అధ్యాయం 36
ప్రశాంత తాత్విక
సంవాదాలు
నా యాత్రా పత్రిక
లో అంతరాయం వచ్చింది.
మా బుల్లిపడవ
రాళ్లకి కొట్టుకుని ముక్కలు చెక్కలు అయ్యింది.
మేమంతా ఎలాగో
బతికి బయటపడ్డాం. కనుక ఇలా మళ్లీ నా యాత్రా పత్రిక రాయడానికి ఉపక్రమించాను.
మా పడవ రాళ్లని
ఎలా ఢీకొట్టింది, అప్పుడది ఎన్ని ముక్కలయ్యింది అవన్నీ ఇప్పుడు తలచుకోవడం అనవసరం అనుకుంటా.
నేనైతే అంత ఎత్తుకి ఎగిరి సుళ్లు తిరుగుతున్న నీళ్లలో పడబోయాను. ఆఖరి నిముషంలో నన్ను
హన్స్ తన బలమైన చేతులతో పట్టుకోకపోయుంటే ఇక ఇంతే సంగతులు… ఇలా భూగర్భ సముద్రంలో నా
శాల్తీ భూస్థాపితం అయ్యుండేది.
మా ఐస్లాండ్
వీరుడు నన్ను కెరటాల్లోంచి బయటకి లాగి ఇసుక తీరం మీద పడేశాడు. నా పక్కనే మామయ్య కూడా పడి వున్నాడు.
బండ రాళ్ల మీద
పడి మోదుతున్న కెరటాల కేసి మళ్లీ చుశాడు. వక్కలైన పడవ కేసి, చెల్లాచెదురైన మా సరంజామా
కోసం అటు ఇటూ చూశాడు. నాకైతే అతడికి సాయం చెయ్యాలనే వుంది గాని నిజానికి నోరు మెదపడానికి
కూడా ఓపిక లేదు. నాకు నోరు పెగలేసరికి కనీసం ఓ గంట పట్టి వుంటుంది.
వర్షం ఎడతెరిపి
లేకుండా పడుతూనే వుంది. అయితే తుఫాను ఆఖరు దశలలో పడే వర్షంలా ఉందిది. వికృతంగా పొడుచుకొస్తున్న
రాళ్ల నీడలో అందరం కాసేపు సేదతీరాం. ఏం చేశాడో, ఎలా చేశాడో అడక్కండి గాని హన్స్ ఏదో
వండి అందించాడు. దాన్ని ముట్టుకోడానికి కూడా ధైర్యం చాల్లేదు నాకు. మూడు రోజులుగా నిద్ర
లేదేమో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం.
మర్నాడు లేచి
చూసేసరికి వాతావరణం అద్భుతంగా మారిపోయింది. తుఫాను ఛాయలు ఎక్కడా కనిపించలేదు. నేను
మేలుకోగాని మొట్టమొదట నా చెవిన పడిన శబ్దాలు మావయ్య మాటలు. చాలా ఉత్సాహంగా ఉంది కంఠం.
“ఏం అల్లుడూ?
బాగా నిద్ర పట్టింది?” ఉత్సాహంగా అడిగాడు.
ఆ మాటల్లోని
సంతోషం చూసి ఒక్క క్షణం నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోయాను. కోనిగ్స్ స్ట్రాసే లో
బొమ్మరిల్లు లాంటి మా ఇంట్లో, చక్కగా పొద్దున్నే టిఫిన్ చేస్తున్నట్టు ఓ చిన్న ఊహ…
అంతే కాదు ఆ రోజు నాకు, నా బంగారు గ్రౌబెన్ తో పెళ్లయినట్టు ఓ అందమైన పగటి కల…
నిజం చెప్పాలంటే
ఆ తుఫాను మా పడవని మరి కాస్త తూర్పు దిశగా తోసినట్టయితే మేం ఈ పాటికి జర్మనీ కిందకి
వచ్చి ఉండేవాళ్లం. మా సొంతూరు అయిన హాంబర్గ్ కిందకి వచ్చేవాళ్లం. ఈ భూమ్మీద (భూగర్భంలో
కూడా) నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి పాదాల
కిందకి వచ్చి చేరేవాళ్లం. అప్పుడు మా ఇద్దరి మధ్య ఎడం కేవలం నలభై కోసులే ఉంటుంది. అయితే
ఆ నలభై కోసుల దూరం అంతా కేవలం కఠిన గ్రానైట్ గోడ మాత్రమే!
మామయ్య అడిగిన
ప్రశ్నకి నేను జవాబు చెప్పేలోపు ఈ తీపి గురుతులు, చేదు ఆలోచనలు మనసులో గిర్రున తిరిగాయి.
“ఏం మాట్లాడవేం?
బాగా నిద్ర పట్టిందా?”
“ఆ పట్టింది.
అయితే ఇంకా బాగా నీరసంగా వుంది. ఫరవాలేదు అదే సర్దుకుంటుందిలే మావయ్యా.”
“అవును ఫరవాలేదు.
కాస్త విశ్రాంతి తీసుకో.”
“అవును మావయ్యా
ఏంటంత హుషారుగా కనిపిస్తున్నావు? ఏం జరిగిందేం?”
“సంతోషం అల్లుడూ!
పట్టలేనంత సంతోషం! వచ్చేశాం.”
“ఏంటి మన గమ్యం
చేరిపోయామా?” నమ్మబుద్ధి కాలేదు.
“లేదు. గాని
అంతేలేనట్టు ఉండే ఆ సముద్రం అంచుకి వచ్చేశాం. ఇక ఇప్పట్నుంచి మళ్లీ నేల మీద మన ప్రయాణం.
ఇకనుండి నిటారుగా కిందకి ప్రయాణించాలి.”
“అయితే మావయ్యా.
ఏం అనుకోనంటే ఓ చిన్న ప్రశ్న అడగనా?”
“నిశ్చితంగా
అడుగు అల్లుడూ. దానికేం భాగ్యం?”
“ఇక వెనక్కి
వెళ్దామా?”
(ఇంకా వుంది)
0 comments