తగినంత పరిపాకం లేని దశలో మనిషి మనస్సు ఆయతనం (space, స్థలం), కాలాల గురించి కొన్ని తప్పుడు భావాలని రూపొందించుకుంది. నిరంతరం జరిగే విశ్వసంఘటనలకి ఆయతనం (space), కాలం అనే రెండు తత్త్వాలు అంచంచలమైన నేపథ్యాన్ని అందిస్తున్నాయని భావించింది. ఆ భావాలే తరతరాలుగా మనకి వారసత్వంగా వస్తున్నాయి. విశ్వం యొక్క గణితపరమైన వర్ణనని కూడా ఈ భావాలే లోతుగా ప్రభావితం చేస్తున్నాయి. న్యూటన్ మహాశయుడు మొట్టమొదటి సారిగా తన ప్రిన్సిపియాలో ఈ సాంప్రదాయక భావాలని ఇలా వ్యక్తం చేశాడు:
’నిరపేక్షమైన ఆయతనం (absolute space), స్వతస్సిద్ధంగా, ఏ బాహ్య విషయాలతోను సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా నిశ్చలంగా ఉంటుంది.’
అలాగే ’నిరపేక్షమైన, సత్యమైన, గణితపరమైన కాలం, ఏ బాహ్య విషయాలతోను సంబంధం లేకుండా, సమంగా ప్రవహిస్తుంటుంది.’
ఆయతనం గురించి, కాలం గురించి ఈ నమ్మకాలు ఎంత లోతుగా పాతుకుపోయాయంటే, వాటిని మూలసిద్ధాంతాలుగా, అక్షర సత్యాలుగా అందరూ ఒప్పుకున్నారు. వాటి విషయంలో అనుమానపు ఛాయలు కూడా ఎవరికీ ఉన్నట్టు తోచలేదు.
కాని గత శతాబ్దపు ఆరంభంలో, అధునాతన ప్రయోగాత్మక పద్ధతుల వల్ల వచ్చిన ఎన్నో ఫలితాలని, ఈ సాంప్రదాయక ఆయతన, కాలాల నేపథ్యంలో పరిశీలించినప్పుడు, ఎన్నో రకాల అంతర్ వైరుధ్యాలు పైకితేలాయి. ఈ విపరీత ఫలితాలని చూసి, ఆధునిక శాస్త్రవిజ్ఞాన లోకానికి రారాజు అని చెప్పుకోదగ్గ ఆల్బర్ట్ ఐనిస్టయిన్ మరో విప్లవాత్మకమైన భావనని సూచించాడు. ఆయతనం (space), గురించి కాలం గురించి ఈ పాత భావాలని కేవలం మనం సాంప్రదాయపు బలం వల్లనే పట్టుకుని వేలాడుతున్నాం అన్నాడు. ఈ కొత్త విపరీత ఫలితాలని అర్థవంతం చేసే విధంగా ఈ పాత భావాలని మార్చుకుంటే మేలని సూచించాడు.
కాల, ఆయతనాల గురించిన పాత భావాలు మన రోజూవారీ జీవితానుభవం మీద ఆధారపడ్డాయి. మరింత అధునాతనమైన ప్రయోగాత్మక పద్ధతుల దృష్ట్యా ఈ పాత భావాలు అంత కచ్చితమైనవి కావని తేటతెల్లం అయ్యింది. దైనందిన జీవనంలోనే కాక, భౌతిక శాస్త్రపు తొలిదశలకి చెందిన మరింత సరళమైన ప్రయోగాత్మక పరిస్థితుల్లోను, కాల, ఆయతనాలకి సంబంధించిన మరింత కచ్చితమైన భావాలకి, ఈ పాత భావాలకి మధ్య తేడా అత్యల్పంగా ఉండడం విశేషం. కాని దినదినం విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానాన్వేషణా భూమికలలో ఈ తేడాలు కూడా విపరీతంగా పెరగడం వల్ల ఇక పాతభావాలని విడనాడడం తప్పనిసరి అయ్యింది.
పాత భావాలకి గొడ్డలిపెట్టు అయిన ఓ ముఖ్యమైన ప్రయోగాత్మక ఫలితం ఉంది. అది – “శూన్యంలో కాంతి యొక్క వేగం, సాధ్యమైన భౌతిక వేగాలలో కెల్లా గరిష్ఠమైన వేగం అన్న వాస్తవం”. పందొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మికెల్సన్ చేసిన ప్రయోగాలలో ఓ ముఖ్యమైన విషయం బయటపడింది. కాంతి యొక్క ప్రసార వేగం మీద భూమి చలనం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడమే ఆ ప్రయోగాల లక్ష్యం. కాని తీరా ప్రయోగం చేసి చూస్తే అసలు భూమి చలనానికి కాంతి వేగం మీద ప్రభావమే లేదని తెలిసి వైజ్ఞానిక లోకం నిర్ఘాంతపోయింది! ఇది చాలా అనూహ్యమైన ఫలితం అని, చలనానికి సంబంధించిన మన ప్రాథమిక భావాలకి ఈ ఫలితం పూర్తిగా చుక్కెదురుగా ఉందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
(సశేషం...)
0 comments