ఆధునిక నాడీశాస్త్రం (neuroscience) కొన్ని శతాబ్దాల భావపరిణామానికి ఫలితం. తెలివితేటలు గుండెలో ఉంటాయని, మెదడులో కాదని బోధించిన అరిస్టాటిల్ కాలానికి, ఒక ప్రత్యేక నాడీకణంలోని ఒక అయాన్ చానెల్ లోని అతి సూక్ష్మమైన విద్యుత్ ప్రవాహాలని కూడా కొలవగలిగే ఆధునిక కాలానికి మధ్య ఓ సుదీర్ఘ భావ పరిణామం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మెదడు శాస్త్రంలో కొందరు మూలకర్తల కథలు ఆ మధ్యన కొన్ని పోస్ట్ లలో చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యక్తుల గురించి కాక, మెదడు శాస్త్రంలో ఎంతో కాలం అటుఇటు తేలకుండా మెదడు నిపుణులని ఇబ్బంది పెట్టిన ఒక భావన గురించి, దాని పరిణామం గురించి చెప్పుకుందాం.
నాడీ శాస్త్రంలోనే కాదు అసలు ఏ వైజ్ఞానిక రంగంలో నైనా భావ పరిణామం జరిగే తీరు ఒకే విధంగా ఉంటుంది. సామాన్యంగా ఓ కొత్త వైజ్ఞానిక ఆవిష్కరణ జరిగినప్పుడు అది రాత్రికి రాత్రి జరిగిపోయినట్టు, దాని వెనుక ఏదో ఏకైక హస్తం ఉన్నట్టు పత్రికలు సంచలనాత్మకంగా వర్ణిస్తుంటాయి. కాని నిజానికి ఇంచుమించు ప్రతీ ఆవిష్కరణ వెనుక ఓ సుదీర్ఘ పరిణామ క్రమం ఉంటుంది. ఆ ఆవిష్కరణకి సంబంధించిన మూలభావాలని ఎప్పుడో ఓ శాస్త్రవేత్త వ్యక్తం చేస్తాడు. అయితే వాటిలో కొంత సత్యాంశం ఉన్నా అవి సంపూర్ణం కాకపోవచ్చు, ముఖ్యమైన దోషాలు ఉండొచ్చు. కొంత కాలం తరువాత ఆ దోషాలని పలువురు గుర్తించి సవరించడానికి ప్రయత్నిస్తారు. అలా జరిగిన సవరణలలో కొన్ని మాత్రమే సమంజసమైనవని తరువాత తేలుతుంది. ఆ విధంగా భావన మరి కాస్త పదును దేలుతుంది, సత్యం దిశగా కాస్త ముందుకి జరుగుతుంది. ఇలా అంచెలంచెలుగా చిన్న చిన్న సవరణలతో ఎదుగుతున్న భావనలో, ఒక్కొక్కప్పుడు ఓ గణనీయమైన సవరణ రావచ్చు – న్యూటన్ భౌతిక శాస్త్రం స్థానంలో ఐనిస్టయిన్ సిద్ధాంతం వచ్చినట్టు. అలా అమాంతంగా వచ్చిన మార్పులనే ’వైజ్ఞానిక విప్లవాలు’ అంటారు. కనుక సామాన్యంగా బుడిబుడి నడకలతో నెమ్మదిగా ముందుకి జరుగుతూ, అప్పుడప్పుడు అమాంతం ముందుకి లంఘిస్తూ విజ్ఞానం పురోగమిస్తుంటుంది. విజ్ఞానం యొక్క ఈ ద్వంద్వ గతిని లోతుగా వర్ణించిన వారిలో ఒకడు తత్వవేత్త థామస్ క్యూన్ (Thomas Kuhn).
ఇక మెదడు విషయానికి వస్తే మెదడు యొక్క జీవనర్మాణం (anatomy) విషయంలో చాలా కాలంగా లోతైన అవగాహన ఉండేది. ఎందుకంటే నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో పెద్దగా సమస్య రాదు. ఓ మానవ కళేబరాన్నో, జంతు కళేబరాన్నో తీసుకుని, మెదడుని వెలికితీసి, కొంచెం జాగ్రత్తగా పరిచ్ఛేదాలు చేసి కనిపిస్తున్నదాన్ని వివరంగా వివరిస్తే సరిపోతుంది. కాని మెదడు యొక్క పనితీరుని అర్థం చేసుకోవాలంటే లోతైన సమస్యలు తలెత్తుతాయి. దాని క్రియలని వర్ణించాలంటే లోతైన భౌతికశాస్త్రం – కచ్చితంగా చెప్పాలంటే జీవభౌతిక శాస్త్రం (biophysics) - అవసరం అవుతుంది. సుమారు అర్థసహస్రాబ్దం క్రితం మెదడు నిర్మాణ రంగంలో ఎంతో ప్రగతి సాధించిన వెసేలియస్, దా వించీ మొదలైన పురోగాముల కాలంలో ఆధునిక భౌతిక శాస్త్రం ఇంకా మొదలు కానేలేదు. అందుకే రెనే దే కార్త్ (Rene Descartes) లాంటి గొప్ప తాత్వికులు మెదడు క్రియల అవగాహనలో పప్పులో కాలేశారు. నాడులలో ఏవో ప్రాణ శక్తులు (vital spirits) ప్రవహించి శరీరంలో కదలికలు కలిగిస్తాయని అంటాడు దే కార్త్. అలాగే పీనియల్ గ్రంథి ద్వారా ’ఆత్మ’ మెదడుతో సంభాషిస్తోందని బోధించాడు.
ఇలాంటి నేపథ్యంలో మెదడు వివిధ క్రియలని ఎలా శాసిస్తోంది? మనిషి యొక్క వివిధ లక్షణాలు మెదడులో ఎలా పొందుపరచబడి ఉన్నాయి? ఇంద్రియాల చర్యలకి మెదడు ఎలా ఆధారభూతంగా ఉంది? మొదలైన ముఖ్యమైన ప్రశ్నల సమాధానం దిశగా ఓ చిన్న అడుగు అని చెప్పుకోదగ్గ ఓ శాస్త్రం బయలుదేరింది. ఆధునిక వైజ్ఞానిక ప్రమాణాల దృష్ట్యా అదో కుహనా శాస్త్రం (pseudoscience) అని చెప్పుకోవాలి. తల యొక్క ఉపరితలం మీది భేదాలని బట్టి మనిషి యొక్క లక్షణాలని చెప్పడం దీని లక్ష్యం. దాని పేరే ఫ్రీనాలజీ (phrenology, శిరోవిజ్ఞానం).
దాని సంగతి వచ్చే పోస్ట్ లో చూద్దాం....
(సశేషం)
దాని సంగతి వచ్చే పోస్ట్ లో చూద్దాం....
(సశేషం)
0 comments