నన్నో విశాల, అజ్ఞాత ఖండంతో
పోల్చుకోవచ్చు. ఆ ఖండం యొక్క తీర రేఖ గురించి, తీరానికి సమీప ప్రాంతాల గురించి తప్ప
లోలోపల ఏం రహస్యాలు దాగి వున్నాయో ఇప్పటికీ పెద్దగా తెలీదు. నా కథ అంటేనే ఎన్నో అంతర్వై
రుధ్యాలతో కూడుకున్న విషయం. ఉదాహరణకి మీకు బాధ అన్నది నా వల్లనే కలుగుతుంది కదా? కాని
నాకు మాత్రం నొప్పి అంటే ఏంటో తెలీదు సుమా! నన్ను కోసినా నాకు నొప్పి తెలీదు. అందుకే
మెదడు సర్జరీలు చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో పేషెంటు మేలుకునే ఉంటాడు. నొప్పి అనేది
కపాలం పై చర్మం లోను, కపాలానికి అడుగున మెదడుని కప్పి ఉంచే మెనింజెస్ అనే పొరలలో మాత్రమే
ఉంటుంది. అందుకే అక్కడ మాత్రమే అనెస్తీషియా ఇస్తారు. కాని అసలు మెదడులో నొప్పి తెలీదు. అందుకే సర్జరీ చేసి
మెదడులో ఏ భాగం దెబ్బ తిన్నదో తెలుసుకోడానికి మెదడు లో ప్రత్యేక స్థానాలలో విద్యుత్
కరెంట్ ని ప్రవేశపెట్టి స్టిములేట్ చేస్తారు. అలా స్టిములేట్ చేసినప్పుడు “ఎలా అనిపించింది?”
అని మెలకువగా ఉన్న పేషెంటుని అడుగుతారు. ఒక
చోట స్టిములేట్ చేస్తే కాంతి తళుకులు కనిపించొచ్చు. మరో చోట చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు
విని, మర్చిపోయిన ఘంటసాల పాట వినిపించొచ్చు.
ఇంకో చోట చేస్తే మిమ్మల్ని ఏదో అదృశ్య హస్తం తాకిన అనుభూతి కలిగి ఒళ్లు గగుర్పొడచవచ్చు.
మీలో కలిగే ప్రతీ అనుభూతికి, మీకు గుర్తొచ్చే ప్రతీ జ్ఞాపకానికి ఆధారం నాలో కదిలే విద్యుత్
ప్రకంపనలే. మీ ప్రేమలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, దాతృత్వాలు, మాతృత్వాలు, మీ మెలకువ,
నిద్ర – అన్నిటికీ ఆధారం నాలోని విద్యుత్ చలనాలే. నమ్మ బుద్ధి కావడం లేదు కదూ!
దృష్టి, శ్రవణం, స్పర్శ మొదలైన
ఇంద్రియాల క్రియలు మెదడులో ఎక్కడెక్కడ జరుగుతాయి అన్న విషయంలో ప్రస్తుతానికి ఎన్నో
విషయాలు తెలిశాయి. మెదడు రహస్యాలలో ఇంత కన్నా ఆసక్తికరమైన ఆవిష్కరణ ఒకటుంది. దాన్నే
ముద్దుగా “ఆనంద కేంద్రం” (pleasure center)
అంటారు. ఈ కేంద్రంలోకి కరెంట్ ప్రవేశపెడితే చెప్పలేని ఆనందం అనుభవమవుతుంది.
ఈ అద్భుత కేంద్రం గురించి మొట్టమొదట ఎలుకల్లో కనుక్కున్నారు. ఈ కేంద్రంలో ఎలక్ట్రోడ్
ని ప్రవేశపెట్టి, ఓ మీట నొక్కితే ఆ ఎలక్ట్రోడ్ లోంచి కరెంటు ప్రవహించే ఏర్పాటు చేశారు.
ఎలుకకి బుద్ధి పుట్టినప్పుడల్లా ఆ మీట నొక్కే వెసులుబాటు కల్పించారు. అప్పుడు ఆ ఎలుక
పక్కనే పళ్లెంలో ఉన్న భోజనం వైపు కన్నెత్తి అయినా చూడకుండా హాయిగా మీట నొక్కుకుంటూ
పాపం అమందానంద కందళిత హృదయారవిందగా మారిపోయిందట!
కనుక దీన్ని బట్టీ మనకి అర్థం
అవుతున్నదేంటంటే, మనిషన్నవాడు మంచి సినిమాల కోసం, మంచి పుస్తకాల కోసం, మంచి టీవీ సీరియళ్ళ
కోసం, మంచి రెస్టారెంట్ల కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే కాస్తంత జీవనానందం కోసం ఊరికే
హైరానా పడక్కర్లేదు. మెదడులో సరైన చోట ఎలక్ట్రోడ్ పెట్టించుకుంటే చాలు, మీట నొక్కితే
చెప్పనలవి కాని ఆనందం మీ సొంతం అవుతుంది! ఉదాహరణకి మీ బాస్ ఈ సారి మీకు ఇస్తానన్న ప్రొమోషన్,
మీ పక్క క్యూబికిల్ కి చెందిన శుంఠకి ఇచ్చేశాడని మీరు డిప్రెస్ అయ్యి వున్నారనుకోండి.
అన్నిటికీ ఒకే పరిష్కారం. మీట నొక్కుకోవడమే! హాస్యానికేం గానీ, నిజంగానే ఈ రకమైన ఎలక్ట్రికల్
బ్రెయిన్ స్టిములేషన్ ఉపయోగించి డిప్రెషన్ ని నయం చేసిన సందర్భాలెన్నో వున్నాయి.
అయితే అలా ఎలక్ట్రోడ్లు దూర్చి
నా మనసు ఇష్టం వచ్చినట్టు మార్చేయడం అంత సులభం అనుకోకండేం. అవన్నీ చెయ్యడం ఆషామాషీ
వ్యవహారం కాదు. దానికి చాలా కఠినమైన సర్జరీలు అవసరం. మామూలుగా అయితే నేను ఇంచుమించుగా
దుర్భేద్యమైన ఓ కోటలో సురక్షితంగా ఉంటాను. ఆ కోట పేరే కపాలం. అంతే కాదు నాకు ఆ కోటకి మధ్య ఓ చిక్కని ద్రవం మరో రక్షక కవచంలా
పని చేస్తుంది. నేనా ద్రవంలో తేలుతూ ఉంటాను.
అందుకే తలకి కాస్తో కూస్తూ దెబ్బ తగిలినా నేనా ద్రవంలో తేలుతూ ఉంటా కనుక నాకు పెద్దగా
దెబ్బ తగలదు. ఇక నా కోట ద్వారాల వద్ద కూడా గట్టి కాపలా ఉంటుంది. రక్తం లేకుండా నేను
బతకలేనని ముందే చెప్పాగా? రక్తం లోంచి వచ్చే
గ్లూకోసు, ఆక్సిజను మొదలైనవి నా ఉన్కికి అత్యవసరం. అయితే రక్త ప్రవాహం లోంచి
కొట్టుకొచ్చే విషపదార్థాలు ఏవైనా వుంటే వాటిని మా కోటగుమ్మం వద్ద అటకాయించి ఆపేసే యంత్రాంగం
ఒకటుంది. దాన్నే blood-brain barrier (మెదడుకి రక్తానికి మధ్య అడ్డుతెర) అంటారు. ఇందువల్లనే
కొన్ని హానికరమైన బాక్టీరియా రక్త మండలం లోంచి మెదడులోకి ప్రవేశించలేవు. అయితే మీ అదృష్టం
వల్ల బాధానివారణ పదార్థాలు (painkillers), మత్తు మందు పదార్థాలు (anaesthetics) ఈ అడ్డుతెరని దాటి మెదడు లోకి ప్రవేశించగలవు. కాని
దురదృష్టం (?) ఏంటంటే ఆల్కహాలు వంటి హానికరమైన పదార్థాలు కూడా ఈ అడ్డుతెరని దాటి లోపలికి
రాగలవు. నన్ను ఆక్రమించుకుని మీ మీద అధికారం చలాయించగలవు.
(ఇంకా వుంది)
Image credits:
http://www.cellbiol.net/ste/alpobesity3.php
0 comments