శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

“స్వయం కితకితలు” ఎందుకు పని చెయ్యవు?

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, July 1, 2010


నాడీమండలం చేసే ఎన్నో క్రియలకి ప్రయోజనాలు వెతుక్కోవచ్చు. ఆహారాన్వేషణ అనో, ప్రమాదాల నుండి ఆత్మరక్షణార్థం అనో ఎన్నో రకాల స్పందనల వెనుక మూలకారణాన్ని ఊహించవచ్చు. కాని నవ్వు అన్న అంశానికి అలాంటి కారణం ఆలోచించడం కష్టం. కిందటి పోస్ట్ లో మెదడులో నవ్వుని శాసించే, ప్రేరణ మీదట నవ్వు పుట్టించే, ఒక ప్రాంతం గురించి చెప్పుకున్నాం. సర్జరీలు, ఎలక్ట్రోడ్ లు మొదలైన హంగామా ఏమీ లేకుండా సులభంగా నవ్వు పుట్టించ గల మరో పద్ధతి ఉంది - అదే గిలిగింత.

చక్కిలిగింత అనేది స్పర్శేంద్రియానికి సంబంధించినది. శరీరం మీద అక్కడక్కడ సున్నితంగా తాకినప్పుడు కలిగే అనుభూతి ఇది, ఆపుకోలేని నవ్వొస్తుంది. ముఖ్యంగా మెడ వెనుక, నడుము పక్కల్లో తాకినప్పుడు చాలా మందికి చక్కలిగింత పుడుతుంది. పెద్ద వాళ్లలో కన్నా చిన్న పిల్లల్లో గిలిగింతకి స్పందించే గుణం మరింత బలంగా ఉంటుంది.

స్పర్శలో ఎన్నో రకాలు. చర్మాన్ని పై పైన తాకే తేలికైన స్పర్శ (light touch), చర్మాన్ని గట్టిగా వత్తే స్పర్శ (deep pressure), స్థిరమైన స్పర్శ (sustained touch), కంపనతో కూడిన స్పర్శ (vibration) ఇలా స్పర్శలో తేడాలని వర్గీకరించవచ్చు. అయితే ప్రత్యేకించి ఇలా వర్గీకరించడానికి కారణం ఒకటుంది. అసలు మనకి స్పర్శ కలిగించే సాధనాలు మన చర్మంలో ఉండే cutaneous receptors అనే స్పర్శాంగాలు. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్పర్శకి స్పందిస్తుంది. (స్పర్శేంద్రియాన్ని గురించి, చర్మం లక్షణాల గురించి మరో పోస్ట్ లో వివరంగా చెప్పుకుందాం.) స్పర్శలో తేలికగా ఉంటూ, వేగంగా మారే రకం స్పర్శ వల్లనే చక్కలిగిలి కలుగుతుంది. చక్కలిగిలి కలిగే చోట కూడా నిశ్చలంగా తాకినా గిలిగింత పుట్టదు, వేగంగా కదిలే వేళ్ల వల్ల ఆ స్పర్శలో వేగవంతమైన మార్పులు వచ్చినప్పుడే చక్కలిగిలి పుడుతుంది.

అయితే ఈ తేలికైన తాకిళ్లు ఎందుకు మనలో ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తాయి? సాధారణంగా మన చర్మం మీద మనకి కనిపించని చోట ఏదైనా తేలికగా ఈకలా తాకినప్పుడు గిలిగింత పుట్టదు. అదురు పుడుతుంది, ఉల్లిక్కి పడతాం. ఒళ్లు జలదరిస్తుంది. ఎందుకంటే ఏ పురుగో, సాలీడో మీద నెమ్మదిగా పాకినప్పుడు కలిగే అనుభూతి సరిగ్గా అలాగే ఉంటుంది. ఆ రకమైన స్పర్శల అర్థం నాడీమండలానికి తెలుసు కనుక, ఆ విధంగా అదురుపాటుతో స్పందిస్తుంది. ఆత్మరక్షణార్థం మనలో అప్రయత్నంగా జరిగే ఓ ప్రతిచర్య అన్నమాట.

కాని చిత్రం ఏమిటంటే ఇంచుమించు అలాంటి స్పర్శే ఓ పురుగు వల్ల కాక, ఓ మనిషి వల్ల కలిగితే భయం వెయ్యదు, చక్కలిగిలి పుడుతుంది, నవ్వొస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఓ పురుగో, మరో కీడు కలిగించే కీటకమో అయితే భయం వేస్తుంది. కాని అది మనిషి అని (ముఖ్యంగా తెలిసిన మనిషి అని, తన వల్ల ప్రమాదం లేదని) తెలిసినప్పుడు ఆ బెదురుపాటు కాస్తా నవ్వుగా వ్యక్తం అవుతుంది. ఏదో ముంచుకొచ్చింది అనుకున్నది కాస్తా ’ఓస్! ఇంతేనా?’ అన్న అనుభూతిగా మారుతుంది. ఉపద్రవం కావచ్చు అనుకున్నది ఉపశమనంగా పరిణమిస్తుంది. స్పర్శకి కారణం ఏంటో తెలీనప్పుడు కలిగే అభద్రతా భావం కాస్తా సుభద్రతా భావంగా మారుతుంది. హాయి కలిగిస్తుంది, నవ్వు తెప్పిస్తుంది.

బానే వుంది కాని ఇంతకీ మనకి మనం ఎందుకు చక్కలిగిలి పెట్టుకోలేం? చక్కలిగిలి పుట్టించే స్పర్శ అకస్మాత్తుగా, ఊహించని తీరులో జరగాలి. “ఇదుగో ఫలానా సమయంలో నిన్ను అంటుకుంటా జాగ్రత్త” అని ముహూర్తం పెట్టుకుని తాకితే చక్కలిగిలి పుట్టదు. ఆ స్పర్శ ఆశ్చర్యం కలిగించాలి. అనుకోని స్పర్శ కావాలి. (అందుకే సామాన్యంగా శరీరం మీద మనకి చక్కలిగిలి పుట్టించే స్థానాలు మన కంటికి ఆనని స్థానాలే అయ్యుంటాయి.) అందుకే మనకై మనం చక్కలిగిలి పెట్టుకోలేం. మన చేతి కదలికలు మన మెదడుకు తెలుసు కనుక మెదడు దానినది ఆశ్చర్యపరచుకోలేదు.

మనకి మనం గిలిగింతలు పెట్టుకోలేకపోయినా ఓ రోబో సహాయంతో ఆ మహత్కార్యం నెరవేరేలా ఏర్పాటు చేశారు కొందరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఈ పరికరాన్ని వాడదలచుకున్న వ్యక్తి వెల్లకిలా కళ్లు మూసుకుని పడుకోవాలి. ఆ వ్యక్తి పక్కనే రోబో ఓ మెత్తని ఈకలాంటిది తగిలించిన ఓ ప్లాస్టిక్ కమ్మీని పట్టుకుని ఉంటుంది. వ్యక్తి ఓ రిమోట్ కంట్రోల్ ని నొక్కినప్పుడు, రోబో స్పందించి ఆ ఈకతో వ్యక్తిని తాకుతుంది. అయితే ఆ స్పందనలో కొంత ఆలస్యం ఉంటుంది. ఎంత ఆలాస్యం ఉంటుందో వ్యక్తికి తెలీదు కనుక, రోబో ఎప్పుడు తాకబోతుందో వ్యక్తికి తెలీదు కనుక, ఆ స్పర్శ గిలిగిలి పుట్టిస్తుంది. ఆలస్యం అంటే మరీ ఎక్కువేం కాదు. అరసెకను కాలం ఆలస్యం ఉన్నా చాలు. అది వ్యక్తి నియంత్రణలో లేదు కనుక అది అకస్పాత్తుగా జరిగినట్టే అనిపించి గిలిగింత పుడుతంది.
చదవేస్తే ఉన్న మతి పోయినట్టు, ’రోబోలతో కితకితలు పెట్టించుకోవడం ఎలా?’ అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకి ఇదేం పొయ్యే కాలం, అనుకుంటున్నారా? ’రోబో గిలిగిలి’ ఇక్కడ ముఖ్యోద్దేశం కాదు. చక్కిలిగిలి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో రోబో ఒక సాధనంలా పనికొచ్చిందంతే.

References:
http://health.howstuffworks.com/mental-health/human-nature/other-emotions/question511.htm
http://en.wikipedia.org/wiki/Cutaneous_receptor
http://oreilly.com/pub/h/2832
Weiskrantz, L., Elliot, J., & Darlington, C. (1971). Preliminary observations of tickling oneself. Nature,230(5296), 598-599.

6 comments

 1. gaddeswarup Says:
 2. Thanks for the post. Overall, nice and wide range of topics. This may develop in to one of our best science blogs. Perhaps to make it accessible to other Indians, there can be a parallel site in English. Do you have one already?

   
 3. " చక్కలిగిలి పుట్టించే స్పర్శ అకస్మాత్తుగా, ఊహించని తీరులో జరగాలి. “ఇదుగో ఫలానా సమయంలో నిన్ను అంటుకుంటా జాగ్రత్త” అని ముహూర్తం పెట్టుకుని తాకితే చక్కలిగిలి పుట్టదు."""

  ఇది నాకు కరెక్ట్ అనిపించడం లేదు.. ఉదాహరణకి.. నాకు అరికాళ్ళలొ చక్కిలిగిలి ఎక్కువ.. ఎవరన్నా నేను పెడుతున్నా అని చెప్పి అరికళ్ళొ టచ్ చేసిన నాకు నవ్వొచ్చెస్తుంది. "అకస్మాత్తుగా, ఊహించని తీరులో జరగాలి " అన్న రూల్ పనిచెయ్యదు. " ఇదుగో ఫలానా సమయంలో నిన్ను అంటుకుంటా " అని చెప్పినా చక్కిలిగిలి ఆగదు. నాకు తెలుసుంది చలా మందిలొ ఇలాగే వుంటుంది. వద్దు వద్దు అన్నా చక్కిలిగిలి పెడుతుంటే .. మనకి ఇంకా నవ్వు వస్తుంది..

  I am missing something here.

   
 4. Anonymous Says:
 5. manchu,

  I think its becoz, you might know that someone is going to chuckle you, but your mind doesn't know what feel it creates. The mind experiences a sudden change in your senses when some one touches your feet.
  "అకస్మాత్తుగా, ఊహించని తీరులో జరగాలి ". Here అకస్మాత్తుగా refers to a part of mind which captures the senses and not that you know someone is going to chuckle you.

  correct me if i am wrong

   
 6. Manchu (I like this short form:-)

  గిలిగింత కలగడానికి unpredictability అన్నది చాలా ముఖ్యం.

  మరొకరు చక్కలిగి పెడుతున్నప్పుడు “మరెవరో, ఫలానా చోట చక్కలిగిలి పెడుతున్నారు” అని మాత్రం తెలుస్తుంది గాని, కచ్చితంగా, మిల్లిసెకను కాలస్థాయిలో ఆ స్పర్శ ఎలా ఉంటుందో ఊహించలేం. అవతలి వాళ్లు అరికాలిలో గిలిగిలి పెడుతున్నారని తెలిసినా, మన అరికాలు మనకి కనిపించదు కనుక, కచ్చితంగా ఎప్పుడు ఎక్కడ తాకుతున్నారో ఊహించలేం.

  అలా కాకుండా పూర్తిగా ఆశించిన తీరులో స్పర్శ ఉంటే (absolutely predictable touch) మామూలుగా చక్కలిగి పుట్టే చోట కూడా ఆ అనుభూతి క్రమంగా అణగారి పోతుందని అనుకుంటున్నాను. కావాలంటే ఓ చిన్న ప్రయోగం చెయ్యొచ్చు. కచ్చితంగా ఓ గ్రాఫుని అనుసరించి (ఉదా :- ఫలానా frequency ఉన్న sinusoid అనుకుందాం), మరెవరినైనా అరికాలిలో కచ్చితంగా రెండు బిందువుల మధ్యగా వేలు ముందుకి వెనక్కి పోనిస్తూ, గిలిగిలి పెట్టమనాలి. ఇంకా కావాలంటే మన అరికాలు మనకి కనిపించేలా కూర్చుని ఈ ప్రయోగం జరిపించాలి. మొదట్లో గిలిగిలి అనిపించినా మనం పాదం కదల్చకుండా కూర్చుంటే గిలిగిలి అనుభూతి క్రమంగా అణగారి పోవాలి.

  మనకై మనం గిలిగిలి పెట్టుకున్నప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే అవే చోట్ల మనకి మనం గిలిగిలి పెట్టుకున్నా ఏమీ అనిపించదు. మెదడు ఓ కర్మ చేసినప్పుడు మెదడులో మోటార్ కార్టెక్స్ నుండి ఆజ్ఞ (command) బయలుదేరుతుంది. ఆ ఆజ్ఞ యొక్క ప్రతి (copy) ఐంద్రియ ప్రాంతాలకి (sensory areas) కూడా వెళ్తుంది. దాన్ని బట్టి మెదడు ఆ కర్మ వల్ల కలుగబోయే అనుభూతి ఎలా ఉంటుందో ఊహిస్తుంది. ఊహ, వాస్తవం ఒక్కలా ఉంటే అప్పుడు కర్మ చేసింది తనే అని మెదడు గుర్తిస్తుంది. కాదంటే అనుభూతి కలిగిస్తున్నది మరెవరో నని మెదడు అర్థం చేసుకుంటుంది.

   
 7. Swarup garu:
  Thank you for the kind comments. There are already a large number of excellent science blogs in English, some of them going in-depth into specific areas of science. I dont see an urgency in starting one more science blog in English. I feel there is an urgency to create a large amount of online science content in Indian languages. I hope that individuals of Indian scientific community start creating science content, each in his or her own area of expertise. I feel that spreading the light of science on a large scale in Indian society can be an antidote to the chaos that we see everywhere in India today. Right now what our society needs is a good dose of science!

   
 8. gaddeswarup Says:
 9. Chakravarthy garu,
  It is true that there are excellent resources for science in English. But I have seen few references to excellent science writers like Carl Zimmer in Indian blogs. But if an Indian is writing on these topics there may be more reception to those topics. I remember that one of the first books outside the curriculam I looked at when I was a student was Vaidyanathaswamy's 'Set Topology', mainly because it was written by an Indian. Just a thought.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email