ఇప్పటికే మా
మావయ్య మాట తీరు నాకు బాగా అర్థమై వుండాలి. ఎంత సంకట పరిస్థితిలోనైనా ఇలా నిబ్బరంగా
ఉండగలగడం తనకే సాధ్యం.
“ఇదుగో చూడు
మన నీటి తిత్తులు పూర్తిగా ఖాళీ. ఆ కంకర దొన్నెల్లో
వర్షపు నీరు చేరుకుంది. ఈ నీటితో మన నీటితిత్తులని మళ్లీ నింపుకుందాం పద. అప్పుడిక
మళ్లీ దాహం గురించి బెంగ పడక్కర్లేదు. ఇక మన తెప్ప విషయాని కొస్తే హన్స్ ని వీలైతే
దానికి మరమ్మత్తు చెయ్యమంటాను. అయితే దాంతో మళ్లీ
మనకి పని ఉండదని అనిపిస్తోంది.”
“ఏం? ఎందుకని?”
ఆందోళనగా అడిగాను.
“ఏమో. నాకలా
అనిపిస్తోంది అల్లుడూ. మనం వెళ్ళే దారినే తిరిగి రామని అనిపిస్తోంది.”
ఓ సారి మావయ్య
కేసి విస్తుబోయి చూశాను. ఈయన మెదడు మరీ ఇంత తేడాగా ఉండడం అవసరమా? సందేహం లేదు పిచ్చే,
కాని ఆ పిచ్చి లో కూడా ఓ తీరు తెన్ను ఉండడం ప్రతీ సారి ఆశ్చర్యం కలిగిస్తుంది.
“లే. టిఫిన్
చేద్దాం పద,” అన్నాడు మావయ్య.
ఆయన వెంటే కిమ్మనకుండా
వెళ్లాను. హన్స్ కి ఏవో ఆదేశాలిచ్చి ఆయన ముందుకు కదిలాడు. నిలవబెట్టిన మాంసం, బిస్కట్లు,
టీ – ఇవీ మా టిఫిను! ఈ చలిగాలి, ఈ నిశ్చల వాతావరణం, అంత వరకు మేం పడ్డ తంటాలు, ఇవన్నీ
నా ఆకలిని పెంచేశాయి. ఆవురావురని తిన్నాను.
తింటూ మావయ్యని
అడిగాను ఇంతకీ మనం ఎక్కడున్నామని,
“మనమసలు ఎక్కడున్నాం?
... నాకేమీ అర్థం కావడం లేదు,” అంటూ ఏదో గొణిగాను.
“అవున్నిజమే.
ఆ విషయం తేల్చుకోవడం కష్టమే. బహుశ అసంభవమేమో కూడా. ఈ తుఫాను గొడవ వల్ల గత మూడు రోజులుగా
మన పడవ దిశ, వేగం మొదలైన సమాచారం నమోదు చేసుకోడానికి వీలు కాలేదు. కాని ఉజ్జాయింపుగా
చెప్పొచ్చేమో.”
“మనం కిందటి
సారి నమోదు చేసుకున్నది ఆ ద్వీపం మీద ఉన్నప్పుడు…”
“ఊరికే ‘ద్వీపం’
అనకు. దాని పేరు ఏక్సెల్ ద్వీపం. భూమి కేంద్రభాగాల్లో కనుక్కోబడ్డ మొట్టమొదటి ద్వీపం
అది. దానికి నీ పేరు పెట్టిన గౌరవాన్ని ఊరికే కాదనకు మరి.”
“సరే ఏక్సెల్
ద్వీపం అనే అంటాను. అప్పటికి సముద్రం మీద 270
కోసుల దూరం వచ్చాం. ఐస్లాండ్ నుండి 600
కోసుల దూరానికి వచ్చాం.”
“సరే అయితే.
అక్కణ్ణుంచి బయల్దేరితే తుఫానులో నాలుగు రోజులపాటు ప్రయాణించాక ఎంత దూరం వచ్చామో లెక్కెడదాం,”
మావయ్య వివరించుకొచ్చాడూ. “సగటున రోజుకి ఎనభై కోసులు ప్రయాణించాం అనుకుంటే…”
“మరో మూడొందల
కోసులకి పైగా ప్రయాణించి వుంటాం.”
“అంటే ఈ లేడెన్
బ్రాక్ సముద్రం తీరం నుండి తీరం వరకు ఆరొందల కోసుల వెడల్పు ఉంటుందన్నమాట. కచ్చితంగా
మధ్యధరా సముద్రంతో పోటీ పడుతోంది,” లెక్క పూర్తి చేస్తూ అన్నాడు మావయ్య.
“అది కూడా మనం
దాటింది అతి తక్కువ వెడల్పు ఉన్న చోట అనుకుంటేనే. పైగా నా లెక్కలు సరైనవే అయితే ప్రస్తుతం
మనం రెయిక్ జావిక్ కి తొమ్మిది వందల కోసుల దూరానికి వచ్చాం. అంటే మధ్యధరా సముద్రం కిందికి
వచ్చి వుంటాం.”
“కాని ప్రస్తుతం
మనం ఉన్నది టర్కీ కిందనా, లేక అంటార్కిటికా కిందనా అన్నది మనం ఏ దిశలో ప్రయాణించాం
అన్న దాని మీద ఆధారపడి వుంటుంది. మన దిశలో దోషం ఉండే అవకాశం కూడా ఉంది,” సందేహం వ్యక్తం చేస్తూ అన్నాడు మావయ్య.
“నాకలా అనిపించడం
లేదు,” ధీమాగా అన్నను. “మనం ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణిస్తూ వచ్చాం అనిపిస్తోంది. ఇప్పుడు
మనం ఉన్న తీరం గ్రౌబెన్ రేవుకి దక్షిణ-తూర్పు దిశలో వుంది.”
“పద, విషయం ఏంటో
దిక్సూచిని అడిగితే తేలిపోతుంది,” ఆంటా మావయ్య దిక్సూచి దగ్గరికి నడిచాడు.
హన్స్ మా పరికరాలన్నిటినీ
ఓ తిన్నె మీద నీటుగా పేర్చాడు. మావయ్య వెళ్లి దిక్సూచిని పైకి తీసి ఓ రాయి మీద పెట్టి
సూది కేసి చూశాడు. అది కాసేపు అటు ఇటు వయ్యారంగా ఊగి ఒక చోటి నిలిచింది. మావయ్య సూది
చూపిస్తున్న వైపు చూడాడు. మళ్లీ చూశాడు. కళ్లు నులుముకుని మళ్లీ చూశాడు. ఏదో పొరబాటు
జరిగింది.
“ఏవయ్యింది మావయ్యా?”
కాస్త ఆదుర్దాగా అడిగాను.
దగ్గరకి వచ్చి
చూడమని నాకు సైగ చేశాడు. సూది యొక్క ఉత్తర దిశ మేం దక్షిణం అని అంతవరకు అనుకుంటున్న
దిశగా చూపిస్తోంది. ఆ పెట్టెని ఓ సారి బలంగా
కుదిపి మళ్లీ చూశాను. మళ్లీ అదే ఫలితం. దీని వల్ల ఒకటే అర్థమవుతోంది.
తుఫానులో అనుకోకుండా
మా దిశ మారిపోయింది. చూడబోతే ఎప్పుడో వదిలేశాం అనుకున్న తీరానికే సురక్షితంగా మళ్లీ
వచ్చాం.
కథ మొదటికొచ్చింది.
(ముప్పై ఆరవ
అధ్యాయం సమాప్తం)
0 comments