Demystifying
the Brain (మెదడులోని మర్మం) అనే పాపులర్ సైన్స్ పుస్తకాన్ని లోగడ ఈ బ్లాగ్ లో పరిచయం చెయ్యడం జరిగింది.
ఆ పుస్తకానికి
అనువాదం ఇవాల్టి నుండి మొదలు…
అధ్యాయం 1
మెదడు యొక్క
భావ చరిత్ర
మనిషి మెదడు
తన గురించి తాను ఏమనుకుంటుంది? దాని గురించి దానికి ఎలాంటి అభిప్రాయం వుంది, ఎలాంటి
అవగాహన వుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు శోధిస్తూ పోతే చాలా ఆసక్తికరమైన కథ అవుతుంది.
మనస్సుకి, బుద్ధికి, ప్రజ్ఞకి ఉపాధి, ఆధారం మెదడు అని మనకి ఇప్పుడు తెలుసు గాని రెండు
సహస్రాబ్దాల క్రితం ఆ విషయంలో సరైన అవగాహన ఉండేది కాదు. అలాంటి అవసాన దశ నుండి ప్రారంభమైన
నాడీ శాస్త్రం (neuroscience), నేడు జీన్ థెరపీలు అయితేనేమి, డీప్ బ్రెయిన్ స్టిములేషన్
లు అయితే నేమి, ఎన్నో కొత్త ఒరవళ్లు చోటు చేసుకుంటూ, గుర్తుపట్టరానంతగా పురోగమించింది.
మెదడు చరిత్ర అంటే మెదడును గురించిన మన భావాలలోని దోషాల చరిత్రే! అసలు ఏ వైజ్ఞానిక
రంగంలోనైనా చరిత్ర అంటే ఇలాగే ఉంటుంది. కొత్త ప్రయోగాలు చెప్పే సాక్ష్యం ఆధారంగా పాత
సిద్ధాంతాలలోని తప్పులు దిద్దుకుంటూ విజ్ఞానం పురోగమిస్తుంది మరి. నాడీ శాస్త్రంలో
ఎన్ని తప్పులు సవరించినా, ఎంత పురోగతి సాధించినా, కొన్ని ప్రశ్నలు మాత్రం కొరకరాని
కొయ్యలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి ప్రశ్నలలో ‘చైతన్యం అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి?”
ముఖ్యమైనవి. ఈ లోతైన ప్రశ్నల జోలికి చివరి అధ్యాయంలో వద్దాం గాని ప్రస్తుతానికి మాత్రం
మెదడు చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి చెప్పుకుందాం.
మన మెదడు చరిత్ర
కథ పాశ్చాత్య వైద్య సాంప్రదాయానికి మూలవిరాట్టు అని చెప్పుకోదగ్గ ప్రాచీన గ్రీకు వైద్యుడు
హిపోక్రెటీస్ (460-379 B.C.) తో మొదలుపెడదాం. ప్రస్తుత కాలంలో మనం అనుకున్నట్టే
హిపోక్రెటీస్ కూడా ఇంద్రియాల వ్యవహారాలకి, మనస్సుకి, బుద్ధికి మెదడే ఉపాధి అని నమ్మాడు.
ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో, ప్రజాస్వామ్యం గురించి, ఆదర్శ సమాజం గురించి కలలు
గన్న మేధావి, కూడా మెదడు గురించి ఇంచుమించు అదే విధంగా ఆలోచించాడు. కాని ప్లేటో శిష్యరత్నం
అయిన అరిస్టాటిల్ భావాలు మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా వున్నాయి.
అరిస్టాటిల్
భౌతిక ప్రపంచంలో ఎన్నో అంశాల మీదకి తన చింతనని సారించాడు. ప్రతీ దానికి ఏదో వివరణ ఇచ్చేవాడు.
ఎన్నో సందర్భాలలో ఆ వివరణ తప్పని (ఒకటిన్నర సహస్రాబ్దాల తర్వాత) తేలింది. కాని ఆ రోజుల్లో
మాత్రం అరిస్టాటిల్ తప్పని చెప్పడానికి గాని, నిరూపించి తేల్చిచెప్పడానికి ఎవరికీ ధైర్యం
చాల్లేదు. (ఉదాహరణకి తోకచుక్కలు అంటే ఏంటి అన్న ప్రశ్నకి సమాధానంగా అరిస్టాటిల్ అవి
గాల్లో మండుతున్న వాయువుల వల్ల పుట్టే కాంతులు అని చాటాడు. తోకచుక్కలు మన భూమి చుట్టూ
ఉండే వాయుమండలానికి పరిమితమైనవి కావని, అంతరిక్షంలో ఎంతో దూరం నుండి కొట్టుకొచ్చే రాతి
శకలాలని ప్రస్తుతం మనకి తెలుసు.) అరిస్టాటిల్ తన విడ్డూరపు చింతనని మెదడు మీదకి కూడా
సారించాడు. మనస్సుకి, చైతన్యానికి ఉపాధి మెదడు కాదని, గుండె అని బోధించాడు. ఒక విధంగా
శరీరంలో ప్రాణం నిలవడానికి మెదడు కన్నా గుండే ముఖ్యం అన్నది నిజమే. కాని మన ఆలోచనలకి,
అనుభూతికి ఆధారం మెదడే. కాని గుండె యొక్క ప్రాముఖ్యతని పురస్కరించుకుని అరిస్టాటిల్
అలా భావించి వుండవచ్చు.
ఆ విధంగా మెదడు
గురించి ప్రాచీన గ్రీకు తాత్వికులు తమ మెదడుకి తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ రావడంతో పరిస్థితి
కాస్త గందరగోళంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో మెదడు రంగంలోకి కాస్త స్పష్టత తెచ్చిన
వాడు గాలెన్. ఇతగాడు కూడా ప్రాచీన్ గ్రీకు దేశానికి చెందిన వాడే. కాని ఇతడు తాత్వికుడు
కాడు – వైద్యుడు! తాత్వికులకి, వైద్యులకి ఓ ముఖ్యమైన తేడా వుంది. తాత్వికులు తమ ఊహాశక్తిని
బట్టి, ధీశక్తిని బట్టి విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ పోతుంటారు. అది నిజమా కాదా అన్న
విషయం బాహ్య ప్రపంచం చెప్పే సాక్ష్యం మీద కాక, తర్కమీమాంసల మీద ఆధారపడి వుంటుంది. అలా
కాకుండా తన సిద్ధాంతాలని వాస్తవం సమర్ధిస్తోందని నిరూపించే బాధ్యత వైద్యుడి మీద ఉంటుంది.
అందుకనే కాబోలు మెదడు యొక్క నిర్మాణం విషయంలో గాలెన్ ఎంతో ప్రగతి సాధించాడు.
గాలెన్ కాలంలో
వైద్య రంగంలో విధివిధానాలు అన్నీ కకావికలంగా ఉండేవి. వైద్య వృత్తిని శాసిస్తూ పెద్దగా
శాస్త్రీయ ప్రమాణాలేవీ ఉండేవి కావు. చాలా మటుకు హిపోక్రాటిక్ సాంప్రదాయాన్నే గుడ్డిగా
అనుసరించేవారు. ఈ రోజుల్లో “హోలిస్టిక్ క్లినిక్” లలో చేసినట్టుగా సంగీతంతో రోగనివారణ
చేసే కార్యక్రమాలు చేపట్టేవారు కొందరు. మరి కొంత మంది ఛూం మంత్రకాళీ అంటూ మంత్రాలు
విసిరి రోగాన్ని మాయం చెయ్యబూనేవారు. ఆ రోజుల్లో మానవ కళేబరాలని వైద్య బోధనలో వాడే
విషయంలో మతం విధించిన నిషేధం ఉండేది. ఆ కారణం చేత వైద్య పరిశోధన కుంటినడక నడిచింది.
ఇక గత్యంతరం లేక గాలెన్ వంటి వాళ్లు జంతు కళేబరాలని పరిచ్ఛేదించి, పరీక్షించి ఆ పరిశీలనలని
మానవ శరీరాలకి ఆపాదించేవాళ్లు. జంతుపరిచ్ఛేదంలో ఆరితేరినవాడు గాలెన్. తన అనుభవాన్ని
పొందుపరుస్తూ విస్తృతంగా రాశాడు. ఆ విధంగా
‘శరీర నిర్మాణ శాస్త్రం’ (anatomy) కి పునాదులు
వేశాడనే చెప్పాలి.
గాలెన్
ఉదాహరణకి “మెదడు
గురించి” (On the brain) అనే రచనలో మెదడుని
ఎలా సిద్ధం చెయ్యాలి, ఎలా పరిచ్ఛేదించాలి అన్న విషయాన్ని విపులంగా ఇలా వర్ణించాడు –
(ఇంకా వుంది)
ఈ తెలుగు అనువాదం కోసం ఎదురు చూస్తున్న వారిలో నేను ఒకన్ని. మీరు అనువాధం అందిస్తున్నందుకు దన్యవాధాలు!
Thank you Thirupalu garu. పై పోస్ట్ తర్వాత ఈ పుస్తకం అనువాదంలో మరో రెండు పోస్ట్ లు వచ్చాయి. 'మెదడు లోని మర్మం' అన్న టాగ్ కోసం చూడండి.