శిరస్సు యొక్క రూపురేఖల బట్టు మనిషి యొక్క లక్షణాలని చెప్పే (లేదా చెప్పాలనుకునే) శాస్త్రమే శిరోవిజ్ఞానం (phrenology, phrenos అంటే గ్రీకులో మనస్సు, mind). శిరస్సు ఆకారాన్ని బట్టి మనిషి తత్త్వం చెప్పడం ఏంటి అంటారేమో? ప్రస్తుత కాలంలో, ఆధునిక వైజ్ఞానిక ప్రమాణాలలో దీన్నొక శాస్త్రంగా పరిగణించరు. బల్లిపట్టు, చిలక జోస్యం మొదలైన వాటిలాగానే ఇది కూడా ఓ కుహనాశాస్త్రం. శిరోవిజ్ఞానం అనేది యూరప్ లో పుట్టిన ’బల్లిపట్టు’ అనుకోవచ్చు.
శిరస్సు బట్టి గుణం చెప్పే ఆనవాయితీ కొంత వరకు, ఒక శాస్త్రంగా కాకపోయినా, మన సమాజాలలో కూడా ఉంది. నుదురు పెద్దగా ఉంటే ఆ మనిషి తెలివైనవాడని అంటుంటారు. అలాగే తల పెద్దగా ఉన్నా అలాంటి అన్వయమే వినిపిస్తుంటుంది.
ప్రఖ్యాత బ్రిటిష్ హాస్య రచయిత పిజి.వుడ్. హౌస్ నవళ్లలో ’జీవ్స్’ అనే ఓ తెలివైన బట్లర్ ఉంటాడు. అతడి యజమాని బెర్ట్రామ్ వూస్టర్ ఒక రకంగా చెప్పాలంటే మంచి మనసున్న చవట. ఏ చిక్కు వచ్చినా జీవ్స్ ని సలహా కోసం అడుగుతుంటాడు. జీవ్స్ తన సమస్యలని పరిష్కరించే తీరు చూసి ఆ అమాయకపు యజమాని ఆశ్చర్యపోతుంటాడు. జీవ్స్ కి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అతడి తల వెనకభాగంలో పొడుచుకు వచ్చే తీరు చూస్తే తెలుస్తుంది అనుకుంటూ ఉంటాడు. కనుక శాస్త్ర నిర్ధారణ మాట ఎలా ఉన్నా, సామాన్య జనజీవనంలో ఇలాంటి భావాలు చలామణిలో ఉన్నాయని తెలుస్తుంది.
ఈ శిరోవిజ్ఞానాన్ని 1796 లో ఫ్రాన్స్ జోసెఫ్ గాల్ అనే జర్మను డాక్టరు రూపొందించాడు. ఈ శాస్త్రం యొక్క మూలభావనలు ఇలా ఉంటాయి.
1. మనిషి యొక్క మానసిక లక్షణాలన్నిటికీ మూలం మెదడు.
2. ఒక్కొక్క లక్షణం మెదడులో ఒక్కొక్క చోట నాటుకుని ఉంటుంది.
3. ఫలానా లక్షణం ఫలానా వ్యక్తిలో అధికంగా ఉంటే, ఆ వ్యక్తి మెదడులో ఆ ప్రాంతం విస్తారంగా ఉంటుంది. ఆ విధంగా లక్షణాలకి అనుగుణంగా మెదడు రూపురేఖల్లో భేదాలు వస్తాయి.
4. మెదడులో ఒక భాగం బాగా విస్తరించినప్పుడు, ఆ భాగం, దాని మీదుగా ఉన్న కపాలం మీద, లోపలి నుండి, ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి వల్ల క్రమంగా కపాలం ఉపరితలం మీద కూడా భేదాలు వస్తాయి.
5. ఆ విధంగా మనిషి యొక్క మానసిక లక్షణాలు, తల యొక్క ఉపరితలం మీద హెచ్చు తగ్గుల్లో తొంగి చూస్తాయి.
ఈ మూలసూత్రాలని మరింత బలోపేతం చేసేలా ఈ కింద చిత్రంలో కనిపించే మ్యాపుల లాంటివి ప్రచారం అయ్యేవి.
కాస్త వ్యావహారికంగా చెప్పుకోవాలంటే ఈ శాస్త్రం వెనుక ఉన్న “కాన్సెప్ట్’ ఇదీ! అయితే “కాన్సెప్ట్” వినసొంపుగా, సమంజసంగా అనిపించినంత మాత్రాన అది నిజం కానక్కర్లేదు. ఆధునిక నాడీశాస్త్రంలో పై భావనలకి ఎలాంటి ప్రయోగాత్మక నిర్ధారణ దొరకలేదు. అందుకే దీన్నొక కుహనాశాస్త్రంగానే పరిగణిస్తారు.
కాని ఎంత కుహనాశాస్త్రం అయినా కాలంకలిసొస్తే చెల్లిపోతుంది అన్నట్టు, ఈ శాస్త్రం ఇంచుమించు ఓ రెండు శతాబ్దాలు రాజ్యం చేసింది. ఫ్రాన్స్ గాల్ తో పాటు పని చేసిన యోహాన్ స్పూర్జ్ హైమ్ (1776-1832) ఈ శాస్త్రాన్ని యూ.కె., యూ.ఎస్. దేశాలలో కూడా ప్రచారం చేశాడు.
ఇక విక్టోరియన్ యుగం లో (1837-1901) ఈ శిరోవిజ్ఞానాన్ని మనస్తత్వ శాస్త్రంలో భాగంగా పరిగణించసాగారు. సాహిత్యంలో, నవళ్లలో కూడా ఈ భావాలు క్రమంగా చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ లాయిడ్ జార్జ్ కి కూడా ఈ రంగంలో ఆసక్తి ఉండేదట. ఈ రోజుల్లో జాతకాలు చూసి పెళ్లి సంబంధాలు నిర్ణయించినట్టు, ఆ రోజుల్లో శిరోవిజ్ఞానం ఆధారంగా జీవిత భాగస్వాములని ఎంచుకోవడం కూడా చేసేవారట.
---
సుబ్బారావు తన తల్లిదండ్రులతో సహా సుశీలని చూడడానికి పెళ్లిచూపులకి వెళ్తాడు.
సుబ్బారావు: సుశీలగారూ! కొంచెం కదలకుండా కూర్చుంటారా? మీరు ఏవీ అనుకోకపోతే ఒక్కసారి మీ తలని పరీక్షించాలి...
సుశీల: ఫూల్! ముందు నీ తల నువ్వు పరీక్షించుకో! (కోపంగా లేచి లోపలికి వెళ్లిపోతుంది)
---
ఆ విధంగా ఈ శిరోవిజ్ఞానానికి సామాన్య ప్రజానీకంలో మంచి పరపతి ఉన్నా, తొలిదశల నుండి కూడా విద్యాసంస్థలు దాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి 1831 లో స్థాపించబడ్డ British Association for Advancement of Science (బ్రిటిష్ వైజ్ఞానిక పురోభివృద్ధికి సదస్సు) ఈ రంగాన్ని సమ్మతించలేదు.
ప్రయోగాత్మక ఆధారాలు లేని కారణంగా, వైజ్ఞానిక ప్రమాణాలని తృప్తి పరచలేని ఈ ’శాస్త్రాన్ని’ కుహనాశాస్త్రంగా ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో ముద్రవేశారు.
కాని సైన్స్ చరిత్రలో ఈ శిరోవిజ్ఞానం మనకో చక్కని పాఠం నేర్పుతుంది. ఒక భావన కేవలం వినసొంపుగా ఉంటే, మన మనసుని ఆకట్టుకుంటే, నచ్చితే, అది నిజమేనని అనుకోవడం మానవసహజం. ఎంతో మంది తెలివైన వాళ్లు కూడా ఈ ఉచ్చులో పడతారు. కాని కచ్చితమైన ఆధారాలు లేనిదే సైన్సు దేనినే నమ్మదు. అలాగని ఆధారాలు లేని విషయాలన్నీ తప్పులని కాదు. అలాంటి విషయాల గురించి ఎటూ చెప్పలేం. దానికి పోటీగా ఆధారాలతో సహా వచ్చిన సిద్ధాంతాన్ని తదనంతరం స్వీకరించి, ఆధారాలు లేని పాత సిద్ధాంతాన్ని అవతల పారేయడం జరుగుతుంది.
ముఖ్యంగా మన సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గుర్తింపు చాలా ముఖ్యం. కాని ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడినా జనం విరుచుకుపడిపోతారు. జనం విరుచుకుపడిపోయే దృశ్యం అంత అందమైన దృశ్యం కాదు. ఆ దృశ్యాన్ని ప్రస్తుతం నాకు ఈ బ్లాగ్ లో చూడాలని లేదు కనుక ఇక్కడితో ఆ ప్రస్తావన ఆపేస్తున్నా!
శిరోవిజ్ఞానం ఎంత కుహనాశాస్త్రం అయినా అందులో కొంత సత్యాంశం ఉందని తరువాత తేలింది. అయితే అది దాని మూలకర్తలు ఊహించిన విధంగా కాదు. మెదడులో వివిధ ప్రాంతాల్లో వివిధ క్రియలు పొందుపరచబడి ఉన్నాయి అన్నదాంట్లో కొంత నిజం ఉంది. అయితే దాన్ని విపులీకరిస్తూ ఫ్రీనాలజిస్టులు గీసిని మ్యాపులన్నీ వట్టి ఊహాగానాలు.
ఈ శిరోవిజ్ఞానం వ్యవహారం నచ్చక గొప్ప ప్రతిభాశాలి అయిన నెపోలియన్ చక్రవర్తి ఆ సంగతేంటో ప్రయోగాత్మకంగా శోధించమని ఓ శాస్త్రవేత్తని పురమాయించాడు. పియర్ ఫ్లోరెన్స్ అనే ఆ శాస్త్రవేత్త చేసిన ఆ ప్రయోగాలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
(సశేషం...)
http://en.wikipedia.org/wiki/Phrenology
postlink
0 comments