ఈ మధ్యన ఓ చక్కని
తెలుగు పుస్తకం కంటపడింది. ఎంతో కాలంగా నా బీరువాలో వున్నా, నిన్నే ఎందుకో పైకి తీసి
తిరగేశాను. పుస్తకం పేరు ‘అనుభవాల సారం’. ‘మంచి పుస్తకం’ మరియు ‘జనవిజ్ఞాన వేదిక’ వాళ్ల
ప్రచురణ. ‘చదువు’ కి సంబంధించిన ఓ చక్కని పుస్తకం ఇది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం
బడులలో టీచర్లకి తమ తరగతులలో కలిగిన ఆసక్తికరమైన అనుభవాలని పొందుపరుస్తూ కూర్చబడ్డ
పుస్తకం ఇది. పిల్లలు క్లాసులో అడిగే ఆసక్తికరమైన
ప్రశ్నలు, దానికి టీచర్ల స్పందన – వీటికి సంబంధించిన కథలెన్నో ఆ పుస్తకంలో వున్నాయి.
అందులో “ఊదినప్పుడు
దీపం ఎందుకు ఆరిపోతుంది?” అన్న అంశం మీద ఒక పిల్లవాడు అడిగిన ప్రశ్న, అందుకు టీచర్
యొక్క స్పందన ఆసక్తికరంగా అనిపించింది. ఆ వృత్తాంతం టీచర్ సొంత మాటల్లోనే విందాం.
--- వృత్తాంతం
మొదలు ---
పొయ్యి దగ్గర
కార్బన్ డయాక్సయిడ్ పని చెయ్యదా?
“నేను నెల్లూర్
జిల్లా బుచ్చి మండలంలోని రెడ్డి పాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను.
5 వ తరగతి విద్యార్థులకు “పరిసరాల విజ్ఞానం
- 2”
లో ‘మనం పీల్చే గాలి’ అనే పాఠ్యాంశంలో గాలి లోని వాయువులు, వాటి ఉనికిని గుర్తించేందుకు
చిన్న చిన్న ప్రయోగాల ద్వార వివరిస్తూ గాలిలో చాలా తక్కువ శాతం కార్బన్ డయాక్సయిడ్
ఉంటుందని, అది మనం విడిచే గాలిలో ఉంటుందని చెప్పి, ‘అగ్గిపుల్లని వెలిగించి నోటితో
ఊదినప్పుడు అది ఆరిపోతుంది. కారణమేమి?’ అని అడిగాను. విద్యార్థులు ఒక్క క్షణం తరువాత
‘నోటిలో నుండి వచ్చే కార్బన్ డయాక్సయిడ్ వల్ల’ అని చెప్పారు. అప్పుడు కార్బన్ డయాక్సయిడ్
కి మంటలని ఆర్పే స్వభావం ఉంటుందని చెప్పాను.”
“ఎప్పుడూ తరగతిలో
చురుగ్గా ఉండే రాజేంద్రప్రసాద్ అనే విద్యార్థి ఆ రోజు ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా, స్తబ్ధంగా
ఉండటం గమనించి, ‘ఏం రా, రజేంద్రా? ఏం ఆలోచిస్తున్నావు?’ అని అడిగాను. అప్పుడు వాడు
ఆలోచిస్తూ, ‘మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద అన్నం చేసున్నప్పుడు మంట ఆరిపోయిన ప్రతీ సారి
అమ్మ నోటితో గట్టిగా ఊదినప్పుడల్లా మంట ఎక్కువ అవుతుంది. ఎందుకని సార్? అది కార్బన్
డయాక్సయిడ్ వల్ల ఆరిపోవాలి కదా?’ అన్నాడు.”
“వాడి మాటలు
నాలో ఒకింత ఆశ్చర్యాన్ని, ఆలోచనని రేకెత్తించాయి. అతన్ని మెచ్చుకుంటూ ‘గాలిలో కార్బన్
డయాక్సయిడ్ కన్నా ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఇంతకు ముందు తెలుసుకున్నట్టు ఆ ఆక్సిజన్
మంటలు మండటానికి ఉపయోగపడుతుంది. మనం ఊదే గాలి మన చుట్టూ ఉన్న గాలిపొరలపై వత్తిడిని
కలిగించడం వల్ల ఆ గాలిలోని ఆక్సిజన్ వల్ల మంట ఎక్కువయ్యింది,’ అని సమాధాన పరచగలిగాను.”
“అప్పుడు నాకు
‘విద్యార్థులే నిజమైన గురువులు’ అన్న మాటలు అక్షర సత్యాలని, వారిని ఆలోచింపజేస్తే వారు
మనల్ని కచ్చితంగా ఆలోచింపజేస్తారని గ్రహించాను.”
షేక్ ఫఫీవుల్లా,
రెడ్డి పాళెం. Pg 73, అనుభవాలు పంచుకుందాం.
--- వృత్తాంతం
సమాప్తం ---
ఇది చాలా ఆసక్తికరమైన
ప్రశ్న. పిల్లవాడు అడిగిన ప్రశ్నకి టీచరు విసుక్కోకుండా ఆలోచించి సమాధానం చెప్పడం విశేషం.
అలా ప్రశ్నించే పిల్లలు గాని, అలా ఓపిగ్గా
సమాధానం చెప్పే టీచర్లు గాని అరుదే.
అయితే ఊదినప్పుడు
దీపం ఎందుకు ఆరిపోతుంది అన్న అంశం చాలా లోతైన అంశం. పైన ఇవ్వబడ్డ వివరణ సరిపోదు అనిపించింది.
దాని గురించి మరింత లోతుగా…
ఒక సందర్భంలో
ఊదితే ఆరిపోయిన మంట, మరో సందర్భంలో రెట్టించి వెలుగుతోంది. కనుక ఇది కేవలం కార్బన్
డయాక్సయిడ్ మీద ఆధారపడ్డ ప్రభావం కాదు. ఇంకా ఏదో విషయం ఉంటుంది అనుకుని కాస్త గూగుల్
చేశాను. దాని వల్ల నాకు అర్థమయ్యింది ఏంటంటే ఇది నిజంగానే జటిమైన సమస్య అని. కాస్త
వివరంగా చెప్పుకుందాం.
1.
ఊదితే
కొవ్వొత్తి (లేదా అగ్గిపుల్ల) ఎందుకు ఆరిపోతుంది?
అసలు
మంట అంటే ఏంటి? మండడానికి ఏం కావాలి? మంటకి మూడు కారణాలు కలిసి రావాలి – ఇంధనం, వేడి,
ఆక్సిజన్. కొవ్వొత్తిని ఊరికే గాల్లో వదిలేస్తే ఆక్సిజన్ + ఇంధనం వున్నాయి గాని వేడి
లేదు కనుక మంట పుట్టదు. మరో మంటని తెచ్చి కాస్త మైనం కరిగి వేడెక్కేలా చేసినప్పుడు
కొవ్వొత్తి వెలుగుతుంది – మంటకి కావలసిన మూడో కారణం ఇక్కడ సమకూరింది.
మండుతున్న కొవ్వొత్తిలో (లేదా వత్తి వున్న ఏ దీపంలో
నైనా) మండే ప్రక్రియ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఒక సారి పైన దీపం వెలిగాక ఆ మంటకి
వత్తి చివర్లో వున్న మైనం వేడెక్కి చుట్టూ వున్న ఆక్సిజన్ తో కలిసి మండుతుంది. అది
మండగా పుట్టిన అంశాలు (నీటి ఆవిరి, కార్బన్ డయాక్సయిడ్ మొ।।) వాయువులే కనుక గాల్లో
కలిసిపోయాయి. అంటే వత్తి చివర్లో కరిగిన మైనం బయటికి పోగా అక్కడ కాస్త ఖాళీ ఏర్పడుతుంది.
ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి కింది నుండి మరింత కరిగిన మైనం పైకెక్కుతుంది. అది దీపానికి
దగ్గరైనప్పుడు మండుతుంది. దాని అంశాలు గాల్లో కలిసిపోతాయి. ఈ ప్రక్రియలన్నీ చక్రికంగా
జరుగుతాయి.
ఇక్కడ
ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే మంట అనేది కారణమూ, ఫలితము కూడా. ఎందుకంటే మంట వల్లనే
ఇంధనం (మైనం) వేడెక్కి మండడానికి సిద్ధం అవుతుంది. అలా వేడెక్కిన ఇంధనం వల్ల మరింత
మంట పుడుతుంది. కనుక మంటే కారణం, మంటే ఫలితం కుడా! ఒక పోలిక చెప్పుకోవాలంటే పని చెయ్యడానికి
తిండి కావాలి. తింటే మరింత పని చేసి, ఆహారం సంపాదించుకోగలం. తినడం మరియు పని అనే ప్రక్రియలు
ఇక్కడ పరస్పర సంవర్ధకాలు (mutually reinforcing). అలాగే ఇంధనం, మంట పరస్పర సంవర్ధకాలు
(చిత్రం). ఆ రెండు ప్రక్రియల మధ్య సంబంధం
positive feedback లాంటిది. ఆ
positive feedback loop ని ఎలాగైనా తెగ్గొట్టగలిగితే,
మంట ఆరిపోతుంది.
ఊదినప్పుడు
ఆ positive feedback loop తెగిపోతుంది. ఊదినప్పుడు మంటని పక్కకి తోసేస్తున్నాం.
అక్కడ వేడి అనే కారణాన్ని తొలగిస్తున్నాం.
వత్తి అంచున్న ఉన్న మైనపు ద్రవం తగినంత ఉష్ణోగ్రత లేక ఆపై మండదు. అందుకే నెమ్మదిగా
ఊదితే మంట అస్థిరం అవుతుంది గాని మళ్ళీ పుంజుకుంటుంది. కాసేపు అక్కడ మంట ఉండనంతగా ఊదాలి.
అప్పుడు ఇక మళ్లీ మంట పుట్టదు.
(కొవ్వొత్తి
దీపంలో దాగి వున్న రసాయన శాస్త్ర విశేషాలు ఇక్కడ వివరించబడ్డాయి.
ఈ
అంశం మీద ఓ అద్భుతమైన పుస్తకం à A Chemical history of candle by
Michael Faraday. దీని తెలుగు అనువాదం ఇక్కడ వుంది –
)
ఇక్కడ
కార్బన్ డయాక్సయిడ్ కి ఎంత పాత్ర వుంది?
చాలా
తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఊదే గాలిలో కార్బన్ డయాక్సయిడ్ పాలు కేవలం 4%. మనం
లోపలికి పీల్చే గాలిలో కార్బన్ డయాక్సయిడ్ పాలు ఇంకా తక్కువ (0.04%). అది వేరే విషయం.
మరి
కట్టెపొయ్యిల విషయంలో ఏం జరుగుతుంది?
(ఇంకా
వుంది)
0 comments