వాస్తవానికి
దూరమైన అలాంటి చిత్రాన్ని (కల ద్వారా) ప్రదర్శించి అతడి అచేతన అతడికి ఏం చెప్పాలని
చూస్తోంది? ఆ వ్యక్తితొను అతడి జీవితం తోను దగ్గరి సంబంధం వున్న ఓ దిగజారిన స్త్రీ
అన్న భావనని అతడి అచేతన వ్యక్తం చేస్తోంది. అయితే అలాంటి భావనని అతడి భార్య మీద ఆపాదించడం
వాస్తవాల దృష్ట్యా శుద్ధ తప్పు. కనుక ఆ వికృతమైన కలకి అర్థం మరింకేదో అయ్యుంటుంది.
మనలోని గ్రంథుల
నిర్మాణం బట్టి ప్రతీ మనిషిలోను స్త్రీ, పురుష
అంశాలు కలగలిసి ఉంటాయని చెప్పే ఆధునిక జీవశాస్త్రం చెప్తుంది. కాని చాలా కాలం క్రితమే,
మధ్య యుగపు కాలంలో “ప్రతీ పురుషుడి లోను ఓ
స్త్రీ దాగి వుంటుంది” అనే నానుడి చలామణిలో ఉండేది. మగవాడిలో ఉండే స్త్రీ అంశానికి
నేను “anima” అని పేరు పెట్టాను. పురుషుడిలో దాగి వుండే ఈ స్త్రీ అంశం ఒక విధంగా ఆ
వ్యక్తి తన పరిసరాలతో ఏర్పరచుకునే సంబంధాలకి, ముఖ్యంగా స్త్రీలతో ఏర్పరచుకునే సంబంధాలకి
మూర్తిరూపం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటికి మామూలుగానే కనిపించొచ్చు. కాని “తన
లోపల వున్న స్త్రీ” యొక్క అథమ స్థితిని అతడు బయటికి కనిపించకుండా దాచి ఉంచడానికి ప్రయత్నిస్తూ
ఉండొచ్చు.
పురుషుడిలో ప్రచ్ఛన్నంగా స్త్రీ తత్వం దాగి వుంటుందన్న భావనకి ప్రతిరూపం 'అర్థనారీశ్వర' అన్న భావన కావచ్చు
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష తత్వాలు కలిసి వుండడం అనే భావనకి ప్రతిరూపం ఈ Crowned Hermaphrodite
ఇందాక చెప్పుకున్న
రోగి విషయంలో సరిగ్గా అదే జరిగింది. అతడిలో స్త్రీ పార్శ్వం అంత గొప్పగా లేదన్నమాట.
తన కల కూడా అతడితో అదే చెప్తోంది – “నువ్వో దిగజారిన స్త్రీ లాగా ప్రవర్తిస్తున్నావు
సుమా!” అంటోంది. ఆ కలకి అతడు ఖంగు తిన్నాడు. (ఇలాంటి కలలని చూసి మన అచేతన మనకి “నైతిక” ఆదేశాలు ఇస్తుందని భావిస్తే
పొరబాటే అవుతుంది. అతడి కల అతణ్ణి “నీ ప్రవర్తన మార్చుకో” మని శాసించడం లేదు. అంతవరకు
అతడి సచేతన మనస్సు అతడికి “నువ్వు చాలా పెద్దమనిషివి” అన్న అపోహ కల్పిస్తోంది. కాని
అతడి అచేతన ఆ అపోహ మీద దెబ్బ కొడుతూ, అతడి చిత్తంలో ఉండే అసమతౌల్యాన్ని ఎత్తి చూపుతోంది.)
దీన్ని బట్టి
స్వాప్నికులు (కలలు కనేవారు) తమ కలలని ఎందుకు పట్టించుకోరో, తమ కలలలోని సందేశాన్ని
ఎందుకు లెక్కచెయ్యరో అర్థమవుతోంది. సచేతనకి అచేతన అంటే గిట్టదు. అలాగే సచేతనకి తెలియనితనం
అంటే పడదు. తనకి తెలియని దాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆదిమ తెగలలో తరచు కొత్త విషయాల
పట్ల వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మానవశాస్త్రవేత్తలు
(anthropologists) “misoneism” (నవ్యతాద్వేషం?)
ఆంటారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఓ క్రూరమృగం ఎలా ప్రవర్తిస్తుందో,
ఆదిమ తెగల వారు కూడా ఇంచుమించు అలాగే స్పందిస్తారు. కాని చిత్రం ఏంటంటే = “నాగరిక”
జీవులు కూడా నూతన భావాల విషయంలో అలాగే ప్రవర్తిస్తారు. కొత్త భావాలు లోపలికి ప్రవేశించకుండా
తమ మనసుల్లో బలమైన గోడలు ఏర్పాటు చేసుకుంటారు. అది నవ్య భావాల దాడి నుండి తమని తాము
ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నం అన్నమాట. మనుషులు తమ కలలకి ఎలా స్పందిస్తారో చూసినప్పుడు,
లేదా తమకి విభ్రాంతి కలిగించే ఆలోచనని ఎదుర్కున్నప్పుడు వారి స్పందన చూస్తే సరిగ్గా
ఇదే కనిపిస్తుంది. తత్వ, విజ్ఞాన, సాహితీ రంగాల్లో నూతన భావాలతో ముందుకు వెళ్లే యువతరానికి పాత భావాలని
పట్టుకు వేళ్ళాడే ఛాందసుల అవరోధం, అభ్యంతరం ఎప్పుడూ ఉంటుంది. వైజ్ఞానిక రంగాలు అన్నిట్లోకి
మనస్తత్వ శాస్త్రం వయసులో ఎంతో చిన్నది. ఎప్పుడూ అచేతనతో తలపడడానికి ప్రయత్నిస్తుంది
కనుక అది ఎదుర్కునే అవరోధం, లేదా “misoneism”,
అంతా ఇంతా కాదు.
0 comments