తేజపు గోళం చేసిన
తాండవం
ఆ కాంతుల బంతి,
ఆ చమక్కుల చెండు ఉన్న చోట ఉండకుండా పడవంతా
చెంగు చెంగున గంతులు వేసింది. తెరచాప గుంజ విరిగిన చోట ఓ సారి వాలింది. తరువాత మా సంభారాల
సంచీ మీదకి వాలింది. అక్కణ్ణుంచి పోయి పోయి మందుపాతర ఉన్న సంచీ మీదకి వాలింది. ఇంతే
సంగతులు అనుకున్నా మనసులో! కాని రక్షించి ఏం కాలేదు. మౌనంగా, ముభావంగా ఉంటాడని కాబోలు,
ఆ చెండుకు మా హన్స్ నచ్చినట్టున్నాడు! ఓ సారి హన్స్ వైపుకి గంతు వేసింది. ఆ వేటగాడు
మాత్రం నిశ్చలంగా రెప్ప వెయ్యకుండా ఆ నీలి కళ్లతో దాని నీలి తేజాన్ని చూస్తూ ఉండిపోయాడు.
అంతలో మావయ్య మీదకి విజృంభించింది. మావయ్య సకాలంలో స్పందించి బోర్లా పడి దాని దెబ్బ
నుండి తప్పుకున్నాడు. ఇక చివరికి నేనే మిగిలినట్టున్నాను. దాని తఢాకా నా మీద చూబించాలనుకుంది
కాబోలు. నా పాదాల దగ్గర పడి గిర్రున తిరిగింది. దాని నుండి కాస్త దూరంగా జరగాలనుకున్నాను
కాని కాలు కదల్లేదు.
ఆ మంటల వల్ల
వాతావరణంలో ఆక్సిజన్ కొరవడింది అనుకుంటా. నైట్రోజెన్ వాసన భరించలేకుండా ఉన్నాం. ఊపిరితిత్తుల్లో
నైట్రోజెన్ నిండిపోతోంది. ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి.
కాలు ఎందుకు
కదల్లేదో కాసేపటికి గాని అర్థం కాలేదు. పడవలోని దుంగలకి మేకులేసి కొట్టినట్టు పాదం
కదల్లేదు. కాస్త ఆలోచిస్తే విషయం అర్థమయ్యింది. ఆ వచ్చిన కాంతి బంతిలోని కాంతికి మూలం
విద్యుదావేశాలు. ఆ కాంతి విద్యుత్ కాంతి. దాని ప్రభావం వల్ల పడవలోని ప్రతీ ఇనుప వస్తువు
అయస్కాంతీకృతం అయిపోయింది. అందు వల్ల మా పరికరాలు, పనిముట్లు, తుపాకులు అన్నీ ఒకదాన్నొకటి
ఢీకొని విచిత్రంగా ఘర్షణ పడడం మొదలెట్టాయి. నా బూట్లలో ఉండే మేకులు, ఆ పక్కనే ఉండే
ఓ ఇనుప పలకకి అతుక్కుపోవడం వల్ల కాలు కదల్చడానికి వీలుపడలేదు. కల్లు తాగిన కోతిలా పడవంతా
గంతులేస్తున్న ఆ నిప్పుల బంతి మరి కాస్తలో నా కాలిని బుగ్గి చేసేలోగా కాలి లోని బలాన్నంతా
ఉపయోగించి కాలు కదిలించి పక్కకి తప్పుకున్నాను.
ఆ అగ్ని గోళం
గాల్లోకి బాణంలా దూసుకుపోయి పెటేలుమని పేలిపోయింది. ఆ విస్ఫోటంలో వెలువడ్డ కాంతికి
కళ్లు బైర్లు కమ్మాయి.
ఒక్క క్షణంలో
కాంతి అంతా మాయమయ్యి అంత సర్దుకుంది. మామయ్య పడవ లో సాష్టాంగ పడి వున్నాయి. హన్స్ చుక్కానిని
వదలకుండా నిబ్బరంగా ఉన్నాడు. కాని వంటి నిండా విద్యుదావేశం బాగా పట్టినట్టుంది. ఒంట్లోంచి
చిటపట చప్పుళ్లతో విస్ఫులింగాలు ఎగురుతున్నాయి. ‘అగ్ని వీరుడు’ లా రగిలిపోతున్న అతడి
ఆకారాన్ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
ఈ గొడవలో పడి
అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మేం ఎటు వెళ్తున్నట్టు?
మంగళవారం, ఆగస్టు
25
ఎప్పుడు నిద్రపోయానో
తెలీదు. కాని కొన్ని గంటల సేపు గాఢ నిద్రలోకి జారుకున్నాను. బయట తుఫాను ఎప్పట్లాగే
చెలరేగిపోతోంది. మైళ్ల పొడవున్న మహాసర్పాలు గాల్లో భీకరంగా కొట్లాడుతున్నట్టు ఉంది
వాతావరణం.
ఈ పాటికి ఇంగ్లండ్
దాటిపోయి వుంటామా? ఇంగ్లండేం ఖర్మ, ఫ్రాన్స్ మాత్రమే కాక మొత్తం యూరప్ అంతా దాటిపోయి
వుంటామేమో.
ఈ సారి మళ్లీ
ఏదో పెద్ద శబ్దం వినిపించింది. మళ్లీ ఏం మూడిందో…
(ఇంకా వుంది)
(ముప్పై ఐదవ
అధ్యాయం సమాప్తం)
0 comments