ఈ సారి గడియారం కేసి చూసుకుంటే అది మళ్లీ నెమ్మదిగా నడవడం చూసి ఆశ్చర్యపోయాడు.
“ఇది కూడా ఏదో సాపేక్ష ప్రభావమే అయ్యుంటుంది,” మనసులోనే అనుకున్నాడు సుబ్బారావు. దీని గురించి బాగా తెలిసిన వాళ్లని ఎవర్నయినా పట్టుకుని అన్నీ వివరంగా అడగాలి అనుకున్నాడు.
ఆ అవకాశం అంతలో రానే వచ్చింది.
పక్కనే ఉన్న రైల్వేస్టేషను ఉంది. ఓ మధ్యవయస్కుడు - నలభై ఉంటాయేమో – రైలు దిగి బయటికి వస్తున్నాడు. అతణ్ణి కలుసుకోడానికి ఓ ముసలావిడ వచ్చింది. అతణ్ణి చూడగానే “తాతయ్యా!” అంటూ సంతోషంగా పలకరించింది. అది విని సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు. ఉత్సుకత చంపుకోలేక, విషయం తెలుసుకుందామని, వాళ్ల సామాను మోసిపెట్టే మిషతో వాళ్లిద్దర్నీ సమీపించాడు.
“మీ కుటుంబ వ్యవహారాల్లో తల దూరుస్తున్నాను అనుకోకపోతే ఒక్కటి అడుగుతాను,” అన్నాడు సుబ్బారావు. “మీరు నిజంగా ఈ ముసలావిడకి తాతయ్యా? నేను ఈ ఊరికి కొత్త. నాకు అసలు ఇక్కడ ఏమీ అర్థం కావడం లేదు...”
“ఓ అదా!” నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. “నేనో దేశదిమ్మరిని. అంటే ఇల్లు పట్టక అలా తిరుగుతానని కాదు. నా ఉద్యోగం అలాంటిది. ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా కాలం రైల్లోనే జీవిస్తాను. కనుక ఊళ్లో ఉండే మా బంధువుల కన్నా నాకు కాలం నెమ్మదిగా నడుస్తుంది. నెమ్మదిగా ముసలి వాణ్ణి అవుతాను. ఏదో నా అదృష్టం బావుండి ఈ రోజు ఇలా వచ్చి నా చిన్నారి మనవరాలిని సజీవంగా చూడగలుగుతున్నాను. ... ఇదుగో చూడండి, టాక్సీలో సామాను ఎక్కించాలి. మా మనవరాలు అవస్థ పడుతోంది. మనం మళ్లీ కలుద్దాం,” అంటూ హడావుడిగా వెళ్లిపోయాడా వ్యక్తి.
సుబ్బారావు మళ్లీ ఒంటరివాడయ్యాడు. తనకంతా అయోమయంగా ఉంది. తను ఎక్కడున్నాడు? ఎప్పుడు ఉన్నాడు? అసలేంటి ఈ వ్యవహారం అంతా? మసంతా చిరాగ్గా ఉన్నప్పుడు కడుపులో కాస్త పడేసుకోవడం సుబ్బారావుకి చిన్నప్పట్నుంచి ఓ అలవాటు. కనుక స్టేషన్లోకి వెళ్లి ఓ టీ స్టాల్ లో రెండు సమోసాలు కొనుక్కుని తిన్నాడు. అవి సులభంగా మింగుడుపడేందుకు గాని ఓ టీ తాగాడు. దాంతో మెదడు యథావిధిగా పనిచెయ్యడం మొదలెట్టింది.
ఆలోచించి చూడగా సాపేక్షతా సిద్ధాంతంలో ఏదో అంతర్ వైరుధ్యం ఉన్నట్టు కనిపించింది.
“మరి అంతా సాపేక్షమే అయితే ప్రయాణీకులు కూడా ఊళ్లో ఉన్నవాళ్లకి ముసలి వాళ్లయినట్టు కనిపించాలి. అంటే ఇద్దరూ ఒకరికొకరు ముసలి వాళ్లుగా కనిపించినా, నిజానికి ఎవరికి వారు యవ్వన వంతులే అయ్యుండాలి. కాని ఆలోచిస్తే ఇది కూడా అర్థం లేకుండా ఉంది... పండు జుట్టు సాపేక్షంగా ఉంటుందా?”
అంతలో స్టేషన్లో హోటల్లో ఓ వ్యక్తి ఒంటరిగా కూర్చుని కనిపించాడు. సందేహ నివారణ కోసం ఆ వ్యక్తిని వినమ్రంగా సమీపించాడు సుబ్బారావు.
(సశేషం...)
0 comments