Interplanetary
Travel by A. Sternfield, Foreign languages publishing house, Moscow.
పై పుస్తకానికి
అనువాదం… సీరియల్ రూపంలో…
అంతరిక్ష యానం
– ఊహల నుండి వాస్తవానికి
ప్రాచీన కాలం
నుండి కూడా విశ్వంలో సుదూర ప్రాంతాలకి ప్రయాణించడం అనేది మనిషి మన్సులో ఓ అపురూపమైన
ఊహగా మెదుల్తూ వస్తోంది. ప్రాచీన సాహిత్యంలో మానవుడు పుష్పకవిమానం మొదలైన అద్భుత వాహనాలలో
అంతరిక్షంలో ప్రయాణించినట్టు గాధలు కనిపిస్తాయి. అలాగే ఇతర లోకాల నుండి భూమిని సందర్శించిన
లోకోత్తర జీవుల గురించిన కథలు కూడా ఎన్నో వున్నాయి.
ఈ రకమైన గాధలు
ప్రాచీన గ్రీకు పురాణంలో ఎన్నో కనిపిస్తాయి. రెక్కలు కట్టుకుని క్రీట్ అనే ద్వీపం మీదుగా
ఎగరడానికి ప్రయత్నించిన డేడలస్ మరియు ఐకరస్ అనే తండ్రీ కొడుకుల గురించిన గ్రీకు గాధ
చాలా మందికి తెలిసే వుంటుంది. చెక్కతో చేసిన రెక్కల మీద మైనంతో ఈకలు గుచ్చి ఆ రెక్కలు
అల్లారుస్తూ ఎగరడానికి ప్రయత్నించారు ఆ వీరులు. ఇద్దరూ ఎగురుతూ గాల్లో అలా పైపైకి లేచారు.
ఉత్సాహం కొద్దీ ఐకరస్ మరీ ఎత్తుకి ఎగిరి సూర్యుడికి మరీ చేరువగా వెళ్ళాడట! దాంతో మైనం
కరిగి, రెక్కలకి అంటించిన ఈకలు ఊడి, వశం తప్పి కింద సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడట.
ఇలాంటిదే మరో
గ్రీకు గాధ కూడా వుంది. గరుడ పక్షులు పూన్చిన రథంలో అలెగ్జాండర్ చక్రవర్తి స్వర్గానికి
అధిరోహించడానికి ప్రయత్నించాడట.
ఈ తరహా చైనీజ్
గాధ కూడా ఒకటుంది. ఆ గాధ ప్రకారం చైనావారు చందమామ నుండి భూమికి దిగివచ్చారట. ఇక రామాయణంలో
పుష్పకవిమానం గురించి తెలియని భారతీయుడు ఉండడేమో.
మనిషి విశ్వం
గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటున్న కొద్ది గతానికి చెందిన గాధలు పటిష్టమైన వైజ్ఞానిక భావబీజాలుగా పరిణామం చెందాయి. విశ్వంలో సుదూర ప్రాంతాలని
చేరే విషయంలో మొట్టమొదటి వైజ్ఞానిక రచన పదిహేడవ శతాబ్దానికి చెందినది. అయితే ఆధునిక
ప్రమాణాలు బట్టి అలాంటి ఆలోచనలు కొంచెం హాస్యాస్పదమైనవనే చెప్పాలి.
‘ఓ నవ్య ప్రపంచం
గురించి, ఓ కొంగ్రొత్త గ్రహం గురించి సంవాదం’ (Discourse concerning a new world
and another planet) అనే రచనలో ఇంగ్లీష్ శాస్త్రవేత్త
జాన్ విల్కిన్స్ యంత్రాల సహాయంతో అంతరిక్ష యానం గురించి చర్చిస్తాడు. ఈ దిశలో మరో మెట్టు
వేసినవాడు ఫ్రెంచ్ రచయిత సిరనో ద బెర్జరాక్. గాల్లో ఎలా ఎగరాలో కూడా తెలీని దశలో ఇతగాడు
రాకెట్లు వాడి అంతరిక్షంలో ప్రయాణించడం గురించి కలలు కన్నాడు. ఓ ప్రాథమిక అంతరిక్ష
నౌకను ఊహించి, దాన్ని వర్ణిస్తూ చిత్రాలు కూడా వేశాడు.
గ్రహాంతర యానం
గురించి కాల్పనిక వైజ్ఞానిక సాహిత్యం పందొమ్మిదవ శతాబ్దంలో ఆరంభమయ్యింది. ఫ్రాన్స్
కి చెందిన కాల్పనిక వైజ్ఞానిక రచయిత జూల్స్ వెర్న్ రాసిన ఓ పుస్తకంలో కొందరు వ్యక్తులు
ఓ పెద్ద తూటా మీద సవారీ చేస్తూ చందమామ వద్దకి ప్రయాణిస్తారు.
ఇక ఇరవయ్యవ శతాబ్దపు
తొలిదశలలో బాగా పేరు మోసిన సైన్స్ ఫిక్షన్ రచయితలలో ఇంగ్లండ్ కి చెందిన హెర్బర్ట్ వెల్స్
ఒకడు. రష్యాలో అలాగే ఎ. బొగడనోవ్, ఎ. టాల్స్ టాయ్, ఎ బెలయేవ్ మొదలైన రచయితలు ఇతర గ్రహాల
గురించి అక్కడ జీవించే గ్రహాంతరవాసుల గురించి కలలు కంటూ ఎన్నో రచనలు చేశారు.
అంతరిక్ష యానం
గురించి ఇలాంటి కథలు, ఊహాగానాలు చేసిన వారిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వారిలో
ప్రముఖుడు రష్యాకి చెందిన కె. ఇ. సియాల్కోవ్ స్కీ.
(ఇంకా వుంది)
0 comments