అంతరిక్షం నుండి
భూమికి…
రోమర్ అంచనా
వేసిన కాంతి వేగం విలువకి ఖగోళ శాస్త్రవేత్తలు పెద్దగా స్పందించలేదు. దానికి కారణం
అంత పెద్ద వేగం గురించి వాళ్లు ఎప్పుడూ కని విని ఎరుగకపోవడమే. అంతేకాక గడియారం సహాయంతో
అంత కచ్చితంగా కాలాన్ని కొలవడం కూడా ఆ రోజుల్లో కాస్త విడ్డూరంగా అనిపించేది. ఈ కారణాల
చేత రోమర్ ఫలితాలని ఇంచుమించు పూర్తిగా విస్మరించబడినట్టే. ఓ డెబ్బై ఏళ్ల పాటు అంతా
ఆ విషయమే మర్చిపోయారు.
ఇంతలో శాస్త్రవేత్తల
ధ్యాస మరో ఖగోళ విశేషం మీదకి మళ్లింది. తారలు మన నుండి చాలా దూరంలో వున్నాయని ఎంతో
కాలంగా మనుషులు నమ్ముతూ వచ్చారు. కాని ఆ దూరం
ఎంత అన్నది విషయం మీద ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ
చేస్తుంది కనుక భూమి బట్టి సూర్యుడి స్థానం గణనీయంగా మారుతూ ఉంటుంది. కాని తారలు బాగా
దూరంలో ఉంటాయి కనుక మన బట్టి వాటి స్థానంలో
పెద్దగా మార్పు ఉండదు.
సూర్యుడికి భూమి
ఒక వైపున ఉన్నప్పుడు, ఇక్కణ్ణుంచి ఓ సమీప తారని చూసినప్పుడు, ఓ సుదూర తారకి ఈ సమీప
తారకి మధ్య కోణీయ దూరం కొంత ఉండొచ్చు. భూమి సూర్యుడికి అవతలి వైపున ఉన్నప్పుడు (ఆర్నెల్ల
తరువాత) అక్కణ్ణుంచి చూసినప్పుడు, ఆ రెండు తారల మధ్య కోణీయ దూరం విలువ వేరుగా ఉండొచ్చు.
సూర్యుడికి ఇరు వైపుల నుండి ఓ సమీప తారని చూసినప్పుడు దాని దిశలో చెప్పుకోదగ్గ తేడా
ఉండొచ్చు. కాని అదే విధంగా సూర్యుడికి ఇరు వైపుల నుండి సుదూర తారని చూసినప్పుడు దాని
దిశలో పెద్దగా తేడా ఉండకపోవచ్చు (చిత్రం).
సుదూర తారల నేపథ్యం మీద సమీప తారల స్థానంలో వచ్చే
మార్పునే ‘దృష్టి విక్షేపం’ (parallax) అంటారు. ఈ దృష్టి విక్షేపం ఎలా పని చేస్తుందో
అర్థం చేసుకోడానికి ఓ చిన్న ప్రయోగం చెయ్యొచ్చు. మీ ముఖానికి ఎదురుగా, ఓ అడుగు దూరంలో
మీ బొటన వేలిని చిత్రంలో చూపించినట్టు పట్టుకోవాలి. ఇప్పుడు మీ ఎడమ కన్ను మూసుకుని,
కుడి కంటితో చూస్తూ మీ బొటన వేలి వెనుక ఏ వస్తువు ఉందో గుర్తుంచుకోవాలి. అది ఓ చెట్టో,
ఓ బల్లో, ఓ కుర్చీనో… ఇలా నేపథ్యంలో ఉన్న, బొటన వేలి వెనుకగ వున్న, వస్తువుని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుడి కన్ను మూసుకుని, ఎడమ కంటితో చూస్తే
అదే విధంగా బొటన వేలి వెనుకగా ఉన్న వస్తువుని గుర్తించాలి. ఇప్పుడు కుడి, ఎడమ కళ్ళని
మార్చి మార్చి మూసుకుంటూ బొటన వేలి స్థానం ఎలా మారుతోందో గమనించాలి. చూసే కంటిని బట్టి
బొటన వేలి నేపథ్యం మారుతోందని ఈ ప్రయోగాన్ని బట్టి మనం గమనించగలం.
బొటన వేలి స్థానంలో
ఎంత తేడా వచ్చింది అన్న దాని బట్టి మీ ముఖం నుండి మీ బొటన వేలి దూరాన్ని అంచనా వెయ్యడానికి
వీలవుతుంది. అదే విధంగా భూమి సూర్యుడికి ఇరుపక్కల ఉన్న స్థితిలో సమీప తారని చూసినప్పుడు,
ఆ తార స్థానంలో (లేక దిశలో) వచ్చిన తేడా బట్టి భూమి నుండి ఆ తార దూరాన్ని అంచనా వెయ్యొచ్చు.
సైద్ధాంతికంగా
ఈ పద్ధతి బాగానే వుంది గాని వాస్తవంలో తారలు భూమి నుండి ఎంత దూరంలో వున్నాయంటే తారల
వల్ల మనకి కలిగే ‘దృష్టి విక్షేపం’ అతి స్వల్పంగా ఉంటుంది. 1700 ల నాటి దూరదర్శినులు మరీ మోటువి కనుక అంత చిన్న
విక్షేపాలని పసిగట్ట లేకపోయాయి. ఆ విషయం తెలీని శాస్త్రవేత్తలు తారల ‘దృష్టి విక్షేపపు’
విలువలని అదే పనిగా కొలుస్తూ పోయేవారు.
అలా దృష్టి విక్షేపాలని
కొలిచిన వారిలో బ్రిటన్ కి చెందిన జేమ్స్ బ్రాడ్లీ (1693-1762) ఒకడు. అతడి దూరదర్శిని తో ఓ తార యొక్క దృష్టి విక్షేపం
కొలవగలిగాడు.
అయితే తను కొలిచిన
దృష్టి విక్షేపాలు దోషపూరితమైనవి. భూమి ఒక దిశలో కదులుతున్నప్పుడు, తార యొక్క స్థానం
వ్యతిరేక దిశలో స్థానభ్రంశం చెందుతున్నట్టు కనిపించాలి. కాని బ్రాడ్లీ పరిశీలించిన
తార విషయంలో అలా జరగలేదు. తార తప్పుడు దిశలో కదిలినట్టు కనిపించింది. కనుక అదసలు ‘దృష్టి
విక్షేపమే’ కాదని తెలిసింది.
మరి అది దృష్టి
విక్షేపం కాకపోతే బ్రాడ్లీ చూసినదేమిటి?
(ఇంకా వుంది)
0 comments