మెదడులో ఒక్కొక్క
ప్రాంతం ఒక్కొక్క క్రియకి బాధ్యత వహిస్తుంది అని భావించాడు ఫ్రాన్జ్ గాల్. అంతేకాదు.
మెదడులో ఆ ప్రాంతం యొక్క పరిమాణం ఆ వ్యక్తిలో ఆ లక్షణం యొక్క గాఢత మీద ఆధారపడి వుంటుంది
అన్నాడు. ఉదాహరణకి మెదడులో ఒక ప్రాంతం వ్యక్తిలోని దయా గుణాన్ని శాసిస్తుంది అనుకుందాం
(నిజానికి అలంటిదేం లేదు, కాని మరి గాల్ ఇలాంటి కమ్మని కథలే చెప్పేవాడు!). ఆ వ్యక్తి
విపరీతంగా దయాగుణం గల వాడైతే అతడి మెదడులో ఆ ‘దయాగుణ ప్రాంతం’ బాగా విస్తారంగా ఉంటుందన్నమాట.
అదే బాగా కుటిల, సంకుచిత స్వభావం గల వాడిలో అయితే అదే ప్రాంతం బాగా కుంచించుకుపోయి
వుంటుంది. అక్కడితో ఆగక గాల్ తన వాదనలో మరో మెట్టు ఎక్కాడు. వ్యాకోచించిన మెదడు ప్రాంతాలు
(ఇక వ్యాకోచించడానికి స్థలం లేక కాబోలు!) చుట్టూ వున్న కపాలం మీద ఒత్తిడి చేస్తాయి.
దాంతో కపాలం యొక్క ఆకారంలో కూడా మార్పులు వస్తాయి. ఆ కారణం చేత విస్తారమైన ‘దయాగుణ
ప్రాంతం’ ఉన్న వ్యక్తిలో ఆ ప్రాంతానికి పైన వున్న కపాలం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. కనుక తల మీద బొడిపెలు ఎక్కడెక్కడ
వున్నాయో చూస్తే, దాని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు అనేవాడు
గాల్. (అందుచేత తిరుపతి నుండి తిరిగొచ్చిన వారి చరిత్ర అంతా ఓ తెరిచిన పుస్తకం అవుతుంది!).
గాల్ రూపొందించిన
ఈ చిత్రమైన శాస్త్రం పేరు Phrenology (మస్తక విజ్ఞానం). ఇదంటే గిట్టని వాళ్ళు దీన్ని
bumpology (బొడిపెల శాస్త్రం) అని కూడా అనేవారు. ఆది నుండీ కూడా ఈ శాస్త్రాన్ని ఓ కుహనా
శాస్త్రం గానే ఎరిగినవారు పరిగణించేవారు. అయినా జ్యోతిష్యం, హస్తసాముద్రికం మొదలైన
రంగాల లాగానే ఈ రంగానికి ప్రజలలో ఒక వర్గం నుండి గొప్ప ఆదరణ ఉండేది. ఆ ఆదరణ ఇటీవలి
కాలం వరకు కూడా నిలిచింది. (ఫ్రీనాలజీ ‘నిపుణుల’ ఆదాయం చూసి కన్ను కుట్టి కాబోలు,
2007 లో అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రం ఫ్రినాలజీ
సేవల మీద పన్ను విధించింది!)
అశాస్త్రీయమే
అయినా ఫ్రీనాలజీ ఓ ఆసక్తికరమైన ప్రక్రియ. తెలియక చేసినా అది సరైన దిశలోనే అడుగు వేసింది. మెదడులో వివిధ క్రియలు వివిధ ప్రాంతాల చేత శాసించబడతాయి
అనే విలువైన భావనకి అది శ్రీకారం చుట్టుంది. ఈ భావనకే “ప్రాంతీయకరణ”
(localization) అని పేరు. “అన్నిటికీ ఆత్మే
మూలం” అనే సిద్ధాంతం కన్నా “మెదడులో వివిధ ప్రాంతాలు వివిధ క్రియలు నెరవేరుస్తాయి”
అనే భావన మరింత శాస్త్రీయమైనది. ఎందుకంటే ఈ రెండవ సిద్ధాంతాన్ని ప్రయోగం చేసి పరీక్షించడానికి
వీలుంది. అయితే భావన శాస్త్రీయమే అయినా అందులోని వివరాలు శాస్త్రీయం కావు. ఎందుకంటే
మెదడులో ఏ భాగం ఏ పని చేస్తుంది అన్న ప్రశ్నకి సమాధానంగా ఫ్రీనాలజిస్టులు ఏవో నిరాధారిత
ఊహాగానాలు అల్లారే తప్ప ఆ విషయాన్ని నిశితంగా, ప్రయోగాత్మకంగా తేల్చలేదు. అలా తేల్చాలంటే
భౌతిక శాస్త్ర నియమాలని క్రమబద్ధంగా మెదడుకి ఆపాదించి పరీక్షించాలి. అయితే ఫ్రీనాలజీ
పుట్టిన నాటీకి, అంటే పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశలో, భౌతిక శాస్త్రం యొక్క అభ్యున్నతి
కూడా అంతంత మాత్రంగానే వుంది. అందుకే భౌతిక, జీవ శాస్త్రాలలో వివిధ రంగాలు పురోగమిస్తున్న
కొద్ది, అందుకు సమాంతరంగా మెదడు పట్ల మన అవగాహన కూడా క్రమంగా పురోగమించింది.
విజ్ఞాన శాస్త్రంలో
ఏఏ విభాగాలలో జరిగిన పురోగతి వల్ల నాడీ విజ్ఞానం ఎలా లబ్ది పొందిందో చూద్దాం.
శరీరనిర్మాణ
శాస్త్రం (anatomy):
మెదడు యొక్క
నిర్మాణం గురించి స్థూల పరిజ్ఞానం ఇంచుమించు రెండు వేల ఏళ్లుగా ఉంది. కాని మెదడు లోని
సూక్ష్మం అంతా సూక్ష్మస్థాయిలో, అంటే కణాల స్థాయిలోనే వుంది. కనుక సూక్ష్మ ప్రపంచాన్ని
చూడగల పరికరాల రూపకల్పన వల్ల మెదడుని సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి వీలయ్యింది.
రాబర్ట్ హూక్ నిర్మించిన సూక్ష్మదర్శిని (microscope) సహాయంతో జీవప్రపంచాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి
సాధ్యం అయ్యింది. ఈ కొత్త పరికరంతో హూక్ క్రిమికాటకాలు, పక్షి ఈకలు ఇలా జీవ ప్రపంచానికి
సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వస్తువులని స్పష్టంగా పరిశీలించాడు. తను చూసిన వింత లన్నిటినీ
ఇంపైన చిత్రాలుగా వేసి Micrographia అనే పుస్తకంలో 1665 లో పొందుపరిచాడు.
హూక్ శంకుస్థాపన
చేసిన ఈ సూక్ష్మదర్శక సాంప్రదాయాన్ని ఆంటాన్
వాన్ లీవెన్హాక్ మరింత ముందుకు తీసుకుపోయాడు.
1683 లో ఓ రోజు ఇతగాడు తన సొంత ఉమ్మిని
సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తున్నాడు. ఆ సందర్భంలో తనకి కనిపించిన దాన్ని ససేమిరా నమ్మలేకపోయాడు.
“ఆ పదార్థంలో బోలెడన్ని చిన్ని చిన్ని జంతువులు చక చకా కదులుతున్నాయి,” అంటూ తను చూసిన
దాన్ని అభివర్ణించాడు. ఆ ‘చిన్ని చిన్ని జంతువులని’ వర్ణించడానికి
animalcules అనే పదం వాడాడు. ఆ విధంగా లీవెన్హాక్
మొట్టమొదటి జీవకణాలని కళ్లార చూసివాడయ్యాడు. తదనంతరం ఓ నాడీ తీగని పరిచ్ఛేదించి ఆ పరిచ్ఛేదాన్ని
సూక్ష్మదర్శినిలో చూశాడు.
(ఇంకా వుంది)
0 comments