మానవ చేతన విచ్ఛిన్నమైన ఉన్న స్థితి మానవాళి యొక్క శైశవ దశలకి మాత్రమే సంబంధించింది కాదు. మనం ‘ఆధునిక’ అని చెప్పుకునే ప్రస్తుత మానవతకి కూడా ఈ స్థితి వర్తిస్తుంది. మనకి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం అంటే ఎవరో తెలీని, మనని మనమే మర్చిపోయే విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం వుంది. భావావేశం చేత చేతన పూర్తిగా క్రమ్ముకోబడినప్పుడు, హేతువుని విస్మరించి మనం విపరీతంగా ప్రవర్తించినప్పుడు, మనకి సంబంధించిన ముఖ్యమైన విషయాలని కూడా మనం తాత్కాలికంగా మార్చిపోయినప్పుడు మన చేతనలో కూడా చీలికలు ఏర్పడ్డాయన్నమాట. అలాంటప్పుడే అవతలి వాళ్లు మనని “ఏవయ్యింది నీకు? ఏవైనా దెయ్యం పట్టిందా?” అని అడుగుతుంటారు. అలాంటప్పుడు మనం “అబ్బే ఏం లేదు, నా మీద నాకు వశం తప్పింది” అని సంజాయిషీ చెప్పుకుంటాం. కాని ఆత్మసంయమనం లేదా ఆత్మనిగ్రహం అనేది చాలా అరుదైన లక్షణం. మన మీద మనకి అన్ని వేళల్లో పూర్తి నిగ్రహం ఉన్నట్టు అపోహ పడతాం. కాని మన మీద మనకి ఎంత నిగ్రహం ఉందో మన కన్నా మన హితులకి, స్నేహితులకి తెలుస్తుంది.
అత్యుత్తమమైన నాగరికత
సంస్కృతి ఉన్న సందర్భాలలో కూడా మానవ చేతన స్థిరమైన అవిచ్ఛిన్నత గల చేతనని సాధించలేదు.
చిన్న దెబ్బకే విరిగి ముక్కలయ్యే లక్షణం చేతనది. చేతనలోని ఒక భాగాన్ని తక్కిన చేతన
నుండి వేరు చేసుకోగలిగడం చాలా విలువైన లక్షణం. దాని వల్లనే ఒక తరుణంలో ఒక దాని మీదనే
చిత్తాన్ని కేంద్రీకరించగల సామర్థ్యం ఏర్పడుతుంది. కాని ఉద్దేశపూర్వకంగా చేతనలోని ఒక
భాగాన్ని వేరుచేసుకోవడం వేరు, అప్రయత్నంగా, అసంకల్పితంగా, మనకే తెలియకుండా మన చేతన
రెండుగా చీలిపోవడం వేరు. మొదటిది నాగరిక విజయం, సంస్కృతికి కొలమానం, రెండవది ఆదిమమైన
“ఆత్మ నాశనం” లేదా న్యూరోసిస్ ని కలుగజేసే ఓ దుష్పరిమాణం.
ఈ నేపథ్యంలోనే
మనం కలల ప్రాముఖ్యత గురించి కొంచెం చెప్పుకోవాలి. మనలో అప్రయత్నంగా జరుగుతూ అస్థిరంగా,
అవిస్పష్టంగా, అవిశ్వసనీయంగా ఉండే ఊహాగానాలు కలలు. ఈ రంగంలో నా భావాలు కొన్నేళ్లుగా
ఎలా పరిణామం చెందిందీ చెప్తాను. మనలో ప్రతీకాత్మకంగా వ్యవహరించే సామర్థ్యానికి వేళ్లు
మన కలలలో ఉన్నాయని నేను ఎలా తెలుసుకున్నదీ వివరిస్తాను.
మన చేతనకి ఒక
అచేతనమైన నేపథ్యం ఉందని గుర్తించి ఆ అచేతనని ప్రయోగాత్మకంగా పర్యటించిన మార్గగాములలో
ప్రథముడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మన కలలలోని సంఘటనలు కేవలం యాదృ చ్ఛి కం కావని, మన చేతనలోని
సంఘటనలకి, సమస్యలకి అవి అద్దం పడతాయని ఫ్రాయిడ్ గుర్తించాడు. ఇది నిరాధారిత భావనో,
నమ్మకమో కాదు. మన సచేతన అనుభవాలకి, న్యూరాటిక్ రోగ లక్షణాలకి మధ్య సంబంధం వుందని ప్రకటించి
పియర్ జేనెట్ (Pierre Janet) వంటి ప్రఖ్యాత
న్యూరాలజిస్టుల భావాలతో ఈ భావం ఏకీభవిస్తోంది. ఒకప్పుడు సచేతనంగానే వున్నా, రోగ ప్రభావం
వల్ల చేతన నుండి వేరు పడ్డ స్థితులే న్యూరాటిక్ రోగ లక్షణాలుగా వ్యక్తం అవుతున్నాయని
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
సిగ్మండ్ ఫ్రాయిడ్
ఇరవయ్యవ శతాబ్దపు
తొలిదశలలో ఫ్రాయిడ్ మరియు జోసెఫ్ బ్రాయర్ లు ఈ రంగంలో ఓ ముఖ్యమైన విషయాన్ని కనుక్కున్నారు.
హిస్టీరియా, కొన్ని రకాల నొప్పి, విపరీతమైన ప్రవర్తన మొదలైన న్యూరాటిక్ లక్షణాలకి నిజానిక
ఒక ప్రతీకాత్మక అంతరార్థం వుందని గమనించారు. ఆ లక్షణాల ద్వార మన అచేతన మనస్సు తనను
తాను వ్యక్తం చేసుకుంటోంది. అది మన సచేతన మనస్సుకి
ఏదో చెప్తోంది. ఉదాహరణకి ఓ బాధాకరమైన క్లిష్టపరిస్థితిలో చిక్కుకున్న వ్యక్తికి, ఏదైనా
మింగడానికి ప్రయత్నించినప్పుడల్లా గొంతులో కండరాలు బిగుసుకుపోయి, బాధ కలగవచ్చు. అంటే
ఆ పరిస్థితిని అతడు “దిగమింగలేక పోతున్నాడు” అన్నమాట. అలాంటి పరిస్థితుల్లోనే, మానసిక
వత్తిడి బాగా ఎక్కువగా ఉన్న స్థితిలో, మరో వ్యక్తికి ఆస్తమా దెబ్బ తగలవచ్చు. అలాంటప్పుడు
“అతడి ఇంట్లో పరిస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి సలపనీయకుండా వుంది” అంటామేమో.
ఇక మూడో వ్యక్తి విచిత్రమైన పరిస్థితుల్లో కాళ్లు చచ్చుబడిపోయి నడవలేకపోవచ్చు. అతడిది
“ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని గడ్డు పరిస్థితి” అన్నమాట. ఇక నాలుగో వ్యక్తికి
ఏం తిన్నా వాంతి అవుతూ వుంటుంది. ఏదో చేదు వాస్తవాన్ని అతడు “జీర్ణించుకోలేక పోతున్నాడు”
అన్నమాట. ఇలాంటి ఉదాహరణలు ఎన్నయిన ఇవ్వొచ్చు. మనని అచేతనంగా కలవరపెడుతున్న సమస్యలు
ఈ విధంగా భౌతికంగా వ్యక్తం కావచ్చు. ఇలా విపరీతంగా ధోరణిలో కాకుండా, సామాన్యంగా తరచుగా మన అచేతన కలల ద్వార కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది.
(ఇంకా వుంది)
0 comments