అధ్యాయం 37
లీడెన్ బ్రాక్
భౌగోళిక పురావస్తు ప్రదర్శన శాల
ఆ సమయంలో ప్రొఫెసర్
లీడెన్ బ్రాక్ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో, ఎన్ని నదులు పోటెక్కి
ప్రవహిస్తున్నాయో, ఎన్ని తుఫానులు చెలరేగుతున్నాయో చెప్పలేను. ఆయన ముఖంలో అలజడి, అలసట,
ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయొ. ఇంత శ్రమ పడ్డాక, ఇన్ని ప్రమాదాలు తప్పించుకున్నాక
తిరిగి తిరిగి బయల్దేరిన చోటికే రావడమా?
కాని మావయ్య
త్వరలోనే తేరుకున్నాడు.
“విధి నన్నింత
దారుణంగా దెబ్బ కొడుతుందా? పంచభూతాలన్నీ ఇలా కలిసికట్టుగా నా మీద దాడి చేస్తాయా? నా
సత్తా వాటికి ఇంకా తెలీదేమో. నేనసలే మొండి వాణ్ణి. మడమ తిప్పకుండా పోరాడడం నా రక్తంలోనే
వుంది. ఈ పోరాటంలో ప్రకృతి గొప్పదో, మనిషి గొప్పవాడో తేలిపోవాలి.”
ఓ బండ మీద నించుని
పళ్లు కొరుకుతూ, పిడికిలి కోపంగా ఊపుతూ, శివాలెత్తిపోతున్నాడు మావయ్య. వెళ్లి ఏదో ఒకటి
చెయ్యాలి. వేడి కొంచెం చల్లార్చాలి.
“మవయ్యా!” దగ్గరికి
వెళ్లి నెమ్మదిగా అన్నాను. “ఆశకి కుడా అంతుండాలి. అసంభవాన్ని మనం సంభవం చెయ్యలేంగా?
నాలుగు కట్టెముక్కల కట్ట మీద ఎక్కి ఐదొందల కోసుల దూరం పోటెక్కిన సముద్రం మీద ప్రయాణించడం
అంటే మాటలా? అసలు ఇప్పటి దాకా ప్రాణాలతో ఉండడం అంటేనే గొప్ప.”
అలా ఓ పది నిముషాల
పాటు అనునయిస్తూ ఏవేవో మాట్లాడాను. నా మాటలు మావయ్య చెవికి ఎక్కించుకుంటాడని కాదు.
ఏదొ నా పిచ్చి నాది.
“పడవ సిద్ధమయ్యిందా?”
రంకె వేశాడు మావయ్య.
ఇంత సేపు నేను
పెట్టుకున్న మొర అంతా బూడిదలో పోసిన పన్నీరే. మరి మావయ్యది వజ్ర సంకల్పం. దాని కేసి
తల బాదుకుంటే బొప్పి కట్టేది దానికి కాదు.
ఇది చాలనట్టు
హన్స్ అప్పటికే పడవ మరమ్మత్తు పూర్తి చేశాడు. ఈ విచిత్ర జీవికి మావయ్య ఏం ఆలోచిస్తున్నాడో
చెప్పకుండానే తెలుసుపోతోందో ఏంటో? దొరికిన సరంజామాతో ఓ పడవ లాంటిది సిద్ధం చేశాడు.
గాలికి తెరచాప అప్పటికే రెపరెప లాడేస్తోంది.
వీళ్లిద్దర్నీ
ఆపడం ఎలా? వీళ్ల మనసులు మార్చేదెలా? హన్స్ స్వామిభక్తి చూస్తుంటే నాకు ఒళ్లు మండిపోతోంది.
వాళ్ల వెంటే తోకాడించుకుంటూ వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు.
అందరం బయల్దేరబోతుంటే
ఉన్నట్లుండి మావయ్య నా భుజం మీద చెయ్యేసి,
“ఇవాళొద్దు. రేపు బయల్దేరుదాం,” అన్నాడు.
విధి బలీయం అని
మనసులోనే అనుకున్నాను.
“ఏ కారణం చేతనో
మరి విధి నన్ను ఈ తీరానికి లాక్కొచ్చింది. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన దాకా
ఇక్కడి నుండి బయల్దేరేదే లేదు,” మావయ్య నిశ్చయంగా అన్నాడు.
(ఇంక వుంది)
0 comments