“చూడు బాబూ! స్పీడ్ లిమిట్ ఇంత తక్కువగా ఉన్న ఊళ్ళో బతకడం కష్టంగా అనిపించడం లేదూ?”
“స్పీడ్ లిమిటా” అవతలి వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు. “ఇక్కడ అసలు అలాంటిదేం లేదే? ఎక్కడికైనా, ఎంత వేగంగానైనా వెళ్లగలను. ఈ తుక్కు సైకిలు కాకుండా నా దగ్గర ఓ మోటర్ సైకిలు కూడా ఉంది. కావలంటే దాని మీద ఇంకా వేగంగా వెళ్తాను.”
“కాని మరి ఇందాక చూసినప్పుడు చాలా నెమ్మదిగా వెళ్తున్నారే?” అర్థం గాక అడిగాడు సుబ్బారావు.
“నేనా? నెమ్మదిగా వెళ్తున్నానా?” కాస్త కోపంగా అడిగాడా వ్యక్తి. “మీరు ఒక విషయం గమనించినట్టు లేరు. మీరు నన్ను పలకరించిన దగ్గర్నుండి అప్పుడే ఐదు రోడ్లు దాటేశాం.”
“కాని మరి రోడ్లు సన్నగా మారిపోయాయి కదా?”
“ఎలాగైతేనేం? రోడ్లు సన్నబడితే నేం, మన వేగంగా పోతేనేం? రెండు ఒకటేగా? పోస్ట్ ఆఫీస్ చేరుకోవాలంటే పది రోడ్లు దాటాలి. మరి కొంచెం గట్టిగా తొక్కితే రోడ్లు ఇంకా చిన్నవై పోస్ట్ ఆఫీస్ ఇంతలోనే వచ్చేస్తుంది. ఇదుగో మనం అనుకుంటుండగానే వచ్చేసింది,” సైకిలు రోడ్డు పక్క ఆపుతూ అన్నాడా వ్యక్తి.
సుబ్బారావు పోస్ట్ ఆఫీస్ గడియారం చూస్తూ అన్నాడు: “అబ్బా! ఐదున్నర అయ్యిందే! అంటే ఇక్కడికి రావడానికి అరగంట పట్టింది అన్నమాట. మిమ్మల్ని మొట్టమొదట చూసినప్పుడు సరిగ్గా ఐదు అయ్యింది.”
“కాని మీకు అరగంట గడిచినట్టు అనిపించిందా?” అని అడిగాడు సైకిలు వ్యక్తి.
నిజమే, అరగంట గడిచినట్టు అనిపించనే లేదు, సుబ్బారావు ఒప్పుకున్నాడు. ఓసారి తన చేతి గడియారం చూసుకుని ఉలిక్కి పడ్డాడు – అది 5:05 చూపిస్తోంది.
“పోస్ట్ ఆఫీస్ గడియారం వేగంగా నడుస్తోందా?” అర్థం కాక అడిగాడు సుబ్బారావు.
“అవునుమరి. లేదా మీ చేతి గడియారం నెమ్మదిగా నడుస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు వేగంగా కదులుతున్నారు కనుక. అయినా నాకు అర్థం కాక అడుగుతాను. మీరేవైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? ఏమీ తెలీనట్టు కొత్తగా మాట్లాడతారే?” అని కాస్త విసుక్కుంటూ ఆ సైకిలు వ్యక్తి పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్లిపోయాడు.
ఈ సంభాషణ తరువాత సుబ్బారావు కాస్త ఆలోచనలో పడ్డాడు. ఈ చిత్రవిచిత్ర పరిణామాలన్నీ బోధపరచడానికి ఇందాక ఉపన్యాసం ఇచ్చిన ప్రొఫెసర్ ఉంటే ఎంత బావుండును? ఆ సైకిలు కుర్రాడు ఎవడో స్థానికుడు. ఈ వ్యవహారం అంతా బాగా అలవాటు ఉన్నవాడు. ఇక చేసేది లేక ఆ విచిత్ర ప్రపంచాన్ని తనే అన్వేషించాలని అనుకున్నాడు. పోస్ట్ ఆఫీస్ గడియారం చూసి తన చేతి గడియారం సరిదిద్దుకున్నాడు. అక్కడే ఓ పది నిముషాలు ఆగి రెండు గడియారాలు ఒక్కలా నడుస్తున్నాయో లేదో చూసుకున్నాడు. తన వాచీ ఈ సారి నెమ్మదిగా నడవడం లేదని గమనించి “హమ్మయ్య” అనుకుని, ఈ సారి మళ్లీ తన సైకిలు ఎక్కి రైల్వే స్టేషను దిశగా బయలుదేరాడు.
(సశేషం...)
0 comments