ఆ అణువు పేరు
డీ.ఎన్.ఏ. అంటే డీ ఆక్సీ రైబో న్యూక్లీక్ ఆసిడ్ (DNA, Deoxyribonucleic acid). సృష్టికి
మూలకారకమైన ఓ మహత్తరమైన అణువది. కణంలో జరిగే వ్యవహారాలన్నిటికీ అది అధినేత. కణంలోని
వివిధ అంశాలు ఎలా ప్రవర్తించాలో, బాహ్య ప్రేరణలకి కణం ఎలా స్పందించాలో, దేన్ని లోనికి
గ్రహించాలో, దేన్ని ఉత్పత్తి చెయ్యాలో, దేన్నుండి పారిపోవాలో, దేని వెంటపడాలో – అన్నీ
ఆ డీ.ఎన్.ఏ నే చెప్తుంది.
కణం ఓ పెద్ద
భవనం అనుకుంటే డీ.ఎన్.ఏ. దానికి ఆర్కిటెక్ట్ లాంటిది. భవనం రూపురేఖలు ఎలా ఉండాలో డీ.ఎన్.ఏ.
చెప్తుంది. కాని భవన నిర్మాణ కార్యక్రం మాత్రం కంట్రాక్టర్ కి వదిలేస్తుంది. ఈ భవన
నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టే అణువు మరొకటి వుంది. దాని పేరు ఆర్. ఎన్.ఏ. అంటే రైబోన్యూక్లీక్
ఆసిడ్ (RNA, Ribonucleic acid). డీ.ఎన్.ఏ. లో గొలుసు కట్టుగా ఏర్పాటైన అణువుల మాలికలు
ఉంటాయి. ఆ మాలికలలో 4 రకాల “పుష్పాలు” ఉంటాయి.
ఆ 4 రకాల పూలు న్యూక్లీక్ ఆసిడ్లు (nucleic
acids) అనబడే అణువులు అన్నమాట. అలాంటి రెండు
మాలికలు ఒక దాన్నొకటి పెనవేసుకుని ఉంటాయి. వాక్యంలో వరుసగా అక్షరాలు ముద్రించబడి
వున్నట్టు, ఆ అణుమాలికలలో వరుసగా అణువుల రూపంలో సమాచారం “ముద్రించబడి” వుంటుంది.
“దూత” ఆర్.ఎన్.ఏ. (messenger RNA) అనే అణువు డీ.ఎన్.ఏ.
కి ఒక చోట అతుక్కుని అక్కణ్ణుంచి కొంత సమాచారాన్ని కాపీ చేసుకుంటుంది. మళ్లీ భవనాన్ని
ఉపమానంగా తీసుకుంటే, ఆ సమాచారం “తూర్పు వైపు గోడలో రెండు కిటికీలు పెట్టాలి,” లాంటి
సమాచారం ఏదైనా కావచ్చు. అలాంటి సమాచారాన్ని దూత ఆర్.ఎన్.ఏ. కాపీ చేసుకుని దాన్ని “బదిలీ
ఆర్.ఎన్.ఏ.” (transfer RNA) అనే మరో అణువుకి చేరవేస్తుంది. ఈ బదిలీ ఆర్.ఎన్.ఏ. మేస్త్రి
బాపతు శాల్తీ అన్నమాట. దూత ఆర్.ఎన్.ఏ. ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని ఇది ప్రోటీన్లు
అనబడే అణువులని నిర్మిస్తుంది. ఈ ప్రోటోన్లు కూడా అణుమాలికలే. ఇందులోని అణువులని అమినో
ఆసిడ్లు (amino acids) అంటారు. ఇవి మొత్తం
ఇరవై ఉన్నాయి.
ఓ ఆశ్చర్యకరమైన
విషయం ఏంటంటే ప్రతీ కణంలోను మొత్తం శరీరాన్ని నిర్మించడానికి కావలసిన సమాచారం అంతా
ఉంటుంది. ఉదాహరణకి నేను సగటు కడ్డీ కణం గాణ్ణే అయినా మొత్తం పాపాయిని నిర్మించడానికి
కావలసిన సమాచారం అంతా నాలోని డీ.ఎన్.ఏ. లో ఉంటుంది. చెవిలోని కణాలలో ఉండే డీ.ఎన్.ఏ.
తో చేతిని నిర్మించుకోవచ్చు. అయితే ఏదో చెయ్యడం తెలుసు కదా అని అలా ప్రతీ అడ్డవైన పనీ
నేను చెయ్యననుకోండి. ఎందుకంటే డీ.ఎన్.ఏ. లో చాలా మటుకు సమాచారం కప్పడిపోయి వుంటుంది.
కనుక నాలోని డీ.ఎన్.ఏ. సహాయంతో నేను ఏదో నాబోటీ కడ్డీ కణం గాళ్లని నిర్మించుకుంటా గాని
మరోటి చెయ్యనన్నమాట.
ఆ విధంగా ప్రతీ
కణానికి కొన్ని విధులు ఉంటాయి. అవి ఆ విధులనే నిర్వర్తిస్తూ బుద్ధిగా నడచుకుంటాయి.
ప్రతీ క్షణం కోటానుకోట్ల కణాలు చచ్చిపోతుంటాయి, కోటానుకోట్ల కణాలు పుట్టుకొస్తుంటాయి.
ప్రతీ కణం నుండి అచ్చం ఆ తల్లి కణం లాగే ఉండే కొత్త కణాలు, పిల్లకణాలు పుట్టుకొస్తుంటాయి. కొన్ని వేగంగా పునరుత్పత్తి చెందుతుంటే, మరి కొన్ని
తీరిగ్గా తమ వంశాంకురాల సంఖ్యని పెంచుతుంటాయి. ఉదాహరణకి కొవ్వు కణాలు ఉన్నాయే, వాటికి
కాస్త ‘బలుపు’! అందుకే వాటి సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంటుంది. కాని చర్మకణాలు పది గంటల
కొకసారి రెండింటలు అవుతుంటాయి. ఇలా చావుపుట్టుకలకి అతీతంగా ఉండేవాడు మాలో ఒకడున్నాడు.
మా అందరికన్నా మహా తెలివైనవాడు. వాడే మెదడు కణం. ఇతర కణాల లాగా ఈ కణాలు రెండుగా విడిపోయి
సంఖ్య పెంచుకోవడం అంటూ వుండదు. ఈ కణాలు ఒక సారి చనిపోతే వాటి స్థానే కొత్త కణాలు రావడం
అంటూ ఉండదు. కాని మీరు చిన్నప్పుడే ఈ కణాలు బోలెడు పుట్టేస్తాయి. వాటితోనే జీవితాంతం
సర్దుకుపోవాలి మరి. కాబట్టి మీ మెదడు కణాలని కాస్త పొదుపుగా వాడుకుంటూ ఉండడేం! అందుకే అన్నారు పెద్దలు… కాలు
జారితే వెనక్కు తీసుకోవచ్చేమో గాని, మెదడు కణం చేజారిపోతే వెనక్కు తెచ్చుకునే ప్రసక్తే
ఉండదు.
కణాలలో పొడిచేసేది,
దంచేసేది ఈ డీ.ఎన్.ఏ., ఆర్.ఎన్.ఏ. లు తప్ప
మరెవరూ లేరని అపోహపడిపోతారేమో. వీళ్లు చేసేది కేవలం డిజైన్లు వెయ్యడం, సందేశాలు పంపడం
మాత్రమే. అసలు ఒళ్ళొంచి చాకిరీ చేసే శ్రామిక సోదరులు వేరే ఉన్నారు. వాళ్లని ఉమ్మడిగా
ఎన్జైమ్ లు అంటారన్నమాట. కణంలో సగటున
600 పైగా ఎన్జైమ్ లు ఉంటాయి. ఆర్.ఎన్.ఏ.
ఇచ్చిన ఆదేశాల మీదట ఈ బుల్లి రసాయనికులు వెనువెంటనే, వేసట లేకుండా ప్రోటీన్లు అనబడే
అణువులని తయారుచేస్తాయి. మనం తినే ఆహారంలోని అమినో ఆసిడ్లను ఏరుకుని, వాటిని మాలగా
కుట్టి ఈ ఎన్జైమ్లు ప్రోటీన్లను తయారుచేస్తాయి.
ఈ ప్రొటీన్లు మీ ఒంట్ళో ఎక్కడుంటాయి అని అడుగుతున్నారా? ఎక్కడ లేవని అడగండీ బాబు! ఓ
సారి చటుక్కున మీ వేళ్ల కేసి చూసుకోండి. మీ వేలి గోళ్లు అంత గట్టిగా ఉండడానికి కారణం
ఓ ప్రోటీన్ సోదరుడే. వాడి పేరు కెరటిన్. అంతే కాక మీ ఒంట్ళో ఎన్నో జటిలమైన పన్లు చేసే
హార్మోన్లు కూడా ప్రోటీన్లే. ఇవి గాక మీకు రోగం, రొచ్చు లాంటిదేవైనా అంటుకుంటే దాంతో
హోరాహోరిగా పోరాడేసి రోగకారక క్రిమిని బయటికి
గెంటేసే ఏంటీబాడీ తమ్ముళ్లు కూడా ప్రోటీన్లే మరి.
(ఇంకా వుంది)
జీవశాస్త్రం ఇంత సరళమా!,ఎప్పట్లాగానే అద్భుతః.