Mr Tompkins in Wonderland. 1938 లో రాయబడ్డ ఈ జనరంజక విజ్ఞాన (popular science) పుస్తకం ఎన్నో దశాబ్దాలుగా విజ్ఞాన ప్రియులని ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇంగ్లీష్ లో జనరంజక విజ్ఞాన సాహిత్యంతో పరిచయం ఉన్నవారిలో ఈ పుస్తకం తెలీని వారు బహు కొద్ది మంది. సరదా కథలతో సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటం ప్రపంచాన్ని సామాన్య పాఠకులకి వివరించడమే ఈ పుస్తకంలోని ముఖ్యోద్దేశం.
పుస్తక రచయిత జార్జి గామోవ్ (1904-1968) రష్యాలో పుట్టాడు. ఇతడో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (theoretical physicist), మరియు విశ్వవైజ్ఞానికుడు (cosmologist). మహావిస్ఫోటం (big bang) లో జరిగిన కేంద్రక చర్యలకి, ప్రస్తుత విశ్వంలో హైడ్రోజన్, హీలియమ్ వాయువుల స్థాయికి మధ్య సంబంధాన్ని కనుక్కున్నాడు. ఇతడి పరిశోధన కేంద్రక చర్యలు, తారల పుట్టుక/వృద్ధి, విశ్వ మైక్రోవేవ్ నేపథ్యం, జన్యు శాస్త్రం మొదలుగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న అంశాల మీదుగా విస్తరించి ఉంటుంది.
వైజ్ఞానిక పరిశోధనలే కాకుండా గొప్ప జనరంజక వైజ్ఞానిక సాహిత్యం రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు గామోవ్. One, two, three… infinity, Mr. Tompkins in wonderland, Thirty Years That Shook Physics: The Story of Quantum Theory, మొదలైన పుస్తకాలు జనరంజక విజ్ఞాన సాహిత్యంలో ఆణిముత్యాలు.
వైజ్ఞానిక పరిశోధనలే కాకుండా గొప్ప జనరంజక వైజ్ఞానిక సాహిత్యం రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు గామోవ్. One, two, three… infinity, Mr. Tompkins in wonderland, Thirty Years That Shook Physics: The Story of Quantum Theory, మొదలైన పుస్తకాలు జనరంజక విజ్ఞాన సాహిత్యంలో ఆణిముత్యాలు.
Mr. Tompkins in wonderland పుస్తకాన్ని గామోవ్ 1938 లో రాసి Harpers Magazine అనే పత్రికకి పంపితే తిప్పి కొట్టారట. తరువాత మరో అరడజను పత్రికలు అలాగే తిప్పికొట్టాయట. దాంతో విసుగు పుట్టిన గామోవ్ ఆ వ్రాతప్రతి సంగతి మర్చిపోయాడట. ఇలా ఉండగా ఒక సారి గామోవ్ వార్సా నగరంలో ఓ అంతర్జాతీయ సైద్ధాంతిక భౌతికశాస్త్ర సమావేశానికి వెళ్లాడు. అక్కడ సర్ చార్లెస్ డార్విన్ తో (ఇతడు పరిణామ సిద్ధాంతకారుడు చార్లెస్ డార్విన్ కి మనవడు) పాటు, కమ్మని పోలిష్ వైన్ సేవిస్తూ, పిచ్చా పాటి మాట్లాడుతూ కూర్చున్నాడు. మాటల్లో తను రాసిన ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. డిస్కవరీ అన్న జనరంజక విజ్ఞాన పత్రికని నడుపుతున్న డా సి.పి.స్నో కి ఆ వ్రాతప్రతిని పంపమని డార్విన్ సలహా ఇచ్చాడు. ఆ విధంగా ఈ పుస్తకానికి విమోచనం దొరికింది.
Mr. Tompkins in wonderland, లో టాంకిన్స్ ఓ బాంకు క్లర్కు. ఇతడు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఓ అద్భుత లోకంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ స్పీడ్ లిమిట్ చాలా తక్కువ. స్పీడ్ లిమిట్ అంటే ఆ వేగాన్ని మించి వెళ్లకూడదనే సాధికార నిషేధం కాదు. అసలు ఆ వేగాన్ని మించి ప్రయాణించడమే అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో సాపేక్షతా సిద్ధాంతంలో కాంతి వేగానికి సన్నిహిత వేగం వద్ద కనిపించే విచిత్రమైన ప్రభావాలు (వస్తువుల పొడవు తగ్గడం, కాల గమనం మందగించడం మొ) మామూలు వేగాల వద్దే కనిపించడం మొదలెడతాయి. దాంతో సామాన్య జీవనం అంతా గందరగోళంగా తయారవుతుంది.
“సుబ్బారావు – సాపేక్ష లోకం” అన్న పేరుతో ఈ పుస్తకానికి అనువాదం ధారావాహికగా ఈ రోజు నుండి మొదలుపెడుతున్నాను...
0 comments