కణం లోపలి అంశాలే
కావు, కణం చుట్టూ గోడలా వుందే … ఈ పై పొర… ఇందులో కూడా చాల విశేషం వుందండోయ్. గోడ అంటే
మళ్లీ ఏంటో అనుకునేరు. దీని మందం కేవలం 0.0000001
మిల్లీమీటర్లు! మొదట్లో శాస్త్రవేత్తలు ఈ పొర కేవలం మీరు వెచ్చాలు తెచ్చుకునే
ప్లాస్టిక్ సంచీ లాంటిది అనుకునేవారు. కాని తదనంతరం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్
సహాయంతో ఈ పొరని నిశితంగా పరిశీలించడం మొదలెట్టాక అర్థమయ్యింది దాని సత్తా ఏంటో. కణపొర
(cell membrane) అంటే వట్టి గోడ కాదు. అందులో ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలకి ద్వారపాలకులు
ఉంటారు. కణం అనే ఊళ్లోకి ఎవరు రావాలో, బయటికి
ఎవరు పోవాలో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎవడు పడితే వాడు లోపలికి చొరవగా తోసుకురాకుండా
ఈ ద్వారపాలకులు ఓ కన్నేసి ఉంచుతారు. అందుచేతనే కణం లోపలి పర్యావరణం అంతా కచ్చితంగా
నియంత్రించబడుతుంది. కణంలో వివిధ లవణాలు, నీరు,
ఇతర కర్బన సంయోగాలు అన్నీ సరైన మోతాదులో ఉంచడానికి వీలవుతుంది. అలా కట్టడి చెయ్యకపోతే జీవితం దుర్భరం అయిపోతుందన్నమాట.
ఇప్పుడు ప్రొటీన్లనే
తీసుకోండి. అవి బయటి నుండి రావు. కణంలో ఉండే
కొన్ని కర్మాగారాలలో అవి ఉత్పత్తి అవుతాయి. వాటి తయారీకి కావలసిన ముడి సరుకు బయటి నుండి
ఊళ్లోకి వస్తాయి. అలా ఊళ్లోకి వచ్చేది మన సరుకు, మంచి సరుకు అయితే ద్వారపాలకులు తలుపులు
తీసి పట్టుకుంటారు. దొంగసరుకైతే టక్కున తలుపు లేసేస్తారు. అదన్నమాట.
ఈ రోజుల్లో ప్రతీ
చోట సెక్యూరిటీ వాళ్ళు ఐ.డీ., ఐ.డీ అని యాగీ చేస్తుంటారు చూడండి. మేం కూడా కొంచెం అంతేనన్నమాట.
మాలో ప్రతీ వాడికి ఓ ఐ.డీ. లాంటిది వుంటుంది. దగ్గరికి కొస్తున్నోడు మనోడో కాదో ఆ ఐ.డీ.
చూసి పట్టేయొచ్చు. ఎవడు పడితే వాడు దూకుడు మీద దగ్గరికి కొచ్చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది
కదండీ మరి. ఇప్పుడూ… ఓ సారి మీరే ఆలోచించండి… నేనేమో కళ్లలో ఉండే కడ్డీ కణం గాణ్ణి. ఓ వెంట్రుక కణం గాడు వద్దన్నా వచ్చి అంటుకుపోతున్నాడు
అనుకోండి. చెవుల్లో వెంట్రుకల గురించి విన్నాం గాని, కళ్ల లోంచి వెంట్రుకలు పొడుచుకొచ్చేస్తుంటే…
భయమేయదటండి?
ఎప్పుడూ బోరు
కొట్టకుండా మేం ఇరుగు పొరుగు కణాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కబుర్లు అంటే మాటలతో
కాదనుకోండి. అణువులని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ చెప్పుకుంటాం. వట్టి కబుర్లేంటి ఏకంగా
బృంద గానాలు పాడేసుకుంటాం. ఇప్పుడు మీ గుండెనే తీసుకోండి. అది పాపం అడ్డు అదుపు లేకుండా
నిముషానికి 72 సార్లు
కొట్టుకుంటూ వుంటుంది కదా? అంటే ఏంటనుకుంటున్నారు? గుండె లో కణాలన్నీ కలిసికట్టుగా
అలా ఒకే వేగంతో కొట్టుకుంటున్నాయన్నమాట. అలాంటి సామరస్యం ఈ “కబుర్ల” వల్లనే వీలయ్యింది.
అదే గుండె కణాలన్నిటీ వేరు వేరుగా ఓ పళ్ళెం లో పేర్చి కొట్టుకోమన్నాం అనుకోండి. భావకవుల్లాగా
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో పాడేసుకుంటుంటాడు.
ఒకడి పాటకి మరొకడి పాటకి మరి పొంతన వుండదు.
మీరు సెల్ ఫోన్లు
వాడుకున్నట్టు దూర దూరాలకి సందేశాలు పంపడానికి మేం హార్మోన్లు వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు
మీ ఒంట్లోనే షుగరు ఉల్లిపాయల ధరలాగా అలా పెరిగిపోతోంది అనుకోండి. మీలో పాంక్రియాస్ అంజెప్పి ఉంటుంది లేండి.. ఆ గ్రంథి
ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ కి జీవితంలో తెలిసిందొక్కటే.
చక్కెర అణువులు కనిపిస్తే చావచితక బాదడం. అప్పుడు మీ ఒంట్లో చక్కెర తగ్గుతుంది. అలాగే
మీరు ఉన్నట్లుండి మీ కంప్యూటర్ మీద విరక్తి పుట్టుకొచ్చి, లేచి అలా ఓ సారి జాగ్ చేసి
రావాలని అనుకున్నారు అనుకోండి. మరి దానికి శక్తి కావాలిగా. అప్పుడు మీ ఒంట్లోని థైరాయిడ్
గ్రంథేమో హార్మోన్ల ద్వార మీ కణాలకి సందేశం పంపుతుంది – “మనోడు పరిగెడతాట్ట. కాస్త
ఏటీపీ ఉత్పత్తి పెంచండ్రా బాబూ!”
ఇన్ని మంచి పనులు
చేసే మాలంటోళ్లకి కూడా శత్రువులు ఉంటారండోయ్! వాళ్లని వైరస్ లు అంటారు (చిత్రం). వీటికి మంచి,
చెడు, భయం, భక్తి ఏం ఉండవ్. అసలు వీటికి మైటోకాండ్రియా కూడా ఉండవ్. ఎప్పుడైనా మా ద్వారల
వద్ద ఉండే ద్వారపాలకులు నిద్రపోయారనుకోండీ, లేదా పోయారనుకోండి. ఇదే అదను అనుకుని వీళ్ళు
లోపలికి దూరిపోతారు. ఒక సారి లోపలికి వచ్చాక ఇక కోటలో పాగా వేసి సంతానాన్ని విపరీతంగా
పెంచేస్తారు. ఇక అంత సంతానానికి తిండి పెట్టలేక పాపం ఆ కణం పెటేలున పేలిపోతుంది. అప్పుడు
ఆ కణం పొట్ట చీల్చుకుని బయటికి వచ్చిన వైరస్ సంతతి ఇరుగు పొరుగు కణాల మీద పడతాయి. అలా
ఈ వైరస్ లు ఒక కణం నుండి అవతలి కణానికి వ్యాపిస్తూ, సంఖ్యలో వృద్ధి చెందుతూ కోట్ల కణాలని
నాశనం చేస్తూ పోతాయి. అరె! ఏంటి… భయపడిపోతున్నారేంటి? ఛ ఛ భలే వారే. వైరస్ లు రెచ్చిపోతే
మేం ఊరికే కూర్చుంటామా? మాలో పోలీస్ కణాలు వెళ్లి ఈ వైరస్ లని చితక్కొట్టవూ? అవే లేకపోతే
మీ గతేం అయ్యుండేదో ఓ సారి ఆలోచించండి.
సెల్ఫ్ డబ్బా
అనుకోకపోతే ఓ మాటంటా నండి. మీరేమో ఉన్నది పట్టున ఒక బిలియన్ మంది. ఒక్క విషయం మీద కూడా
అంతా కలిసి రాలేక అల్లకల్లోలం చేసుకుంటుంటారు. మరి మేమేమో 60 ట్రిలియన్ల కణాలం. అందరం ఎంత సామరస్యంగా (గడిగడికి
మరొకడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా) ఎవడి పని వాడు చేసుకుంటూ, ఎవడు, ఎక్కడ, ఎప్పుడు, ఏం చెయ్యాలో తెలుసుకుని ఆ
పని శ్రద్ధగా చేసుకుపోతూ ఉంటాం. ఎంతైనా మేం
వేరు లేండి. మాలాగా ఉండడం… మీర తరం కాదులేండి పోండి!
(‘కణం’ అధ్యాయం
సమాప్తం)
0 comments