బ్రాడ్లీ ఈ విషయం
గురించి లోతుగా ఆలోచించాడు. అతడికో ఉపాయం తట్టింది.
మీరు వర్షంలో
నిల్చున్నారు అనుకోండి. వర్షపు చినుకులు నిలువుగా కింద పడుతున్నాయి. అప్పుడు గొడుగుని
నిటారుగా తల మీద పట్టుకుంటే మీ మీద చినుకులు పడవు.
కాని ఇప్పుడు
మీరు అలాగే గొడుగుని నిటారుగా పట్టుకుని వర్షంలో నడవడం మొదలెడితే వర్షపు నీరు మీ ముందు
భాగం మీద పడుతుంది. మీ వెనుక భాగం పొడిగా ఉన్నా, ముందు భాగం తడిసిపోతుంది. ఎందుకంటే
గొడుగు యొక్క ముందు అంచుని కొంచెంలో తప్పించుకున్న వర్షపు చినుకు మీ ఛాతీ మీద పడుతుంది. ఎందుకంటే అప్పటికి
మీ శరీరం కాస్త ముందుకి జరిగి వుంటుంది. కనుక మీరు కదులుతున్నప్పుడు తడవకుండా ఉండాలంటే
గొడుగుని కాస్త ఏటవాలుగా పట్టుకోవాలి.
గొడుగుని ఎంత
ఏటవాలుగా పట్టుకోవాలి అన్నది, వర్షపు చినుకులు పడే వేగం మీద, మీరు కదిలే వేగం మీద,
నిజానికి ఈ రెండు వేగాల నిష్పత్తి మీద ఆధారపడి వుంటుంది. మీ వేగం ఎక్కువ అవుతున్న కొద్ది,
గొడుగుని మరింత ఏటవాలుగా పట్టుకోవాలి.
కనుక మీ వేగం,
వర్షపు చినుకుల వేగం తెలిస్తే, మీరు తడవకుండా ఉండాలంటే సరిగ్గా ఎంత వాలు వద్ద గొడుగుని పట్టుకోవాలో లెక్కించొచ్చు.
అలాగే మీరు తడవకుండా ఉండడానికి అవసరమైన గొడుగు
వాలు తెలిస్తే, మీ వేగం కూడా తెలిస్తే, వర్షపు చినుకు వేగాన్ని అంచనా వెయ్యడానికి వీలవుతుంది.
(Image: http://cseligman.com/text/history/bradley.htm)
తార నుండి భూమిని
చేరే కాంతి చినుకులు పైన ఉదాహరణలో చెప్పుకుని వర్షపు చినుకుల లాంటివి అని ఊహించుకున్నాడు
బ్రాడ్లీ. ఇందాక మీరు వర్షంలో కదిలినట్టు భూమి అంతరిక్షంలో (సూర్యుడి చుట్టూ) కదులుతోంది.
కనుక ఆ కాంతి కణాన్ని పట్టుకోడానికి భూమి నుండి తార దిశగా సారించబడ్డ దూరదర్శినులని
ఒక ప్రత్యేక వాలు వద్ద ఉంచాలి. బ్రాడ్లీ ఆ వాలుని కొలిచాడు. అలాగే సూర్యుడి చుట్టూ
భూమి కదిలే వేగం కూడా తెలిసిన విలువే. ఈ రెండు విలువల సహాయంతో తార నుండి భూమిని చేరిన
కాంతి కిరణం యొక్క విలువ అంచనా వేశాడు బ్రాడ్లీ.
1748 లో అతడు చేసిన ఈ అంచనా విలువ 176,000 మైళ్ళు/సెకను.
రోమర్ అంచనా కన్నా ఇది చాలా నయం. కాని అసలు విలువ కన్నా ఇది పది వేల మైళ్లు/సెకను చిన్న.
రోమర్ కాలంతో
పోల్చితే బ్రాడ్లీ కాలానికి వైజ్ఞానిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అంత పెద్ద
వేగాలని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. కాంతి వేగానికి ఒక పరిమిత
వేగం ఉందన్న విషయం, అది చాలా పెద్ద విలువ అన్న విషయం మొట్టమొదటి సారిగా శాస్త్రవేత్తలకి
మింగుడు పడింది.
కాంతి వేగాన్ని
కొలవడానికి రోమర్, బ్రాడ్లీ లు ఎంచుకున్న పద్ధతులు ఖగోళ ఘటనల మీద ఆధారపడ్డ పద్ధతులు.
రోమర్ ఎంచుకున్న పద్ధతి బృహస్పతి నుండి భూమిని చేరడానికి కాంతికి పట్టే సమయం మీద ఆధారపడింది.
బ్రాడ్లీ ఎంచుకున్న పద్ధతి తార నుండి వచ్చే కాంతి భూమి మీద పడే దిశ మీద ఆధారపడింది.
ఈ కొలమానాన్ని
అంతరిక్షం నుండి భూమి మీదకి తీసుకు రావడానికి వీలవుతుందా? భూమి మిదే ప్రయోగాలు చేసి
శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని కొలవగలరా? ప్రయోగం అంతా భూమి మీదే జరిగితే మనకి కావలసినట్టుగా
ప్రయోగ సామగ్రిలో మార్పులు చేర్పులు చేసుకోడానికి వీలవుతుంది.
అలాంటి ప్రయోగం
మొట్టమొదటి సారి 1849 లో జరిగింది. దాన్ని
చేసిన వాడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆర్మాండ్ హిపోలైట్ ఫిజో (Armand Hippolyte
Fizeau, 1819-1896). గెలీలియో చేసిన ప్రాథమిక ప్రయోగానికి కాస్త మెరుగులు దిద్ది తిరిగి
చెయ్యడానికి ప్రయత్నించాడు ఫిజో.
గెలీలియో చేసినట్టుగానే
ఫిజో రెండు కొండలని ఎంచుకున్నాడు. ఆ కొండల మధ్య దూరం 5 మైళ్లు. ఒక ప్రేరణకి మెదడు స్పందించి చేతిని కదిలించడానికి
కాస్త సమయం పడుతుంది. దాన్నే ప్రతిక్రియా సమయం అంటారని అంతకు ముందు చెప్పుకున్నాం.
ఈ ప్రతిక్రియా సమయం వల్ల వచ్చే సమస్యని ఒక విధంగా పరిష్కరించాడు ఫిజో. అవతకి కొండ మీద
ఓ శిష్యుణ్ణి నించోమనకుండా అక్కడ ఓ అద్దాన్ని ఉంచాడు.
ఫిజో ఒక కొండ
మీద నించుని అవతలి కొండ వైపుగా ఓ కాంతి కిరణాన్ని ప్రసరించాడు. ఆ కిరణం ఆ కొండ మీద
ఉండే అద్దం మీద పడి, ప్రతిబింబించబడి తిరిగి వెనక్కి వస్తుంది. కిరణం బయల్దేరిన సమయానికి
తిరిగి వచ్చిన సమయానికి మధ్య వ్యవధిని బట్టి కాంతి వేగాన్ని కొలవవచ్చు. రెండు కొండల
మధ్య రాను పోను మొత్తం పది మైళ్ళు ప్రయాణించడానికి కాంతికి పట్టే సమయం బట్టి కాంతి
వేగాన్ని లెక్కించవచ్చు.
(ఇంకా వుంది)
0 comments