తమ పేషెంట్ల
కలలతో పరిచయం వున్న ఏ మనస్తత్వ శాస్త్రవేత్తకైనా ఆ కలలలోని వైవిధ్యం, ఆ పేషెంట్ల భౌతిక లక్షణాలలోని వైవిధ్యం కన్నా చాలా ఎక్కువ అని అర్థమవుతుంది.
వారి కలలలో చిత్రవిచిత్రమైన లోకోత్తర ఊహాగానం కనిపిస్తుంది. కాని మనోవిశ్లేషకులు
(psychoanalysts) ఫ్రాయిడ్ రూపొందించిన స్వేచ్ఛానుసంధాన
(free association) పద్ధతితో ఈ కలలని శోధించడానికి
పూనుకుంటే, ఈ కలలన్నీ కొన్ని ప్రాథమిక వర్గాలుగా విడిపోవడం కనిపిస్తుంది. వాటిలో ఒక
గుర్తించదగ్గ విన్యాసం కనిపిస్తుంది. మనోవిశ్లేషణ యొక్క అభివృద్ధి క్రమంలో ఈ విధానానికి
ముఖ్య పాత్ర వుంది. ఫ్రాయిడ్ ఈ విధానాన్ని
ఉపయోగించి, కలలని ఆసరాగా చేసుకుని, రోగి యొక్క అచేతనలో దాగి వున్న సమస్యని శోధించడానికి
ప్రయత్నించాడు.
ఈ రంగంలో ఫ్రాయిడ్
ఓ అద్భుతమైన సత్యాన్ని గమనించాడు. స్వాప్నికుణ్ణి (dreamer) తన కలల గురించి స్వేచ్ఛగా మాట్లాడనిస్తే, ఆ కలలు
స్ఫురింపజేసిన ఆలోచనలని స్వేచ్ఛగా వ్యక్తం చేయనిస్తే, క్రమంగా తన అంతర్యాన్ని బయటపెడతాడు.
తన సమస్యకి మూలమైన అచేతనా నేపథ్యాన్ని బహిర్గతం చేసుకుంటాడు. తను చెప్పిన విషయాల ద్వార
మాత్రమే కాక, తను కావాలని చెప్పకుండా వొదిలేసిన విషయాల ద్వార కూడా తన అచేతనలోని అంశాలు
అనుకోకుండా బయటపడతాయి. మొదట్లో అతడి ఆలోచనలు అర్థం లేకుండా, సంబంధం లేకుండా అనిపించొచ్చు.
కాని కాలక్రమేణా ఏ భావాలనైతే అతడు తప్పించుకోవాలని చూస్తున్నాడో, ఏ బాధాకరమైన ఆలోచనని,
లేక అనుభవాన్ని అతడు అణగదొక్కాలని చూస్తున్నాడో దాన్ని సులభంగా పట్టేయొచ్చు. రోగి ఎంత
కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించినా తను మాట్లడే ప్రతీ మాట తన అచేతన లోని సమస్యనే గుంభనంగా
సూచిస్తూ ఉంటుంది. అనుభవజ్ఞుడైన మనోవిశ్లేషకుడు అయితే ఆ రహస్యం ఏంటో ముందే ఊహిస్తాడు.
తదనంతరం రోగి తన రహస్యాన్ని బయటపెట్టినప్పుడు విశ్లేషకుడు తను ఊహించిన దాంతో పోల్చుకుని
నిర్ధారించుకుంటాడు. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన “అణగదొక్కబడ్డ భావావేశాల సిద్ధాంతం”
(theory of repression) లోని మూలభావన ఇదే. ఈ సిద్ధాంతం గురించి అభ్యంతరం చెప్పడానికేమీ
లేదు. కలలలో కనిపించే ప్రతీకల అంతరార్థం “ఇష్టకామ్యసిద్ధి” (wish fulfilment) అన్న
భావన కూడా సమంజసంగానే వుంది.
ఫ్రాయిడ్ కలలకి
చాలా ప్రాముఖ్యత నిచ్చాడు. స్వేచ్ఛానుసంధాన పద్ధతికి కలలు ఒక రకమైన కొనసాగింపుగా పరిగణించాడు.
కాని ఈ దృక్పథం పూర్తిగా సరికాదని కొంతకాలం తరువాత నాకు అనిపించింది. కలలలో మన అచేతన
నుండి పుట్టుకొచ్చే పలువన్నెల ఊహాగానాలన్నీ కేవలం కోర్కెలు తీర్చుకోడానికి చేసే ప్రయత్నం
అంటే మింగుడు పడలేదు. కలల నుండి మనం తెలుసుకోవలసిన
మరింత ప్రగాఢమైన సత్యం మరింకేదో ఉంటుందని అనిపించింది.
ఈ దిశలో నా సందేహాలు
బయల్దేరడానికి కారణం నా మిత్రుడికి జరిగిన ఓ అనుభవం. ఆ మిత్రుడు ఓ సారి రష్యాలో ఓ సుదీర్ఘమైన
రైలు యాత్రలో ఉండగా ఆ అనుభవం జరిగింది. ఆ వ్యక్తికి
సిరిలిక్ లిపి* (Cyrillic script) అంతకు ముందు తెలీదు. దారి పొడవునా రైల్వే స్టేషన్లలో
ఊరి పేర్లు ఆ లిపిలోనే రాసి వున్నాయి. ఆ లిపిలో
రాసిన సూచనలు చదువుతూ, ఆ అక్షరాల కేసి తదేకంగా చూస్తూ, వాటి గురించి ఆలోచిస్తూ, ఒక
రకమైన ధ్యాన స్థితిలో మునిగిపోయాడు ఆ వ్యక్తి.
(*సిరిలిక్ లిపి
– రష్యా లోను, దానికి పొరుగు దేశాల్లోను వాడబడే ఓ ప్రముఖ లిపి.)
ఆ స్థితిలో ఆ
అక్షరాలు అతడి చేతన లోతులని తడిమాయి. అతడి
మనసులో ఏవో పాత జ్ఞాపకాలు వేగంగా మెదిలాయి.
ఎప్పుడో మనసు లోతుల్లో పూడుకుపోయిన కొన్ని చేదు సంగతులు పైకి తేలాయి. సచేతన మనస్సు
ఎప్పుడో మరచిపోయిన, సచేతన మనసు నుండి ఎప్పుడో బహిష్కరించబడిన సంగతులవి. ఆ స్థితిలో
అతడు తనలో దాగిన “మానసిక సంక్లిష్టాలు” (complexes) ని స్పృశించాడన్నమాట. తనని కలవరపెడుతున్న మనోవికారాలకి,
న్యూరాటిక్ లక్షణాలకి కారణాలైన అణగదొక్కబడ్డ భావావేశాలవి.
ఈ ఉదంతం విన్నాక
స్వేచ్ఛానుసంధాన పద్ధతికి కొనసాగింపుగా కలలని మాత్రమే వాడాల్సిన పన్లేదని అర్థమయ్యింది.
రోగి యొక్క అచేతనలో దాగి వున్న సంక్లిష్టాలని చేరుకోడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.
ఆ యాత్రకి ప్రేరణ ఎన్నో చోట్ల నుండి రావచ్చు. అవి సిరిలిక్ అక్షరాలు కవచ్చు, ఓ స్ఫటిక గోళం (crystal ball) (చిత్రం) కావచ్చు,
ఓ ఇష్టదేవతా మూర్తి కావచ్చు, లేదా ఓ ఆధునిక చిత్తరువు కావచ్చు… మరే ఇతర అత్యంత సామాన్య
దైనిక సంఘటన అయినా కావచ్చు. ఇవన్నీ అచేతనలోకి అడుగుపెట్టడానికి వీలైన ద్వారాలు. వాటి లాగే కల కూడా మరో ద్వారం. కాని కలలకి ఓ ప్రత్యేకత
వుంది. ఏదో హార్దిక సంక్షోభం వల్ల ఏర్పడ్డ స్వాభావిక సంక్లిష్టాల (habitual
complexes) నుండి ఉత్పన్నం చెందుతాయి కలలు. (స్వాభావిక సంక్లిష్టాలు అంటే మన చేతనలోని
అత్యంత సున్నితమైన స్థానాలు. బాహ్య ప్రపంచపు ప్రేరణలకి సున్నితంగా స్పందించి బాధపడే
అంతరంగ అంశాలు.) అందుచేతనే స్వేచ్ఛానుసంధానం వల్ల ఏ కలనైనా ఆరంభంగా తీసుకుని మన చేతనలోని అత్యంత కీలక రహస్యాలని చేరుకోవచ్చు.
(ఇంకా వుంది)
0 comments