తిరిగి కళ్లు తెరిచి చూసేసరికి మునుపటి లెక్చర్ హాల్ లో లేడు. ఊళ్లో ఏదో సిటీ బస్ స్టాండ్ లో ఓ బల్ల మీద కుర్చుని ఉన్నాడు. ఆ బస్ స్టాండ్ ఉన్న రోడ్డు పక్కన ఏదో పాతకాలపు కాలేజి భవనాలు వరుసగా ఉన్నాయి. ఏవైనా కల గంటున్నానా అని అనుమానం వచ్చింది. కాని చుట్టూ చూస్తే పరిసరాలు మామూలుగానే ఉన్నాయి. అల్లంత దూరంలో నించున్న పోలీసు కూడా మామూలుగా అందరు పోలీసుల్లాగానే ఉన్నాడు. ఎదురుగా ఉన్న ఎత్తైన భవనం మీద ఉన్న పెద్ద గోడ గడియారం ఐదు గంటలు చూపిస్తోంది. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అల్లంత దూరం నుండి ఓ మనిషి సైకిల్ మీద వస్తున్నాడు. సమీపిస్తున్న ఆ సైకిల్ ని చూసి సుబ్బారావు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. ఎందుకంటే ఆ సైకిలు, దాని మీద ఉన్న మనిషి సైకిల్ కదులుతున్న దిశలో కుంచించుకుపోయినట్టు కనిపిస్తున్నారు. అంతలో గోడ గడియారం ఐదు కొట్టింది. అది విని తొందరలో ఉన్నట్టు ఆ సైకిలు మనిషి వేగంగా తొక్కడం మొదలెట్టాడు. సైకిల్ వేగం పుంజుకుంటుంటే ఆ మనిషి, సైకిలు ఇంకా ఇంకా కుంచించుకుపోయి పలచగా కాగితపు బొమ్మల్లా కనిపించసాగారు.
సుబ్బారావుకి ఒక్క క్షణం ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కాని అంతలో బుర్రలో ఏదో తళుక్కు మంది. ఇందాక ఉపన్యాసంలో విన్న విషయం గుర్తొచ్చింది. బయట కనిపిస్తున్న వైపరీత్యాల అంతరార్థం అర్థమయ్యింది. “ఇక్కడ స్పీడ్ లిమిట్ చాలా తక్కువ అన్నమాట,” తనలోతనే తర్కించుకున్నాడు సుబ్బారావు. “అందుకేనేమో ఆ మూల నించున్న కానిస్టేబుల్ ఇంచుమించు నిద్రావస్థలోఉన్నాడు. ఇక మితిమీరిన వేగంతో పోవడం ఈ ఊళ్లో ఎవరికీ సాధ్యం కదు.” అంతలో ఆ దారి వెంట భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయేలా చప్పుడు చేసుకుంటూ ఓ టాక్సీ కూడా వచ్చింది. కాని దాని వేగం కూడా ఆ సైకిల్ వేగం కన్నా పెద్దగా ఏమీ లేదు. విషయం ఏంటో సైకిల్ వ్యక్తిని అడిగి కనుక్కుందామని సుబ్బారావు, కానిస్టేబుల్ పరాకుగా ఉన్న సమయం చూసి, అక్కడే ఉన్న మరో సైకిల్ తీసుకుని సైకిల్ వెంటపడ్డాడు.
సైకిల్ కదలగానే తను కూడా ఇందాక చూసిన వాళ్లలాగే కుంచించుకుపోతాడాని ఆశించాడు. పైగా ఇటీవలి కాలంలో కొద్దిగా ఒళ్లు పెంచిన విషయం తను మర్చిపోలేదు. (తన భార్య ఆ విషయం మర్చిపోయే అవకాశం కూడా ఇవ్వడం లేదు.) కాని తీరా సైకిల్ కదిలాక తనకేసి చూసుకుంటే, తను గాని, తన సైకిల్ గాని ఒక్క అంగుళం కూడా కుంచించుకుపోలేదు. కాని తన పరిసరాలు మాత్రం విచిత్రంగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సారి రోడ్లు కుంచించుకుపోయాయి. అంగళ్లలో కీటికీలు కుంచుకున్నాయి. ఇందాక గుమ్మడిపండులా నిండుగా కనిపించిన కానిస్టేబుల్ పాపం చిక్కి సగం అయ్యాడు.
“తస్సాదియ్యా!” చిన్నగా అరిచాడు సుబ్బారావు. “రహస్యం ఇప్పుడు అర్థమయ్యింది. సాపేక్షత అంటే ఇదే కాబోలు. నా బట్టి కదిలే ప్రతీ ఒక్కటి కుంచించుకుంటుంది అన్నమాట. ’అసలు’ ఎవరు కదిలారన్నది ముఖ్యం కాదు.” సైకిల్ తొక్కడంలో సుబ్బారావుది అందెవేసిన కాలు. చిన్నప్పుడు వాళ్ల మండలంలో పెట్టిన సైకిల్ పోటీల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో గెలిచాడు. సైకిల్ వేగంగా తొక్కి ఇందాకటి సైకిల్ వ్యక్తిని అందుకోవాలని చూశాడు. కాని ఎంత బలంగా తొక్కినా అసలు బండి కదలదేం? బయలుదేరినప్పుడు సులభంగానే వేగం పెంచగలిగాడు. కాని వేగం పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా హెచ్చువేగాలని సాధించాలంటే ఇంకా ఇంకా కష్టం అవుతోంది. ఇందాకటి సైకిల్ వ్యక్తి, టాక్సీ గాని, తను గాని ఒక వేగం కన్నా ఎక్కువ ఎందుకు వేగంగా పోలేకపోతున్నారో ఇప్పుడు అర్థమయ్యింది. ఇందాక ప్రొఫెసర్ తన ఉపన్యాసంలో కాంతివేగాన్నిమించిన వేగం ఉండదని, దాన్ని మించు పోవడం సాధ్యం కాదని చెప్పిన విషయం గుర్తొచ్చింది. కాని తను మాత్రం పట్టుదలగా తొక్కుతూ పోయాడు. తన పరిసరాలలో వస్తువులు ఇంకా ఇంకా సన్నగా కనిపించసాగాయి. అంతలో రోడ్డు మలుపు తిరిగిన చోట ఎదుట ఉన్న సైకిల్ వ్యక్తిని చేరుకున్నాడు. అయితా ఆ వ్యక్తి, తనుఎక్కన సైకిల్ తక్కిన వస్తువుల్లాగా కుంచించుకోకుండా, మామూలుగానే ఉండడం చూసి మొదట ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. “ఓహ్! మేం ఇద్దరం ఒకరిబట్టి ఒకరం కదలడం లేదు కనుక, పరిమాణంలో మార్పు లేదన్నమాట,” అని తనలో తనే అనుకుంటూ, ఆ సైకిల్ వ్యక్తిని పలకరించాడు.
“చూడు బాబూ! స్పీడ్ లిమిట్ ఇంత తక్కువగా ఉన్న ఊళ్ళో బతకడం కష్టంగా అనిపించడం లేదూ?”
(సశేషం...)
మీ ఈ ప్రయత్నానికి నా జోహార్లు...
చాలా బాగా రాసారు...
అన్నట్టు..ఈ పుస్తకం కొందామని చూస్తే 800 ఉంది....ఈ పుస్తకం ఖరీదు అంతేనా..తక్కువ రేటులో కూడా దొరుకుతుందా....???
ఈ పుస్తకానికి pdf ఇక్కడ దొరుకుతుంది.
www.arvindguptatoys.com
mee e prayatnaniki naa joharlu.