భూమి సూర్యుడి
చుట్టూ ఏడాదికి ఓ సారి ప్రదక్షిణ చేస్తుంది. భూమి కన్నా బృహస్పతి సూర్యుడికి మరింత
దూరంలో ఉన్నాడు కనుక తన ప్రదక్షిణ మరింత విస్తారంగా ఉంటుంది. సూర్యుడి చుట్టూ బృహస్పతి
ప్రదక్షిణ కాలం 12 ఏళ్లు.
అంటే సూర్యుడి
చుట్టూ బృహస్పతి ఒక ప్రదక్షిణ చేసే సమయంలో భూమి సూర్యుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేస్తుంది అన్నమాట. అంటే ఏడాదిలో సగకాలం
పాటు భూమి సూర్యుడికి బృహస్పతి ఉన్న వైపే ఉంటుంది. మిగతా సగకాలం భూమి సూర్యుడికి బృహస్పతి ఉన్న వైపుకి అవతలి వైపు ఉంటుంది.
భూమి సూర్యుడికి
బృహస్పతి వున్న వైపే వుంటే, భూమికి బృహస్పతికి మధ్య దూరం కనిష్ఠంగా ఉన్నప్పుడు బృహస్పతి
నుండి భూమికి ప్రయాణించడానికి కాంతికి కొంత సమయం పడుతుంది. ఆర్నెల్ల తరువాత భూమి బృహస్పతి
సూర్యుడికి వున్న వైపు కాక అవతలి వైపు ఉన్నప్పుడు రెండు గ్రహాలకి మధ్య దూరం గరిష్ఠంగా
ఉంటుంది. అప్పుడు రెండు గ్రహాల మధ్య కాంతి
ప్రయాణించడానికి పట్టే కాలం మరింత ఎక్కువ అవుతుంది. భూమికి బృహస్పతికి మధ్య కనిష్ఠ,
గరిష్ఠ దూరాల మధ్య తేడా భూమి కక్ష్య యొక్క వ్యాసంతో సమానం అవుతుంది.
భూమి కక్ష్య
యొక్క వ్యాసంతో సమానమైన ఆ అదనపు దూరాన్ని దాటడానికి కాంతికి కొంత సమయం పడుతుంది. కనుక
భూమి, బృహస్పతి సూర్యుడికి చెరో వైపు ఉన్నప్పుడు భూమి మీద ఉండే ఖగోళశాస్త్రవేత్తలు
గ్రహణం కోసం అంత అదనపు కాలం వేచి ఉండవలసి వస్తుంది. అందుకే ఆ దశలో బృహస్పతి ఉపగ్రహాల
యొక్క గ్రహణాలు సగటు విలువ కన్నా మరింత ఆలస్యంగా కనిపిస్తాయి. అదే భూమి, బృహస్పతి సూర్యుడికి
ఒక వైపే వున్నప్పుడు, రెండు గ్రహాల మధ్య దూరం కనిష్ఠంగా ఉన్నప్పుడు, కాంతి మరింత తొందరగా
భూమిని చేరగలుగుతుంది. అందుకే గ్రహణాలు సగటు విలువ కన్నా మరింత తొందరగా కనిపిస్తాయి.
రోమర్ కాలంలో
భూమి కక్ష్య యొక్క వ్యాసం విలువ కచ్చితంగా తెలిసేది కాదు. కాని రోమర్ అప్పటికి లభ్యంగా
ఉన్న అంచనానే తీసుకున్నాడు. తన పరిశీలనల ప్రకారం కాంతికి ఆ దూరాన్ని దాటడానికి
16 నిముషాలు పడుతుందని తెలిసింది. దీన్ని బట్టి
కాంతి వేగం 132,000 మైళ్లు/సెకను అని అంచనా వేశాడు రోమర్.
రోమర్ భూమి కక్ష్య
వ్యాసాన్ని తక్కువ అంచనా వేశాడు కనుక కాంతి
వేగాన్ని కూడా తక్కువ అంచనా వేశాడు. అసలు విలువ కన్నా ఈ విలువ 50,000 మైళ్లు/సెకను
తక్కువ. కాని కాంతి విలువకి అది మొట్టమొదటి అంచనా అని గుర్తిస్తే ఇది నిజంగా మెచ్చుకోదగ్గ
విజయం అనే చెప్పాలి.
ఎంత తక్కువ అంచనా
వేసినా రోమర్ చేసిన అంచనా (అది 1676 నాటి మాట)
చాలా పెద్దవిలువ అనే చెప్పుకోవాలి. ఒక కొండ నుండి మరో కొండకి కాంతి ప్రయాణించే కాలం
బట్టి కాంతి వేగాన్ని కొలవబోయిన గెలీలియో అంత పెద్ద విలువని కొలవగలిగి ఉండేవాడు కాడు.
ఆ కొండల మధ్య దూరం 1 మైలు ఉంటుంది అనుకుంటే,
ఆ దూరాన్ని దాటి తిరిగి వెనక్కు రావడానికి కాంతికి కేవలం సెకనులో 1/90,000 వంతు కాలం మాత్రమే పడుతుంది. కొండల మధ్య దూరం పది
మైళ్ళు అనుకున్నా ఆ కాలం సెకనులో 1/9000 వంతు
అవుతుంది. అంత క్లుప్తమైన కాలాలని కొలవడం గెలీలియోకి సాధ్యం అయ్యుండేది కాదు.
(ఇంకా వుంది)
[అసిమోవ్ పాశ్చాత్యుడు
కనుక కాంతివేగానికి రోమర్ చేసిన అంచనాయే మొట్టమొదటిది
అన్నట్టు వ్రాశాడు. కాని ప్రాచీన భారతంలో శాయణుడు అనే పండితుడు కాంతివేగం గురించి ప్రస్తవించిన
దాఖలాలు ఉన్నాయి.
ప్రాచీన భారత
విజ్ఞానం గురించి ఎంతో పరిశోధన చేసిన ప్రొఫెసర్ సుభాష్ కాక్ (Louisiana State Univ) ఈ విషయం గురించి ఇలా రాస్తున్నారు.
విజయనగర సామ్రాజ్యాన్ని
ఒకటవ బుక్కరాయలు పాలించే కాలంలో సాయణుడు (1315-1387) అనే పండితుడు ఉండేవాడు. ఇతగాడు వేదపండితుడు. ఎన్నో ప్రాచీన గ్రంథాల మీద
వ్యాఖ్యానాలు వ్రాశాడు. ఋగ్వేదంలో సూర్యుణ్ణి స్తుతించే ఓ గీతంలో (1.50) నాలుగవ శ్లోకం ఇలా వుంది –
తథా చ స్మర్యతే
యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే
ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమో 2స్తు త ఇతి||
తాత్పర్యం: అరనిముషానికి
2202 యోజనాలు ప్రయాణించగల నీకు నమస్కారము –
అని గుర్తుంచుకోవాలి.
ఇది సూర్య స్తుతి
కనుక ఆ గమనం సూర్యుడిది అని అనుకోవాల్సి వుంటుంది. కాని పద్మాకర్ విష్ణు వర్తక్ అనే
రచయిత ఆ గమనం సూర్యుడుది కాదని, కాంతిదని సూచించాడు. ఎందుకంటే 1 యోజనం = 9 మైళ్ల
110 గజాలు = 9.065 మైళ్లు. అలాగే మహాభారతంలో శాంతి పర్వం ప్రకారం
1 నిమేషం = 8/75 సెకన్లు. ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇవ్వబడ్డ వేగాన్ని
లెక్కిస్తే దాని విలువ 187,084.1 మైళ్లు/సెకను
అని వస్తుంది. మేటి సంస్కృత పండితుడైన సర్ మోనియర్ విలియమ్స్ ప్రకారం 1 యోజనం = 9
మైళ్ళు. ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇవ్వబడ్డ వేగాన్ని లెక్కిస్తే దాని విలువ
186,413.22 మైళ్లు/సెకను అని వస్తుంది. ఈ రెండు విలువలూ పైన రోమర్ చెప్పిన
విలువ కన్నా అసలు విలువకి చాలా సన్నిహితంగా ఉన్నాయి. కాంతి వేగం యొక్క ఆధునిక విలువ
= 186,300 మైళ్లు/సెకను.
Vartak, P.V., 1995. Scientific Knowledge in the Vedas. Nag
Publishers, Delhi.
-అనువాదకుడు]
నేను కొంత కాలంగా నా శ్యామలీయం బ్లాగులో నాకు నచ్చిన బ్లాగుల జాబితా ఒకటి తయారుచేసుకోవాలని ఆలోచిస్తూ బధ్దకిస్తున్నాను. ఇప్పుడా పని చేస్తున్నాను. ఆ జాబితాలో మొదటి బ్లాగు ఇదే!
అలాగే నాకు నచ్చిన టపాల జాబితా ఒకటి కూడా నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈ టపా వాటిలో తప్పకుండా ఉంటుంది.
విశ్వనాథవారు తమ వ్యాససంకలనం ఒక దానిలో భారతం ఆధారంగా కాంతి వేగం గురించి వ్రాసారు. దురదృష్టవశాత్తు వివరాలు గుర్తు లేవు. ఆ సంకలనాన్ని నేను 1972లో చదివాను మరి. అప్పుదప్పుడు ఆ సంకలనం గురించి వెదకాలీ అనుకుంటూ ఉంటాను కూడా.
శ్యామలీయం గారు - కామెంట్లకి ధన్యవాదాలు. మహాభారతంలో కాంతి వేగానికి సంబంధించి మరిన్ని వివరాలు దొరికితే పంచుకోగలరు...