరతరాలుగా కాన్సర్ ఉన్న) ఎలుకలకి పుట్టిన పిల్లలకు రెండవ విభాగంలోని (అస్సలు కాన్సర్ లేని) ఎలుకల పాలు పట్టించగా, వీటికి కాన్సర్ రాలేదు. మామూలుగా జన్యువుల ద్వారా వచ్చేది అయితే, తరతరాలుగా కాన్సర్ ఉంది కనుక వీటికి కూడా కాన్సర్ రావాలి కానీ రాలేదు. ఇప్పుడు రెండవ విభాగం (అస్సలు కాన్సర్ లేని) ఎలుకలకు పుట్టిన పిల్లలకి మొదటి విభాగంలోని (తరతరాలుగా కాన్సర్ ఉన్న) ఎలుకల పాలు పట్టించగా, వీటికి కాన్సర్ వచ్చింది. వీటి ఆధారంగా తల్లి పాల ద్వారా తరువాతి తరానికి వెళ్ళే లక్షణాలు కొన్ని ఉన్నాయని తేల్చిన Bittner, వాటికి క్షీర కారకాలు అని పేరు పెట్టాడు.



2.1.1.d. కప్పా రేణువులు (Kappa particles):

Paramecium అను పేరు గల జంతువులలో ఈ కప్పా రేణువులు ఉంటాయని 1938-1943లో గుర్తించిన Tracy M. Sonneborn అనే శాస్త్రవేత్త ఈ జంతువుల మీద ఎన్నో పరిశోధనలు చేశారు. వాటి ద్వారా తెలిసినది ఏమిటంటే ఈ రకమయిన జంతువులలో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకంలో ఈ కప్పా రేణువులు ఉంటే, రెండవ రకంలో ఈ కప్పా రేణువులు ఉండవు. కప్పా రేణువులు కలిగి ఉన్న Paramecium, paramecin అనే పదార్ధాన్ని నీటిలోకి విడుదల చేయటం వలన అక్కడ నివసించే రెండవ రకమయిన, కప్పా రేణువులు లేని Paramecium లు చనిపోవటాన్ని గమనించారు. కనుక, కప్పా రేణువులు ఉండే Paramecium ని killer strains (ఇవి వేరే వాటిని చంపేస్తున్నాయి కనుక) అనీ, కప్పా రేణువులు లేనటువంటి Paramecium ని sensitive strains (వీటికి సుగ్రాహ్యత ఎక్కువ కనుక) అనీ పేర్లు పెట్టాడు. అసలు కప్పా రేణువులు ఉండటం వలన పారమీసిన్ (paramecin) అనే పదార్ధం తయారవుతోంది కనుక వీటిలో జన్యువు ఉండాలి అనుకుని ఆ కప్పా రేణువులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు. తను ఊహించినట్టుగానే పారమీసియం (Paramecium) ల కణద్రవ్యంలో DNA రేణువుల రూపంలో (particulate form) ఉండటాన్ని గమనించాడు (వీటినే కప్పా రేణువులు అంటారు). దానితో కప్పా రేణువులలో DNA ఉండటం వలననే, వీటి పిల్లలు కూడా కప్పా రేణువులతో పుడుతున్నారు, killers గా మారుతున్నారు అని నిర్ధారించాడు. అయితే, కణద్రవ్యంలో ఉండే ఈ రకమయిన (కప్పా రేణువులలో ఉండే) జన్యువులు, వాటి కేంద్రకంలో ఉండే జన్యువుల చేత నియంత్రించ బడుతున్నాయి. ఏ విధంగా అంటే, కణద్రవ్యంలో కప్పా రేణువులు ఉన్నప్పుడు మాత్రమే కేంద్రకంలో ఉండే K జన్యువు వీటి సంఖ్యను పెంచుతుంది. అసలు కప్పా రేణువులు లేని sensitive strains లో ఆ జన్యువు ఉన్నా కూడా ఏమీ చేయలేదు.

ఇప్పుడు, KK ఉన్నవి killer strains, kk ఉన్నవి sensitive strains అనుకున్నాం కనుక, ఈ రెంటి మధ్యా సంయోగం (వీటిల్లో జరిగే సంయోగ పద్ధతి conjugation) జరిగితే, వచ్చే పిల్లలలో మెండెల్ బహిర్గతత్వ సిద్ధాంతం ప్రకారం Kk వచ్చి, killer strains అయి ఉండాలి. ఇక్కడ, Kk వచ్చినా కూడా, ఇవి సంయోగం జరిగే సమయాన్ని బట్టీ రెండు రకాలుగా రావటాన్ని గమనించారు. సంయోగం ఎక్కువసేపు జరిగినపుడు, కేంద్రకాలతో పాటూ రెండిటిలో ఉండే కణద్రవ్యం కూడా కలిసినపుడు వచ్చిన Kk, killer గా మారింది. సంయోగం తక్కువసేపు జరిగినపుడు, కేవలం రెండిటిలో ఉండే కేంద్రకాల కలయిక జరిగినపుడు (ఇక్కడ కణద్రవ్యం కలయిక ఉండదు) వచ్చిన Kk మాత్రం sensitive strain గా మారింది. దీని వలన కణద్రవ్యం ప్రముఖ పాత్ర వహిస్తోంది అని తెలుస్తోంది.







2.1.2. మాతృ అనువంశికత (Maternal Inheritance):

అండములో ఉండే కణాంగాలు (కణద్రవ్యంలోని) సంతతిలోనికి చేరి లక్షణాలను వ్యక్తం చేస్తే దానిని మాతృ అనువంశికత అంటారు. దీనికి కేంద్రక జన్యువులతో సంబంధం ఉండదు కనుక దీనిని నిజమయిన కణద్రవ్య అనువంశికతగా పరిగణిస్తారు. ఏ కణాంగాల ఆధారంగా అనువంశికత జరుగుతోంది అన్న దానిని బట్టీ, ఇది రెండు రకాలు:

2.1.2.a. ప్లాస్టిడ్ అనువంశికత (Plastid Inheritance):

కణాలలో రంగునిచ్చే వాటిని ప్లాస్టిడ్లు అంటారు. ఇవి ప్రో ప్లాస్టిడ్ల నుండీ తయారవుతాయి. వృక్ష కణాలలో ఇవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతక ముందు చెప్పుకున్న హరిత రేణువులు (chloroplast) ప్లాస్టిడ్లలో ఒక రకం. ఈ హరిత రేణువుల్లో DNA ఉంటుంది అని ముందుగానే చెప్పుకున్నాం కనుక ఇటువంటి DNA ని cpDNA (chloroplast DNA) అంటారు. ఈ cp DNA ద్వారా జరిగే అనువంశికాన్నే ప్లాస్టిడ్ అనువంశికత అంటారు. ఈ రకమైన అనువంశికాన్ని Carl Erich Correns (September 10, 1864 - February 14, 1933) అనే శాస్త్రవేత్త 1909లో Mirabilis jalapa (four o'clock plant) అనే మొక్కలో కనుగొన్నాడు. ఈ మొక్కల్లో 3 రంగులలో ఆకులు ఉండటాన్ని గమనించాడు. వాటిల్లో తెలుపు రంగు ఆకులు - తెలుపు రంగు ప్రో ప్లాస్టిడ్ల (leucoplasts) వలన, ఆకుపచ్చ రంగు ఆకులు - ఆకుపచ్చ రంగు ప్రో ప్లాస్టిడ్ల (chloroplasts) వలన, మిశ్రమ రంగు ఆకులు - రెండు రకాల ప్రో ప్లాస్టిడ్లూ ఉండటం వలన వస్తాయని చెప్పారు.

ఆకుపచ్చ రంగు ఆకులున్న కొమ్మని తల్లిగా తీసుకుని వేరు వేరు రంగుల ఆకులున్న (ఆకుపచ్చ, తెలుపు, మిశ్రమ) కొమ్మలను తండ్రులుగా తీసుకుంటూ విడి విడిగా జరిపిన సంకరణాల ద్వారా వచ్చిన మొక్కలన్నిటిలోనూ ఆకుపచ్చ రంగు ఆకులే గమనించారు.

అదే విధంగా, తెలుపు రంగు ఆకులున్న కొమ్మని తల్లిగా తీసుకుని వేరు వేరు రంగుల ఆకులున్న (ఆకుపచ్చ, తెలుపు, మిశ్రమ) కొమ్మలను తండ్రులుగా తీసుకుంటూ విడి విడిగా జరిపిన సంకరణాల ద్వారా వచ్చిన మొక్కలన్నిటిలోనూ తెలుపు రంగు ఆకులే గమనించారు.

అదే, మిశ్రమ రంగు ఆకులున్న కొమ్మని తల్లిగా తీసుకుని వేరు వేరు రంగుల ఆకులున్న (ఆకుపచ్చ, తెలుపు, మిశ్రమ) కొమ్మలను తండ్రులుగా తీసుకుంటూ విడి విడిగా జరిపిన సంకరణాల ద్వారా వచ్చిన మొక్కలలో అన్ని రంగుల ఆకులనూ (ఆకుపచ్చ, తెలుపు, మిశ్రమ) గమనించారు.

పరిశీలించి చూస్తే తల్లి కొమ్మ ఏ రంగు ప్రో ప్లాస్టిడ్లను కలిగివుంటే పిల్లలలో కూడా అవే గమనించారు కనుక ప్లాస్టిడ్లు తల్లి ద్వారా వెళతాయి అని ఋజువు చేశారు. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, దీనికీ, కేంద్రక జన్యువులకీ ఏ మాత్రమూ సంబంధం లేదు.



(ఇంకా వుంది)

1 Responses to మెండెలేతర జన్యుశాస్త్రం - 2

  1. vamkasannam Says:
  2. 18011901071401
    0920 0919 0718050511 12010914.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts