ఆ విధంగా జీవనిర్మాణ
శాస్త్ర అధ్యయనాల వల్ల మెదడు కోటానుకోట్ల న్యూరాన్ల జాలం అని అర్థమయ్యింది. న్యూరాన్లు
వేరు వేరుగా వున్నా అవి వాటి తీగలని సారించి ఒకదాన్నొకటి సంపర్కించుకుంటూ, ఒకదాంతో
ఒకటి సంభాషిస్తూ వున్నాయి. బాహ్య ప్రపంచంలో టెలిఫోన్లలో మాట్లాడుతూ ఒకే సారి కోటానుకోట్ల
మంది సంభాషించుకుంటున్నట్టు మెదడులో న్యూరాన్లు ఒకే సారి అంత పెద్ద సంఖ్యలో సంభాషణలు
కొనసాగిస్తున్నాయి. మెదడు యొక్క నిర్మాణాన్ని సూక్ష్మస్థాయిలో అధ్యయనం చెయ్యడం వల్ల
ఇలాంటి అవగాహన కలిగింది.
అయితే కేవలం
నిర్మాణం గురించి తెలిస్తే మెదడు ఎలా పని చేస్తుందో అర్థం కాదు. మెదడు పని తీరు అర్థం
కావాలంటే న్యూరాన్ల రూపురేఖలు తెలిస్తే సరిపోదు. న్యూరాన్లు ఏం చేస్తాయో తెలియాలి.
అవి ఏం “మాట్లాడు”కుంటున్నాయో తెలియాలి. అప్పుడే స్థూల స్థాయిలో మెదడు ఎలా పని చేస్తుందో
అర్థమవుతుంది. న్యూరాన్లు ఎలా పని చేస్తాయో అర్థం కావాలంటే వాటి గురించి అర్థం కావలసిన
ప్రాథమిక విషయం ఒకటుంది. న్యూరాన్లు చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యుట్ల లాంటివి. ఈ దృష్టితో
న్యూరాన్లని చూడాలంటే జీవశాస్త్రంలో ఓ కొత్త శాఖతో పరిచయం కలిగించుకోవాలి. దాని పేరు
విద్యుత్ జీవక్రియా శాస్త్రం (electrophysiology). ఆ శాఖ సంగతేంటో చూద్దాం.
విద్యుత్ జీవక్రియా
శాస్త్రం (electrophysiology)
పాత జీవశాస్త్ర
పుస్తకాలు తిరగేస్తే జీవ పదార్థం అంతా ఓ సంక్లిష్టమైన రసాయనిక వ్యవస్థ అని, అసలు జీవ
తత్వం రసాయనిక తత్వమని, రసాయనిక చర్యలు తప్ప జీవ పదార్థంలో పెద్దగా ఏమీ లేదన్న తాత్పర్యం
కనిపిస్తుంది. కాని జీవపదార్థ విషయంలో ఈ దృక్పథానికి పూర్తిగా విరుద్ధమైన దృక్పథం మరొకటి వుంది. దాని
ప్రకారం జీవ వ్యవస్థ కేవలం ఓ విద్యుత్ వ్యవస్థ. జీవ శక్తి విద్యుత్ శక్తితో సమానం.
ఈ రెండవ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని పని చేసేదే విద్యుత్ జీవక్రియా శాస్త్రం.
1771 లో సుదినాన ఈ విద్యుత్ జీవక్రియా శాస్త్రం ప్రాణం
పోసుకుంది. ఆ రోజు ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త లూయీగీ గాల్వానీ (Luigi Galvani) తన
ప్రయోగశాలలో పని చేసుకుంటున్నాడు. విద్యుదావేశాలకి చెందిన ప్రయొగాలేవో చేసుకుంటున్నాడు. అంతలో పొరపాట్న విద్యుదావేశితమైన ఓ కడ్డీని
(charged rod) ని పక్కనే వేలాడదీసిన ఓ కప్ప
కాలి యొక్క కండరానికి తాకించాడు. చనిపోయిన ఓ కప్ప కాలు మాత్రం కండరం పైకి కనిపించేలా
అక్కడ వేలాడదీసి వుంది. విద్యుత్ కడ్డీ తాకగానే ఆ కాలు జీవం ఉన్న కాలులా కొట్టుకుంది.
గాల్వానీ అదిరిపోయాడు. ప్రాణం లేని కాలిలో చలనం ఎలా సంభవిస్తోంది? తరువాత గాల్వానీ
అనుచరుడు ఒకడు కప్ప కాలిలోని సియాటిక్ నరాన్ని
(sciatic nerve) విద్యుదావేశితమైన లోహపు కడ్డీతో తాకాడు. ఈ సారి కూడా కాలు కొట్టుకుంది.
నరాన్ని తాకబోతుండగానే చిటపట చప్పుడుతో కడ్డీ నుండి నరానికి నిప్పురవ్వలు ఎగరడం కనిపించింది.
ఇంచుమించు అదే
కాలంలో గాల్వానీ సయోద్యోగి అయిన అలెక్సాండ్రో వోల్టా మనకందరికీ తెలిసిన ‘వోల్టాయిక్
దొంతర’ (Voltaic pile) ని రూపొందించాడు. ప్రస్తుతం
మనం వాడే బ్యాటరీలకి ఈ ‘వోల్టాయిక్ దొంతర’ ఓ ప్రాచీన ప్రతిరూపం అన్నమాట. వోల్టాయిక్
దొంతర లో ప్రవహించేదీ విద్యుత్తే. మరి కప్ప కాలిని విద్యుదావేశిత కడ్డీతో తాకితే ప్రవహించేది
కూడా విద్యుత్తే. అయితే గాల్వానీ ఈ రెండూ వేరు వేరు రకాల విద్యుత్తు అని అభిప్రాయపడ్డాడు.
ఒకటి ‘జీవ పదార్థంలోని విద్యుత్తు,’ రెండవది ‘జీవరహిత పదార్థం లోని విద్యుత్తు.’ కాని
వోల్టా అలా అనుకోలేదు. రెండు విద్యుత్తులు ఒకటే అనుకున్నాడు. వోల్టా అనుకున్నదే నిజం
అని తరువాత తెలిసింది. కప్ప కాలిలో ప్రవహించేది ఏదో విచిత్రమైన “జంతు విద్యుత్తు”
(animal electricity) కాదని, అది కూడా మామూలు విద్యుత్తు లాంటిదేనన్న అవగాహన అలా మొదలయ్యింది.
దాంతో సామాన్య విద్యుత్ ధర్మాలని మెదడు పని
తీరుకి వర్తింపజేసే అవకాశం ఏర్పడింది.
(ఇంకా వుంది)
0 comments