ఐసాక్ అసిమోవ్
రాసిన How did we find out about Speed of Light
అన్న బుల్లి పుస్తకానికి అనువాదం
మీరు ఎప్పుడైనా
మెరుపును చూశారా?
మబ్బు నుండి
మబ్బుకి, మబ్బుల నుండి నేలకి గంతులు వేసే విద్యుచ్ఛక్తే మెరుపు అంటే. ఆ విద్యుత్తు
గాల్లో ప్రసారం అవుతున్నప్పుడు మెరుపు చుట్టూ ఉండే గాలి తాత్కాలికంగా విపరీతంగా వేడెక్కిపోతుంది.
ఆ సమయంలో ఆ గాలి ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల
దాకా పెరగొచ్చు. అల వేడెక్కిన గాలి వ్యాకోచిస్తుంది. మెరుపు మటుమాయం కాగానే ఆ గాలి
మళ్లీ చల్లబడి సంకోచిస్తుంది. ఇలా అతి తక్కువ కాలంలో గాలి వ్యాకోచించి సంకోచించినప్పుడు
శబ్దం పుడుతుంది. దాన్నే మనం ఉరుము అంటాం.
కనుక మెరుపు మెరవడం, ఉరుము ఉరమడం – రెండూ ‘పిడుగు’ అనే పరిణామం యొక్క రెండు ముఖాలు. అది జరిగినప్పుడు పుట్టే
తీక్షణ కాంతిని మెరుపు అంటాం, అప్పుడు పుట్టిన శబ్దాన్ని ఉరుము అంటాం.
మనకి దగ్గర్లో
పిడుగు పడ్డప్పుడు మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది, ఉరుము చప్పుడు కూడా చాలా బిగ్గరగా ఉంటుంది. మెరుపు దూరంగా
మెరిసినప్పుడు కాంతిలో తీక్షణత తక్కువగా ఉంటుంది. పైగా శబ్దం లేకుండా మౌనంగా మెరుస్తుంది.
కాసేపు ఎదురు చూస్తే అప్పుడు శబ్దం వినిపిస్తుంది. అది మళ్లీ మళ్లీ మారుమ్రోగుతుంది.
మెరుపు దూరంగా
మెరిసినప్పుడు ప్రకాశం తక్కువగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఉరుము చప్పుడు కూడా తక్కువ తీవ్రత కలిగి ఉండడం కూడా సబబే.
కాని మెరుపుకి, ఉరుముకి మధ్య ఆలస్యం ఎందుకుండాలి?
దానికి కారణం
శబ్దం ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణించడానికి సమయం పడుతుంది. శబ్దం గంటకి
740 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సెకనుకి
1086 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. ఐదు సెకనులలో
ఓ మైలు దూరం ప్రయాణిస్తుంది. మైలు దూరంలో పిడుగు పడితే ఐదు సెకన్ల తరువాత అది మనకి
వినిపిస్తుంది. రెండు మైళ్ల దూరంలో ఐతే పది సెకన్లు పడుతుంది.
కాని మెరుపు
నుండి వచ్చే కాంతి సంగతేంటి? దానికి కూడా మనని చేరడానికి సమయం పడుతుందా?
పట్టొచ్చేమో.
కాని బహుశ అది శబ్దం కన్నా చాల వేగంగా ప్రయాణిస్తుందేమో. అందుకే ఉరుము వినిపించడానికన్నా
ఎంతో ముందే మనకి మెరుపు కనిపిస్తుంది.
కాంతి ఎంత వేగంగా
ప్రయాణిస్తుందో కొలవగలమా?
కొలవలేమనే ప్రాచీనకాలంలో
జనం అనుకునేవారు. కాంతి ఎంత దూరమైనా లిప్తలో ప్రయాణించేస్తుందని కొందరు పండితులు అనుకునేవారు
ఆ రోజుల్లో. అంటే దాని వేగం అపరిమితం అన్నమాట. అంటే మనకి తెలిసిన మరే ఇతర వేగం కన్నా
ఆ వేగం ఎక్కువ.
పోనీ కాంతి వేగం
అపరిమితం కాకపోయినా దాని వేగం మనం కొలవలేనంత ఎక్కువ అని అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు.
కాంతి వేగాన్ని
కొలవడానికి ప్రయత్నించిన వారిలో మొదటి వాడు ఇటలీకి చెందిన మేటి శాస్త్రవేత్త గెలీలియో
(1564-1642). ఈ ప్రయత్నం అతడు 1630 లో చేశాడు.
ఈ ప్రయోగంలో
గెలీలియోకి తన అనుచరుడు సహాయపడ్డాడు. ఇద్దరూ రెండు లాంతర్లు పట్టుకుని బయల్దేరారు.
ఇవి ప్రత్యేకమైన లాంతర్లు. ఇందులో కొవ్వొత్తి దీపం నుండి వచ్చే కాంతి ఓ చిన్న కిటికీ
లోంచి బయటీకి వస్తుంది. ఆ కిటికీ మూస్తే కాంతి పైకి రాదు. ఆ కిటికీని వేగంగా మూసి తెరుస్తుంటే
లాంతరులోంచి వచ్చే కాంతి మెరుపుల్లా పైకి వస్తుంటుంది. చిమ్మచీకటీగా ఉన్న ఓ రాత్రి
గెలీలియో, తన అనుచరుడు చెరో లాంతరు పట్టుకుని పక్కపక్కగా ఉన్న రెండు కొండలు ఎక్కారు.
కొండ శిఖరం చేరాక ఇద్దరూ తమ లాంతరు కిటికీలు తెరిచి మెరుపులు ప్రకటించాలి. అనుచరుడి
మెరుపు కనిపించగానే గెలీలియో తన లాంతరు కిటికీ మూసేయాలి. అలాగే గెలీలియో మెరుపు కనిపించగానే
అనుచరుడు తన లాంతరు కిటికీ మూసేస్తాడు.
ముందు గెలీలియో
లాంతరు తెరిచి మెరుపు ప్రకటించాడు. అవతలి కొండ మీద ఉన్న అనుచరుడు ఆ మెరుపు కనిపించగానే
తన లాంతరులోని కాంతిని ప్రకటించాడు. గెలీలియో తను లాంతరులోని కాంతి ప్రకటించడానికి,
అవతల తన అనుచరుడు ప్రకటించిన కాంతి కనిపించడానికి మధ్య వ్యవధిని కొలిచాడు. ఇదే ప్రయోగం
పదే పదే చేసి వచ్చిన ఫలితానికి సగటు విలువ లెక్కించాడు. అలా వచ్చిన వ్యవధి విలువ కాంతి
ఒక కొండ నుండి రెండవ కొండకి ప్రయాణించి తిరిగి రావడానికి పట్టిన సమయంతో సమానం అవుతుందని
గెలీలియో ఊహ.
(ఇంకా వుంది)
0 comments