రేనే దే కార్త్
(Rene Descartes): చిన్నప్పుడు బళ్లో అనలిటికల్
జ్యామెట్రీ (analytical geometry) అనే ఓ గణిత విశేషం గురించి అందరం చదువునే వుంటాం.
జ్యామెట్రీకి ఆల్జీబ్రానిచ్చి పెళ్లి చేస్తే పుట్టిన ప్రత్యేక రంగం ఇది. దీనికి కర్త
రేనే డేకార్త్ అనే ఫ్రెంచి తాత్వికుడు, గణితవేత్త. నాడీవిజ్ఞాన చరిత్రలో డే కార్త్
ఓ ముఖ్యమైన మలుపుకి సంకేతం. తత్వశాస్త్రంలో, ముఖ్యంగా పారభౌతిక శాస్త్రంలో
(metaphysics) లో ముఖ్యమైన సమస్య వుంది. దీన్నే
‘మనస్సు-శరీరం’ సమస్య (mind-body problem)
అంటారు. మనసుకి, శరీరానికి సంబంధం ఏంటి? మనసు శరీరాన్ని ఎలా శాసిస్తుంది? శరీరానికి
మనసు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ ప్రశ్నలు పైపైన చూస్తే సర్వసామాన్యంగా ఉంటాయి గాని
కాస్త శ్రధ్ధగా పరిశీలిస్తే అంత సులభంగా తేలవు. అసలు ఉందో లేదో కూడా తెలీని మనస్సు
అనే తత్వానికి, (ఉన్నా అది ఏంటి, దాని పదార్థం ఏంటి, అది భౌతికమా, అభౌతికమా?) భౌతిక
పదార్థంతో చేయబడ్డ శరీరానికి మధ్య సంబంధం ఏంటి, అసలు సంబంధం ఎలా ఉండగలదు? మొదలైన ప్రశ్నలకి
సంబంధించిన సమస్యే ‘మనస్సు-శరీరం సమస్య.’ డేకార్త్ ఈ చిక్కుముడిని ఓ విచిత్రమైన రీతిలో
విప్పాడు. విప్పాడు అనడం కన్నా ఆ ముడిని తెంచి అవతల పారేశాడు అనడం సబబేమో. నాడీవిజ్ఞాన
చరిత్రలో మెదడు యొక్క నిర్మాణం గురించి ఎంతో క్షుణ్ణమైన అవగాహన ఉన్నా, దాని క్రియల
విషయానికి వచ్చేసరికి విశృంఖల ఊహాగానం తప్ప పెద్దగా మరేమీ లేదని ఇప్పటికే మనం గుర్తించాం.
ఈ సమస్యని డేకార్త్ ఈ రాకంగా తేల్చాడు.
అసలు మనస్సు,
శరీరం పూర్తిగా భిన్నమైన తత్వాలన్నాడు. మనస్సు, దేహం రెండూ వేరు వేరు ప్రపంచాలకి చెందినవని,
రెండిటినీ వేరు వేరు నియమాలు పాలిస్తున్నాయని వచించాడు. మనకి సుపరిచితమైన భౌతిక ధర్మాలని
అనుసరించి శరీరం పని చేస్తుంది. కాని మనస్సు మాత్రం శరీరంతో సంబంధం లేని, విస్తృతి
గాని, చలనం గాని లేని ఓ అభౌతిక తత్వం. కాని ఈ రెండూ ఒక దాని మీద ఒకటి ప్రభావం చూపించుకోగలవు.
మనస్సు గురించి ఈ రకమైన దృకథాన్ని ‘ద్వైతం’ (dualism) అంటారు. అంటే మనస్సు, శరీరం వేరు వేరుగా ఉన్నాయన్న
భావన. (దీనికి భిన్నంగా ఓ ‘అద్వైతం’ కూడా వుంది. ఆ దృక్పథం ప్రకారం అసలు మనస్సు అనేది
శరీరానికి వేరుగా లేదు. శరీరంలో, ముఖ్యంగా మెదడులోని న్యూరాన్లలో కలిగే విద్యుత్ చలనాలని
మనం ‘మనస్సు’ అని పిలుచుకుంటాం. రెంటిలో ఏది నిజం అన్న ప్రశ్నకి ఇప్పటికీ కచ్చితమైన
సమాధానం లేదు.) నాడీ విజ్ఞాన శాస్త్రంలో ఈ రకమైన ‘ద్వైతాన్ని’ బల్ల గుద్ది, కుండ బద్దల కొట్టి ప్రవేశపెట్టిన వాడు దేకార్త్.
అయితే ద్వైతం
వల్ల ‘మనస్సు-శరీరం సమస్య’ తేలలేదు. కాని మనస్సు,
శరీరం వేరు అన్న నమ్మకం బలపడ్డ తరువాత జనం మనస్సు గురించి మర్చిపోయి మెదడు మీద దృష్టి
సారించారు. మెదడుని, నాడీ మండలాన్ని తమకి తెలిసిన భౌతిక శాస్త్ర పద్ధతులతో లోతుగా అధ్యయనం
చెయ్యడం మొదలెట్టారు. దాంతో నాడీవిజ్ఞానం మునుపటి కట్టడి పోయి, కట్టలు తెంచుకుని ముందుకురికింది.
మావిడి పండు లోని టెంకని తీసేసి తీయని గుజ్జుని హాయిగా ఆనందించినట్టు, శరీరానికి చెందిన
‘ఆత్మ’, ‘మనస్సు’ మొదలైన ఇబ్బందికరమైన అంశాలని ముందస్తుగా అవతల పారేసి, ఇక మిగిలిన
శరీరాన్ని మాత్రం ఓ ‘యంత్రం’లా పరిగణిస్తూ భౌతిక శాస్త్ర విధానాలతో విశ్లేషించడానికి
వీలయ్యింది. ఇక్కడే నాడీ విజ్ఞానం యొక్క పురోగమన
పథంలో మనకొక విడ్డూరం, ఓ వైపరీత్యం కనిపిస్తుంది. ఏ రంగంలోనైనా ఆ రంగానికి చెందిన అత్యంత
కీలకమైన సమస్యలని, అతి ముఖ్యమైన ప్రశ్నలని (‘మనస్సు అంటే ఏంటి?’ ‘చైతన్యం అంటే ఏంటి?’
‘ఆత్మ అనేది వుందా?’ మొ॥) వీలుగా పక్కనబెట్టేసి, కాస్త సులభమైన సమస్యలని మాత్రమే శోధిస్తూ
(‘కళ్ళు చూసే దృశ్యాలని మెదడులోని న్యూరాన్లు ఎలా విశ్లేషిస్తాయి?’ మొ॥) ఓ రంగం వేగంగా
పురోగమించడం విశేషం.
పూనకం పట్టిన
వాణ్ణి వేపమండలతో బాది వాడిలోని ‘దెయ్యాన్ని’ వెళ్లగొట్టినట్టు, దేకార్త్ ఆ విధంగా
శరీరంలోని ‘మనసు’ని బహిష్కరించేశాడు. ఓ గడియారం లాగానో, ఓ ఆవిరి యంత్రం లాగానో మెదడు
కూడా ఓ యంత్రమే; దాని క్రియలకి అడుగున ఉన్న భౌతిక ధర్మాలేంటో కనిపెడితే మెదడు రహస్యాలు
బయటపడతా యంటూ భౌతిక శాస్త్రవేత్తలని మెదడు పరిశోధన దిశగా ప్రోత్సహించాడు. ఈ దెబ్బతో
ఒక విధంగా సమస్య మరింత జటిలం అయ్యింది. మునుపట్లా ‘దేహం లోపల కొలువై వుంటూ కర్మలు చేస్తున్నది
ఆత్మే’ అంటూ ఫిలసాఫికల్ గా ఏదో వాగేసి, ‘సరే అయితే ఆత్మని చూపించు’ అంటే ‘అది కంటికి
కనిపించదు, చెవులకి వినిపించదు, అది నిప్పులో కాలదు, నీట్లో నానదు…’ అంటూ ఏవేవో మాయమాటలు
చెప్పి తప్పించుకునే సౌకర్యం ఇప్పుడు చేజారిపోయింది. దేహ కర్మలని మెదడు చేయిస్తోంది.
అది ఎలా చేయిస్తోంది? మన కళ్లు చూసే దృశ్యాలని మెదడు అర్థం చేసుకుంటోంది. ఎలా అర్థం
చేసుకుంటోంది? ఈ విధంగా శరీర కర్మలని మెదడు ఎలా శాసిస్తోందో, మెదడులో ఏఏ విభాగాలు ఏఏ
పనులు చేస్తున్నాయో అన్నీ వివరంగా పరిశోధించి, తేల్చుకోవలసిన అగత్యం ఎర్పడింది!
ఈ దిశలో మొదటి
అడుగు వేసినవాడు ఫ్రాన్స్ జోసెఫ్ గాల్ (Franz Joseph Gall, 1758–1828) అనే ఓ జర్మన్ వైద్యుడు. మానవ లక్షణాలలో
ప్రతి యొక్క దానికి ప్రతినిధిగా మెదడులో ప్రత్యేక స్థానాలు ఉంటాయని గాల్ నమ్మాడు.
(‘నమ్మాడు’ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ పెద్దమనిషి నిజంగా ఎప్పుడూ కపాలాన్ని కోసి,
మెదణ్ణి చూసిన పాపాన పోలేదు!). “అఖిలమై, అనన్యమై, అనిర్వచనీయమై, నిరాకారమై, నిత్యమై,
నిఖిలమై వెలుగొందే ఆత్మ” ఒక పక్క, ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క విభాగం చేసే మెదడు
మరో పక్క– ఈ రెండిటి తీరు తెన్నూ పూర్తిగా భిన్నం అన్నట్టు అయ్యింది.
(ఇంకా వుంది)
0 comments