“వెనక్కి వెళ్లడమా?
గమ్యం చేరకుండానే వెనక్కి వెళ్లడం గురించి మాట్లాడుతున్నావా?” కాస్త విసుగ్గా అన్నాడు
మావయ్య.
“లేదు. కాని
వెనక్కి ఎలా వెళ్ళగలం అని అడుగుతున్నాను.”
“దాందేవుంది
చాలా సులభం. వసుధ కేంద్రాన్ని చేరుకున్నాక వెనక్కి వెళ్లడానికి వీలైతే ఏదైనా కొత్త మార్గాన్ని వెతుక్కోవాలి. లేదంటే చక్కగా,
మర్యాదస్తుల్లా వచ్చిన దారినే వెనక్కు రావాలి. మనం వెళ్లే దారి వచ్చేటప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉండాలని ప్రార్థిద్దాం.”
“అయితే మళ్లీ
ఓ పడవ నిర్మించాల్సి వుంటుంది.”
“అవును మరి.”
“అంతే కాక, భోజన
పదార్థాల సంగతి కూడా ఆలోచించాలి. యాత్ర మొత్తానికి సరిపోతాయా?”
“తప్పకుండా.
సందేహం లేదు. అంతగా కావాలంటే ఓ సారి హన్స్ ని అడుగుదాం. హన్స్ చాలా తెలివైనవాడు. ఈ
విషయంలో తగు జాగ్రత్త తీసుకునే ఉంటాడు.”
మేం అంతవరకు
తలదాచుకున్న గుహని విడిచి బయటికి వచ్చాం. మనసులో ఒక పక్క చిన్న ఆశ, మరో పక్క పెద్ద
భయం దొలిచేస్తున్నాయి. నడి సముద్రంలో పడవ ముక్కలయ్యాక పడవ మీద ఉన్న సామగ్రి అంతా నీట
మునగకుండా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. నేను, మావయ్య వెళ్లి చూస్తే ఇసుకలో హన్స్
పడవ మీద అంతకు ముందు ఉన్న సామగ్రి అంతా నీటుగా పేర్చాడు. మావయ్య వెళ్లి హన్స్ చేతులు
పట్టుకుని ఊపుతూ కృతజ్ఞతలు తెలిపాడు. మేం హాయిగా కునుకు తీస్తుంటే ఈ మనిషి – ఇతడు మామూలు
మనిషి కాడు – శ్రద్ధగా పోయిన సామగ్రి అంతా వెతికి, సేకరించి ఎండలో ఆరబెడుతున్నాడు!
అసలేమీ పోలేదని
కాదు. మా తుపాకీలు పూర్తిగా నీటిపాలయ్యాయి. అయినా అవి మునిగిపోయినా మాకు పెద్దగా మునిగిపోయిందేమీ
లేదు. తుఫానులో అగ్గిబంతి దెబ్బకి మండిపోవలసిన మందుపాతర మాత్రం దక్కింది.
“తుపాకీలు లేవు
గనుక వేటాడడం కుదరదు, అంతేగా?” నిట్టూరుస్తూ అన్నాడు మావయ్య.
“పోనీండి గాని
మనం తెచ్చుకున్న వైజ్ఞానిక పరికరాల మాటేవిటి?”
“ఇదిగో మన అనిరాయిడ్
బారోమీటర్. అన్నిటికన్నా ముఖ్యమైన పరికరం. ఇక దేనినైనా వొదులుకుంటా గాని దీన్ని మాత్రం
వొదులుకోను. దీంతో లోతు తెలుసుకోవచ్చు. భూమి కేంద్రాన్ని చేరుకున్నామో లేదో దీన్ని
బట్టే చెప్పగలం. అది లేకపోతే కేంద్రాన్ని దాటి ఇంకా ముందుకి పోయి భూమికి అవతలి ధ్రువం
వద్ద పైకి తేలగలం.”
ఇలాంటి పరిస్థితిలో
కూడా ఆయన ఉత్సాహం, ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యం కలగక తప్పదు.
“ఇంతకీ దిక్సూచి
ఏది?” ఉన్నట్లుండి గుర్తొచ్చి ఆదుర్దాగా అడిగాను.
“ఇదుగో ఈ రాయి
మీద సుస్థిరంగా వుంది. అలాగే థర్మామీటరు, క్రోనోమీటరు కూడా బాగానే వున్నాయి. ఈ వేటగాడు
అసాధ్యుడు.”
నిజమే. మా వైజ్ఞానిక
పరికరాలన్నీ బాగానే వున్నాయి. ఇక పనిముట్లు కూడా నీటుగా వరుసగా అమర్చబడ్డాయి – నిచ్చెనలు,
త్రాళ్లు, సుత్తి, కొడవలి మొదలైనవన్నీ ఉన్నాయి.
కాని భోజన పదార్థాల
సంగతే ఇంకా తేలలేదు. అదే అడిగాను.
తిండి సామగ్రి
ఉన్న పెట్టెలన్నీ వరుసగా పేర్చబడ్డాయి. ఉప్పు మాంసం, ఉప్పు చేపలు, బిస్కట్లు, మద్యం
– సముద్రం వీటి జోలికి పోలేదు.
“నాలుగు నెలలు
వస్తాయి,” అన్నాడు ప్రొఫెసర్ ధీమాగా. “ఇక మిగిలిన సరుకులతో ఇంటికెళ్లాక జోహానియం లో
నా నేస్తాలు అందరికీ మాంచి విందు ఏర్పాటు చేస్తాను చూడు.”
(ఇంకా వుంది)
0 comments