అధ్యాయం 29
మామయ్యే నన్ను కాపాడాడు
నాకు మళ్లీ స్పృహ వచ్చేసరికి చీకట్లో నేల మీద పడుకుని వున్నాను. నా మీద కోట్లు, దుప్పట్లు కప్పబడి వున్నాయి. మామయ్య నన్నే కనిపెట్టుకుని వున్నాడు. నాకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. నాలో మొదటి శ్వాస కదలగానే నా చెయ్యి చటుక్కున అందుకున్నాడు. నేను కళ్లు తెరవగానే ఆనందంతో కేక వేశాడు.
“హమ్మయ్య! బతికేవున్నాడు!”
“అవును మావయ్యా…” నీరసంగా అన్నాను, “బతికే వున్నాను.”
ఆ క్షణం ఆయన నా మీద చూపించిన కరుణ, ఆయన మాటల్లోని సానుభూతి, అంతవరకు నా పక్కనే వుండి నన్నే కనిపెట్టుకుని, ఓ తండ్రిలా నాపై చూపిన లాలన నన్ను కదిలించివేశాయి.
“నా బంగారు అల్లుడూ! నీకేం కాదురా, నీకేం కాలేదురా” అంటూ నా తలని కౌగిలించుకున్నాడు.
అప్పుడే హన్స్ వచ్చాడు. మామయ్య చేతిలో నా చేతిని చూశాడు. హన్స్ ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది.
“God dag” అన్నాడు హన్స్.
“ఎలా వున్నావు హన్స్?” నీరసంగా అడిగాను. “అవును మామయ్యా, ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం?”
“ఇప్పుడు ఇంకేం మాట్లాడకు ఏక్సెల్. రేపు అంతా చెప్తాను. ఇంకా బాగా నీరసంగా వున్నావు. నీ తలకి బాగా కట్లు కట్టాను. ఇప్పుడు కదలడం అంత మంచిది కాదు. ఇప్పుడిక పడుకో. రేపు అంతా చెప్తాను.”
“పోనీ కనీసం టైం ఎంతయ్యిందో, ఏ తారీఖో చెప్పు.”
“ఇది ఆదివారం. ఆగస్టు 8 వ తారీఖు. రాత్రి పదయ్యింది. ఆగస్టు 10 వ తేదీ దాకా మళ్లీ ఏం అడక్కు.”
నిజంగానే విపరీతంగా నీరసంగా వుంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. తెలీకుండానే కళ్లు మూతలు పడ్డాయి. నిద్ర ఆవరించింది.
మర్నాడు తెలివి రాగానే చుట్టూ చూసుకున్నాను. నేను పడుకున్న పక్క ఓ బహుచక్కని గుహలో వుంది. దాని గోడలు స్టాలాక్ టైట్ స్ఫటికాలతో ఆలంకరించబడి వున్నాయి. కింద సన్నని పిండి లాంటి ఇసుక. నేపథ్యంలో కాస్తంత కాంతి వుంది. ఓ టార్చి గాని, దీపం గాని ఎక్కడా కనిపించలేదు. కాని ఎక్కడో సందు లోంచి విచిత్రంగా గుహలోకి కాంతి ప్రవేశిస్తోంది. ఎక్కడో అవిస్పష్టంగా శబ్దం కూడా వినిపిస్తోంది. తీరాన్ని పదే పదే ఢీకొంటున్న కెరటాల చప్పుడు లాంటిది. మధ్య మధ్య గాలి ఊళలు కూడా వినిపించినట్టు అనిపించింది.
మెలకువగ ఉన్నానో, కల గంటున్నానో కూడా కాసేపు అర్థం కాలేదు. లేకపోతే తలకి దెబ్బ తగలడం వల్ల విభ్రాంతి కలిగిందేమో. ఏదేమైనా కళ్లని, చెవులని అంత సులభంగా మోసపుచ్చడం కుదరదు.
అవి నిస్సందేహంగా సూర్యకిరణాలే, రాతి సందుల్లోంచి దూసుకొస్తున్నాయి. అది నిజంగా అలల కలకలమే. అవి నిజంగా గాలి గుసగుసలే. నేను పొరబడుతున్నానా లేక నిజంగానే తిరిగి ఉపరితలానికి వచ్చేశామా? మామయ్య తన మహా యాత్రని విరమించుకున్నాడా?
ఇలా నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటే ప్రొఫెసరు మామయ్య లోపలికి వచ్చాడు.
“గుడ్ మార్నింగ్ ఏక్సెల్! ఎలా వున్నావు నాన్నా?” మామయ్య అడిగాడు.
“ఫరవాలేదు, బానే వున్నాను,” పక్క మీంచి లేచి కూర్చోబోతూ అన్నాను. “నాకు తినడానికి ఏదైనా ఇస్తే ఎంత బావున్నానో స్పష్టంగా చూపిస్తాను!”
“తప్పకుండా తిను. జ్వరం తగ్గిపోయింది. హన్స్ నీ గాయాలకి ఏదో రహస్యమైన ఐస్లాండ్ చూర్ణం రాశాడు. కనుక గాయాలు బాగా మానిపోయినట్టు ఉన్నాయి. ఈ వేటగాడు నిజంగా గట్టివాడే.”
అలా ఏదో మాట్లాడుతూనే మామయ్య తినడానికి ఏదో ఇచ్చాడు. నెమ్మది నెమ్మది అంటున్నా వినకుండా ఆ పదార్థాలన్నీ ఆవురావురని తినేశాను. కాస్త ఓపిక రాగానే వరుసగా ఎన్నో ప్రశ్నలు కురిపించాను. మామయ్య కూడా ఓపిగ్గా అంతా వివరించాడు.
నిలువుగా ఉన్న సొరంగంలో అలా కిందకి పడుతున్న సమయంలో అలాగే కింద పడివుంటే నా కథ ఇంతే సంగతులు అయ్యుండేది. మధ్యలో నేను పడ్డ ఒక రాయి ఊడి రావడం వల్ల నా వేగం తగ్గగా నేను నేరుగా కింద నించున్న మామయ్య చేతుల్లో పడ్డాను.
“నువ్విలా ప్రాణాలతో ఉండడం ఎంత అదృష్టమో చెప్పలేను. కాని మళ్లీ ఎప్పుడూ అలా తప్పిపోకు. ఈ సారి తప్పిపోయామంటే మళ్లీ జన్మలో కలుసుకోలేమేమో.”
“మళ్లీ తప్పిపోవడం ఏంటి? మన యాత్ర ముగియలేదా?” ఆశ్చర్యంతో కళ్లు ఇంత చేసుకుని అడిగాను.
(ఇంకా వుంది)

0 comments