ఈ సారి మళ్ళీ విన్నాను. ఈ సారి మళ్ళీ నా పేరు ఎవరో పలకడం స్పష్టంగా వినిపించింది.
అది మామయ్య గొంతికే! గైడు తో ఏదో అంటున్నాడు. Forlorad అనేది డేనిష్ పదం.
అప్పుడు అర్థమయ్యింది. నేను గోడ లోంచి మాట్లాడాలి. తీగలో కరెంటు ప్రవహించినట్టు గోడ ద్వారా శబ్దం ప్రసారం అవుతోంది.
ఇక ఆలస్యం చెయ్యడానికి లేదు. నా నేస్తాలు కాస్తంత దూరం జరిగారంటే ఇక ఆ మాటలు వినిపించవు. కనుక గోడ దగ్గరగా జరిగి వీలైనంత స్పష్టంగా పిలిచాను – “లీడెన్ బ్రాక్ మామయ్యా!”
కాసేపు ఆత్రుతగా ఎదురుచూశాను. శబ్దం యొక్క వేగం అంత ఎక్కువేమీ కాదు. గాలి సాంద్రత పెరిగినా శబ్ద వేగంలో పెద్దగా మార్పు ఉండదు. దాని తీవ్రత పెరుగుతుందంతే(*). క్షణాలు యుగాలనిపించాయి. అప్పుడు ఈ మాటలు నా చెవిన పడ్డాయి –
(*ఇది నిజం కాదు. సాంద్రత పెరిగితే శబ్ద వేగం తగ్గుతుంది. – అనువాదకుడు).
“ఏక్సెల్! ఏక్సెల్! అది నువ్వేనా?”
“అవును, నేనే.”
“ఎక్కడున్నావు బాబూ?”
“ఏమో. చీకట్లో తప్పిపోయాను.”
“నీ లాంతరు ఏవయ్యింది?”
“అది ఆరిపోయింది.”
“మరి ఆ ప్రవాహమో?”
“అది కూడా మాయమైపోయింది.”
“ఏక్సెల్! ఏక్సెల్! భయం లేదు. ధైర్యంగా వుండు.”
“ఇక నాకు ఓపిక లేదు మావయ్యా! నువ్వే ఏదైనా మాట్లాడు.”
“ధైర్యంగా వుండు.” మామయ్య మాట్లాడుతూ ఉన్నాడు. “నువ్వు మాట్లాడక్కర్లేదు. నేను చెప్తున్నది విను. నీ కోసం సొరంగం అంతా తిరిగాం. నువ్వు ఎక్కడా కనపడలేదు. నీ కోసం ఏడ్చానురా చిట్టితండ్రీ! నువ్వు ఇంకా హన్స్ బాక్ ప్రవాహం మీదే ఎక్కడో వున్నావనుకుని ఓ సారి తుపాకులు పేల్చాం. ఇప్పుడు ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తున్నాయి కాని ఒకరిని ఒకరు తాకలేం. కాని ఇక బెంబేలు పడకు ఏక్సెల్! ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తున్నాయి అదే చాలు.”
ఈ సమయంలో నా మనసులో మళ్లీ ఆలోచనలు బయల్దేరాయి. మనసులో ఏదో కొత్త ఆశ జనిస్తోంది. మొదట నాకో విషయం తెలియాలి. ఈ సారి పెదాలు గోడకి తాకించి ఇలా అన్నాను –
“మామయ్యా!”
“ఏం బాబూ?” కొద్ది క్షణాల తరువాత సమాధానం వచ్చింది.”
“మనిద్దరి మధ్య దూరం ఎంతో తెలియాలి.”
“అది చాలా సులభం.”
“నీ వద్ద కాలమానిని (chronometer) వుందా?”
“వుంది.”
“అయితే దాన్ని అందుకో. నా పేరు పిలివు. సరిగ్గా ఎప్పుడు పిలిచావో కాలమానినిలో చూసి గుర్తు పెట్టుకో. నీ మాట వినిపించగానే నేను తిరిగి పలుకుతాను. నా మాట ఎప్పుడు వినిపించిందో గుర్తుపెట్టుకో.”
“అవును. నా పిలుపుకి నీ సమాధానానికి మధ్య వ్యవధిలో సగం తీసుకుంటే, మనిద్దరి మధ్య ఎడం ఎంతో తెలుస్తుంది.”
“అంతే మామయ్యా.”
“రెడీయేనా? ఇదుగో నీ పేరు పిలుస్తున్నాను.”
గోడికి చెవి ఆన్చి జాగ్రత్తగా విన్నాను. ‘ఏక్సెల్’ అన్న పేరు వినిపించగానే, వెంటనే తిరిగి ‘ఏక్సెల్’ అని పిలిచి ఎదురు చూశాను.
“నలభై సెకన్లు.” మామయ్య వివరించాడు. “రెండు పిలుపులకి మధ్య వ్యవధి నలభై సెకన్లు అనుకుంటే, ఈ దూరాన్ని దాటడానికి శబ్దానికి ఇరవై సెకన్లు పడుతుంది. శబ్ద వేగం సెకనుకి 1120 అడుగులు అనుకుంటే మన మధ్య దూరం 22,400 అడుగులు. అంటే సుమారు నాలుగుంపావు మైళ్లు.”
“నాలుగుంపావు మైళ్లా?” నాలో నేనే గొణిగాను.
“ఫరవాలేదు ఏక్సెల్. త్వరలోనే ఐపోతుంది.”
“నేను పైకి వెళ్లాలా, కిందికి వెళ్లాలా?”
“కిందికి. ఎందుకో చెప్తాను విను. మేం ఓ విశాలమైన భూగర్భ మందిరంలో వున్నాం. ఎన్నో సొరంగాలు ఇందులో కలుస్తున్నాయి. నువ్వు వున్న సొరంగం కూడా బహుశ ఇక్కడే వస్తుందేమో. భూగర్భంలోని చీలికలు, అగాధాలు అన్నీ ఈ విశాలమైన గుహ లోంచి బయటికి పోతున్నట్టు అనిపిస్తోంది. కనుక లేచి నడక ప్రారంభించు. వాలు ఎక్కువగా ఉన్న చోట అవసరమైతే జారుతూ అయినా రా. ఈ మార్గానికి అంతంలో మేం ఇద్దరం నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము. ఇక బయల్దేరు.”
ఆ మాటలతో నాకు ఉత్సాహం వచ్చింది.
“సరే గుడ్ బై మామయ్యా! ఇక బయల్దేరుతున్నా. బయల్దేరాక ఇక ఒకరి మాటలు ఒకరికి వినిపించవు. కనుక గుడ్ బై!”
“గుడ్ బై ఏక్సెల్!”
అవే నేను విన్న ఆఖరు పదాలు.
నాలుగుంపావు మైళ్ల మందం వున్న రాతి యానకం ద్వారా సాగిన మా ఈ భూగర్భ సంభాషణ ఇలా ఓ చిన్ని ఆశతో ముగిసింది. భూగర్భంలో ఇన్ని విశాలమైన చీకటి దారులు ఉండగా సరిగ్గా మా నేస్తాల మాటల వినిపించేలా నన్ను ఈ ప్రత్యేకమైన స్థానానికి తీసుకొచ్చిన భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఈ శబ్ద ప్రభావాన్ని శాస్త్రపరంగా సులభంగా వివరించొచ్చు. సొరంగం యొక్క నతాకార (concave) రూపం, శబ్దం ప్రసారం చేసే రాతి లక్షణం – ఈ రెండిటి వల్ల అది సాధ్యమయ్యింది. కొన్ని సార్లు శబ్దం ఒక బిందువు నుండి మరో బిందువుకి సంక్లిష్టమైన వక్ర మారంలో ప్రసారం అవుతుంది గాని మధ్య నున్న ప్రదేశంలో వినిపించదు. ఇదే ప్రభావాన్ని ఎన్నో చోట్ల చుశాను. లండన్ లో సెయింట్ పాల్ చర్చిలో మూపురం కింద కూడా ఇదే జరుగుతుంది. అలాగే సిరక్యూస్ లోని రాళ్లగనిలో కూడా ఈ ప్రభావం తెలుస్తుంది. ఈ ప్రభావానికి మరో చక్కని ఉదాహరణ ‘డైయనీసస్ చెవి’ (The Ear of Dionysius)
http://en.wikipedia.org/wiki/Ear_of_Dionysius
ఆ జ్ఞాపకాలన్నీ మనసులో క్రమ్ముకున్నాయి. ఒక సారి మామయ్య గొంతు వినిపించాక ఇక అవరోధాలన్నీ తొలగిపోయాయని అనిపించింది. శబ్దం వచ్చిన దిశలోనే ప్రయాణిస్తే, నా ఓపిక సరిపోతే, కాసేపట్లో మామయ్యని చేరుకోగలను.
మెల్లగా బయల్దేరాను. నడిచాను అనడకన్నా కాళ్ళీడుస్తూ ముందుకు సాగానని చెప్పాలి. వాలు ఎక్కువగా ఉన్న చోట్ల నెమ్మదిగా జారుతూ ముందుకి జరిగాను. జారుడు కాస్తా పతనంగా మారేట్టు ఉంది. ఇక నన్ను నేను ఆపుకోడానికి ఓపిక సరిపోలేదు.
కాలికింద నేల తెలియలేదు. గాల్లో గిరికీలు కొడుతూ, నిలువుగా ఉన్న సొరంగ భాగంలో వికృతంగా పొడుచుకొస్తున్న రాళ్లకి కొట్టుకుంటూ కిందకి పడుతున్నాను. ఇంతలో నా తల ఓ పదునైన రాతికి కొట్టుకుని స్పృహ తప్పింది.
(ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం)
0 comments