మనలో ఉండే “రెండు
మనసులు”
కలల మీద చేసిన
అధ్యయనాల ఆధారంగానే మనస్తత్వ శాస్త్రవేత్తలకి
అసలు అచేతన అనేది ఒకటి వుందన్న అవగాహన కలిగింది. దీన్ని బట్టి ప్రతీ మనిషిలోను “ఇద్దరు
వ్యక్తులు” ఉన్నారని అనుకోవాలి. ఒకే మనిషిలో రెండు మనసులు అన్నమాట. ఒకే వ్యక్తిలో పలు
వ్యక్తిత్వాలు ఉండడం అనేది ఒక విధమైన మనోవైకల్యంగా భావిస్తాం. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో
Multiple Personality Disorder (MPD) అంటారు. కాని ఇది అలాంటిది కాదు. ఇక్కడ మనం చెప్పుకునే
రెండు మనసులు – సచేతన మనస్సు, అచేతన మనస్సు – అనేవి సహజమైనవి. అవి వైకల్యానికి చిహ్నాలు
కావు. ఈ రకమైన మనోనిర్మాణం మానవ చరిత్రలో తొలి దశల నుండి వస్తున్న ఒక విధమైన మానసిక
వారసత్వం.
మలయాళం సినిమా
'మణిచిత్ర తఱు' లో MPD తో బాధపడుతున్న ఓ వ్యక్తి
చిత్రీకరణ
మానవ చేతన ఎంతో
నెమ్మదిగా, ప్రయాసభరితంగా ఎన్నో సహస్రాబ్దాల పాటు ఎదిగి ప్రస్తుతం మనం చూస్తున్న నాగరక
దశకి చేరుకుంది. లిఖిత భాష మొదలైన నాటి నుండి నాగరికత మొదలయ్యింది అని తలపోస్తూ ఉంటారు.
అంటే సుమారు క్రీ.పూ. 4000 అన్నమాట. అయితే ఈ నియమానికి లోతైన తార్కిక సంజాయిషీ వంటిది
ఏమీ లేదు. ఆ ఎదుగుదల లేక మానసిక పరిణామ యాత్ర
ఇంకా ముగియలేదు. ఎందుకంటే మానవ చేతనలో ఇంకా ఎన్నో భాగాలు గాఢమైన చీకటిలో మునిగి వున్నాయి.
అచేతన అనేది
లేదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్లు చేతన పట్ల మన అవగాహన సంపూర్ణంగా వుందని భావిస్తున్నారన్నమాట.
భాహ్య ప్రకృతి గురించి మనకి సంపూర్ణ జ్ఞానం
ఉందని అనుకోవడం ఎంతో పొరబాటో, మనలో అచేతన అనేది లేదని అనుకోవడం కూడా అంతే తప్పు. కొంత
మంది ఎప్పుడూ పాత భావాలనే పట్టుకు వేలాడుతూ, కొత్త భావాలకి అడ్డుపడుతుంటారు. అలాంటి
వాళ్లే అచేతన యొక్క ఉన్కిని తిరస్కరిస్తుంటారు.
మానవ చిత్తంలో
ఈ అజ్ఞాత విభాగం యొక్క ఉన్కిని ఒప్పుకోవడంలో ఎందుకింత సమస్య ఎదురవుతోంది? దానికి కొన్ని
చారిత్రక కారణాలు ఉన్నాయి. మన పరిణామ చరిత్రలో చైతన్యం అనేది ఇటీవలే అలవడిన ఒక సామర్థ్యం.
అది ఇంకా “ప్రయోగాత్మక” దశలో వుంది. కాస్త పెళుసుగా, అస్థిరంగా, సులభంగా భంగపడే లక్షణం
కలిగి వుంది. ఆదిమ, ఆటవిక తెగలని అధ్యయనం చేసే మానవశాస్త్రవేత్తలు
(anthropologists) ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు.
అలాంటి తెగల వారిలో కనిపించే ముఖ్యమైన మానసిక రుగ్మత “ఆత్మ నాశనం” (“loss of
soul”). అంటే “నేనొక వ్యక్తిని” అన్న భావన పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం గాని, లేదా
ఆ భావనలో లోతైన దుష్పరిణామాలు రావడం గాని జరగడం. దీన్ని బట్టిలో మన చేతన ఎంత అస్థిరంగా,
పెళుసుగా ఉంటోందో అర్థమవుతుంది.
ఆధునిక మానవుడిలో
చేతనకి, ఆ ఆదిమ తెగలకి చెందిన మానవుడి చేతనకి మధ్య ఎంతో తేడా వుంటుంది. మనలో ఉన్నట్టుగా
వారికి చేతన అంటే ఒక అఖిలమైన, అవిభాజ్యమైన ఏకైక తత్వం కాదు. ఉదాహరణకి వారిలో కొన్ని
తెగలలో ప్రతీ వ్యక్తికి తన సొంత ఆత్మతో పాటు ఒక
“వృక్షాత్మ” (bush soul) ఉంటుంది అన్న
నమ్మకం ఒకటి వుంటుంది. ఈ వృక్షాత్మ ఒక అడవి
మృగంలోనో, ఓ చెట్టులోనో అవతరించి వుంటుంది. దాన్ని కలిగిన వ్యక్తికి ఆ మృగంతోనో, లేక
చెట్టుతోనో ఒక విధమైన అవినాభావ సంబంధం ఉంటుంది.
దాంతో ఒక విధమైన తన్మయత్వాన్ని (తత్ + మయ త్వం = ‘అదే నేను’ అనే భావన) అనుభూతి చెందుతాడు.
ఫ్రాన్స్ కి చెందిన మానవజాతుల శాస్త్రవేత్త (ethnologist) లూసియెన్ లివీ-బ్రూల్ కూడా ఇలాంటి అనుభూతిని, నమ్మకాన్ని ఒప్పుకుంటూ దానికి
“అధ్యాత్మిక పాత్రత్వం” (mystical participation) అని పేరు పెట్టాడు. ఒక వస్తువుతోనో,
వ్యక్తితోనో తన్మయత్వాన్ని అనుభూతి చెందడం అనేది చాలా సహజమైన మానసిక ప్రవృత్తి అని
నేను కూడా భావిస్తాను.
ఆదిమ తెగలలో
ఇలాంటి తన్మయత్వం ఎన్నో రూపాలు తీసుకుంటుంది. ఆ “వృక్షాత్మ” ఒక జంతువు అయినట్లయితే
ఆ జంతువు దానికి సంబంధించిన మనిషికి ఒక విధమైన సోదర జీవి అవుతుంది. ఉదాహరణకి ఒక మనిషికి
ఓ మొసలి సోదర జీవి అయినట్లయితే, ఆ మనిషి మొసళ్లు ఎక్కువగా ఉండే నదిలో ఈదుతున్నప్పుడు
కూడా మొసళ్ల నుండి అతడికి ఏ ప్రమాదమూ ఉండదని వాళ్లు నమ్ముతారు. అలాగే ఒక మనిషికి ఓ
చెట్టు సోదర జీవి అయినట్లయితే, ఆ చెట్టుకి ఆ మనిషి మీద ఒక విధమైన అధికారం ఉంటుందని
నమ్ముతారు. అంతే కాకుండా సోదర జీవికి (ఆ మొసలికి గాని, చెట్టుకి గాని) ఏదైనా అపాయం
కలిగితే, ఆ మనిషికి కూడా హాని కలిగినట్టే భావిస్తారు.
ఇక మరి కొన్ని
తెగలలో అయితే ఒకే మనిషిలో ఎన్నో ఆత్మలు ఉంటాయని భావిస్తారు. అంటే మనిషి యొక్క చేతన
చిన్న చిన్న అంశాలుగా విభజించబడి వుందన్నమాట. అంటే వారిలో చేతన పరస్పర అనుభంధం గల
పలు అంశాలుగా ఉందన్నమాట. ఇలాంటి తార్కాణాలు చూస్తుంటే మానవ చేతన ఇంకా పూర్తిగా ఏకీకృతం
కాలేదని అర్థమవుతోంది. చిన్న పాటి మనోఘాతం తగిలినా, భావావేశం ఏ మాత్రం కట్టలు తెంచుకున్నా
అఖిలంగా, సమైక్యంగా ఉండే చేతన ముక్కలయ్యే ప్రమాదం వుందని అర్థమవుతోంది.
(ఇంకా వుంది)
Chaalaa baagundi..
migathaa part kooda tondaragaa post cheseyandi sir.
chaalaa interestingaa undi:-):-)