“అందుకు బాధ్యుణ్ణి నేనే,” అన్నాడామనిషి నిర్లిప్తంగా.
“అబ్బ! మీకు శతకోటి దండాలు. నా సమస్యని ఇట్టే తీర్చేశారు. మీరు గాని ఇక్కడ ఏదైనా వైద్య సదస్సుకి అధ్యక్షులా?”
“లేదే!” కాస్త ఖంగు తిన్నట్టుగా అన్నాడు. “నేనిక్కడ పని చేసే బ్రేక్ మాన్ ని!”
“ఏంటీ? మీరు బ్రేక్ మానా?” నమ్మలేనట్టుగా అన్నాడు సుబ్బారావు. “అంటే రైలు స్టేషన్ లోకి వచ్చేటప్పుడు బ్రేకులు వేసే .... బ్రేక్ మానా?”
“అవును నేను చేసే పని సరిగ్గా అదే. అలా నేను బ్రేకు వేసిన ప్రతీసారి, రైలు నెమ్మదించిన ప్రతీసారి, రైల్లో ఉన్నవారి వయసు బయట ఉన్న వారి వయసు కన్నా కాస్త నెమ్మదిస్తుంది. అయితే ఇందులో డ్రైవర్ పాత్ర కూడా ఉందనుకోండి...: ఘనత అంతా తనదే కాదన్నట్టు కాస్త వినయంగా అన్నాడు. “రైలు బయలుదేరుతున్నప్పుడు, డ్రైవర్ రైలు వేగాన్ని పెంచినప్పుడు కూడా అలాగే రైలు లోపల ఉన్న వారి వయసు తగ్గుతూ ఉంటుంది.”
“కాని రైలు వేగం తగ్గడానికి, పెరగడానికి ఇలా ప్రయాణీకులు యవ్వనంగా ఉండిపోడానికి మధ్య ఏంటి సంబంధం?” అయోమయంగా అడిగాడు సుబ్బారావు.
“ఓహ్ అదా? అదీ...” కాస్త బుర్ర గోక్కుంటూ అన్నడు బ్రేక్ మాన్. “ఓ సారి ఇలాగే ఆ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రొఫెసర్ ని అడిగా ఇదే విషయం. అందుకు ఆయన ఏదో పేద్ద అర్థం పర్థం లేని ఉపన్యాసం దంచాడు. ఆ కారణం చేతనే సూర్య కాంతి కూడా ’గురుత్వ అరుణ భ్రంశం’ (gravitational red shift) జరుగుతుందని కూడా ఏదో అన్నడు. ఆ అరుణ ఎవరో, ఆ భ్రంశం అంటే ఏంటో, ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఆ గొడవేంటో మీకు గాని ఏవైనా తెలుసా?”
“నాకా?” బింకంగా అన్నాడు సుబ్బారావు “ససేమిరా తెలీదు.”
బ్రేక్ మాన్ తల అడ్డుగా ఊపుతూ వెళ్లిపోయాడు.
ఇంతలో ఎవరో తన జబ్బ పట్టుకుని బలంగా కుదుపుతున్నట్టయ్యి ఉలిక్కిపడి లేచాడు సుబ్బారావు. కళ్లు నులుముకుని చూసుకుంటే తను ఉన్నది స్టేషన్ లో కాఫీ హోటల్ కాదు. ఇందాక ప్రొఫెసర్ ఉపన్యాసం జరుగుతున్న ఆడిటోరియం లో. ఆడిటోరియం అప్పటికే ఖాళీ అయ్యింది. లైట్లు ఆపేస్తున్నారు. తన్ని మేల్కొలిపిన వాచ్ మాన్ “ఇక హాలు మూసేస్తున్నాం సార్. మీకు ఇంకా నిద్రొస్తే దయచేసి ఇంటికెళ్లి పడుకోండి” అని సలహా ఇచ్చాడు.
సుబ్బారావు నీరసంగా సీట్లోంచి లేచి, హాలు బయటికి నడిచి, కాళ్ళీడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.
(సశేషం...)
అయ్యో ఒక్క సారిగా ఇలా ముగించేశారేమిటి? నేను ఇంకా చాలా ఉందనుకున్నానే!!!
వేగం పెరిగినప్పుడు కాలం నెమ్మదించడం వాళ్ళ....వయసు అంతగా పెరగదన్న విషయం కొంత అర్థం అయ్యింది...
కానీ వేగం తగ్గినప్పుడు కూడా...కాలం ఎందుకు నెమ్మదిస్తుంది?
ఏది ఏమైనా మీరు చేస్తున్న ఈ అనువాదం మాత్రం చాలా బావుంది...
రైలు వేగం పెరిగినందుకో, తగ్గినందుకో కాలం నెమ్మదించడం కాదు. సగటున రైలు వేగం అధికంగా ఉండడం వల్ల అందులో కాలం నెమ్మదిస్తుంది.
అయితే సమ వేగం (uniform motion) సాపేక్షం కనుక బయట ఉన్న వారికి రైలు కదిలినట్టు ఉంటే, రైల్లో ఉన్న వారికి బయట వారు కదులుతున్నట్టు ఉంటారు. ఈ రెండు వ్యవస్థలు సౌష్ఠవమైన పరిస్థితుల్లో (symmetric conditions) ఉన్నాయి. మరి రైల్లో ఉన్న వారు మాత్రమే ఎందుకు యవ్వవంతులుగా ఉన్నారు అన్న ప్రశ్న వస్తుంది.
దానికి కారణం రైలు బయల్దేరినప్పుడు వేగం పుంజుకోవడం, ఆగినప్పుడు వేగం తగ్గడం. రైలు వేగం మారినప్పుడు (పెరిగినా, తగ్గినా) దాని వల్ల వచ్చే ఫలితాలు రైల్లో మాత్రమే అనుభవం అవుతాయి. అవి బయట వారికి తెలీవు. దాని వల్ల సౌష్ఠవం ఉల్లంఘన (symmetry breakdown) జరుగుతుంది. కనుక రైల్లో ఉన్న వారికి మాత్రమే కాలం నెమ్మదిస్తుంది.