అక్షరాల ఆవిష్కరణ
పిల్లలప్రపంచం, ముఖ్యంగాఅంకెల, అక్షరాలప్రపంచం,
ఎంత చిత్రవిచిత్రంగా ఉంటుందో ఒక పిల్లవాడి దగ్గర్నుండే నేర్చుకున్నాను. ఆ పిల్లవాడి
పేరు క్రిస్. ఐదేళ్లవాడు. మహాచురుగ్గా ఉంటాడు. రోజూ వాళ్లమ్మ మేరీతో నా ఆఫీసుకి వచ్చేవాడు.
క్రిస్ తండ్రి లారీ డ్రైవరు. టోవింగ్ లారీ
నడిపిస్తాడు. అందుచేత క్రిస్ ఆడుకునే బొమ్మల్లో కూడా కార్లు, లారీలు, బస్సులు – ఇవే
ఉంటాయి. ఆ బొమ్మల్తో పాటు పట్టాల్లాంటి కమ్మీలు కూడా ఉంటాయి. ఆ పట్టాల్ని రకరకాలుగా
కలిపి హైవేలు, బ్రిడ్జిలు, జంక్షన్లు వంటివి నిర్మిస్తాడు. గంటల తరబడి ఆ బస్సాటలు ఆడుతూ
కూర్చుంటాడు. ఆ కార్లని, లారీలని ఆ పట్టాల వెంట నడిపిస్తూ ఆడుకుంటాడు. మధ్యమధ్యలో సైరన్
కూతతో ఓ పోలీసు కారు వస్తుంటుంది. ఈ తంతంతా జరుగుతుంటే దాంతో పాటు ఏదో కథ అల్లి వ్యాఖ్యానంలా
చెప్తుంటాడు. ఇలా తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా అన్నీ మర్చిపోయి హాయిగా ఆడుకుంటుంటాడు.
అయితే గత కొద్ది నెలల్లో క్రిస్ ఆటల్లో ఓ మార్పు వచ్చింది. పట్టాలని కొన్ని రకాలుగా
పేర్చితే అవి అక్షరాలని పోలి ఉంటాయని క్రిస్ గమనించాడు. తను కనుక్కున్న ఈ కొత్త విషయాన్ని
ఒకటి రెండు సార్లు నాకు తెచ్చి చూపించాడు కూడా. అప్పుడప్పుడు ఆ అక్షరం ఏంటి అని అడిగి
కనుక్కుంటూ ఉండేవాడు. కాని అప్పుడప్పుడు మాత్రమే. మామూలుగా అయితే తన ధ్యాసంతా రోడ్డు,
లారీలు, సైరన్ కూతలు – వీటి మీదే.
ఇవాళ తను ఆడుకుంటే నేను ఆ దిక్కుగా వెళ్లాను.
నన్ను పిలిచి చూపించాడు. పట్టాల్లో ఒకచోట రెండు రోడ్లు కలిసి
J అక్షరంలా ఉందట. అలాగే మరో చోట T, ఇంకో
చోట (కొద్దిగా ఊహాశక్తి జోడిస్తే!) I అక్షరంలా ఉన్నాయట. ఇలా తయారయిన కొన్ని
‘అక్షరాలని’ పేర్చి ‘అదే పదం?’ అని అడిగాడు. ఆ పదాల్లో అచ్చక్షరం ఉన్నట్లయితే బతికిపోయే
వాణ్ణి. అచ్చక్షరం లేనట్లయితే నా నోట్లోంచి ఏవో ఉస్సుబుస్సు మన్న శబ్దాలే వచ్చేవి!
ఓ సారి తను ఆడుకుంటుంటే చూసి తన పట్టాల్లో
ఒకచోట U అక్షరంలా ఉందని సూచించాను. దాంతో మళ్లీ ఉత్సాహం వచ్చి ‘పదాలు’ పేర్చుతూ అవేంటని
అడగడం మొదలెట్టాడు. ఎన్నో విచిత్రమైన, పలకడానికి వీల్లేని పదాలని నిర్మించాక U ముందు J, U
తరువాత J పేర్చితే JUT అవుతుంది కదా
అని సూచించాను. నా సూచనని పెద్దగా పట్టించుకోలేదు క్రిస్. కాసేపటి తర్వాత తనకి S అక్షరంవంటి
ముక్క ఒకటి దొరికింది. దానికి J, I, T, U కలిపితే JITSU (JUJITSU లోలాగ!) అవుతుంది కదా అని సూచించాను.
అది కూడా పట్టించుకోలేదు క్రిస్. అది విన్నాడు కాని ఆ విషయాన్ని పొడిగించలేదు.
అలా కొంత సేపు ఆడాక, ఆ ఆట మానేసి తను కల్పించుకున్న
వేరే ఆటల్లో మునిగిపోయాడు. ఇంతలో వాళ్లమ్మ, ఆమెతో పాటు మా ఆఫీస్లో పని చెసే స్టీవ్
అనే కుర్రాడు వచ్చారు. ఇద్దరూ కలిసి ఆ గదిలో ఉన్న పార్సెళ్లని పోస్ట్ వాన్లోకి ఎక్కించడం
మొదలెట్టారు. క్రిస్ ఉత్సాహంగా ఆ పన్లో పాల్గొన్నాడు. పెద్ద పెద్ద వస్తువులకి సంబంధించిన
ఏ పనైనా క్రిస్ కి చాలా ఇష్టం. చాలా మంది పిల్లల్లాగానే క్రిస్ కి తను సరిగ్గా పట్టుకోను
కూడా లేనంత పెద్ద పెద్ద వస్తువులని ఎత్తడం అమర్చడం వంటి పనులంటే సరదా. “నేను మీరంతా
అనుకున్నట్టు అర్భకుణ్ణికాను. పెద్దవాణ్ణి, బలవంతుణ్ణి” అని నిరూపించుకోవాలని వాడి
ఆరాటం.
మధ్యమధ్యలో క్రిస్ ఉన్నట్లుండి తన అక్షరాల
ఆటల్లోకి వెళ్లిపోయేవాడు. ఆ ఆటల నుండి వాడు నేర్చుకున్నది ఏమిటి? అక్షరాల రూపాలు తప్ప
మరేదైనా వుందా? ఒకటేమిటంటే అక్షరాలు కృత్రిమ ఆకారాలు అన్న విషయం. రెండవది ఏంటంటే అక్షరాలని
కూర్చి పదాలు చెయ్యొచ్చు నన్న విషయం. మూడవది ఏంటంటే అక్షరాలని ఎలా పడితే అలా కూర్చితే
వచ్చే పదం అర్థవంతమైనది కాకపొవచ్చు అన్న విషయం. కొన్ని వస్తువులని మనం మామూలుగా కొన్ని
పధ్ధతుల్లోనే వాడడం, కొన్ని కోణాల్లోంచే చూడడం చేస్తూ వుంటాం (క్రిస్ ఆడుకునే పట్టాల్లా).
కాని వాటినే మరో విధంగా వాడొచ్చు, మరో కోణం నుండి చూడొచ్చు (అక్షరాల్లా) అన్న విషయం
కూడా ఆ ఆటల నుండి అర్థమవుతోంది. అలాగే వస్తువులకి మామూలుగా తెలిసిన ప్రయోజనాల కన్నా,
తెలీని కొత్త ప్రయోజనాలు ఉండొచ్చునన్న విషయం. క్రిస్ ఆ విధంగా అక్షరాల గురించి తెలుసుకున్న
దంతా స్వతహాగా, స్వానుభవంలో తెలుసుకున్న విషయాలు. తన స్వంత అవసరాలకోసం, సరదా కోసం తెలుసుకున్న
విషయాలు. పెద్ద వాళ్ల మెప్పు కోసమో, పెద్దవాళ్ల ప్రోద్బలం మీదనో తెలుసుకున్న విషయాలు
కావు. ఏదో అప్పుడప్పుడు ‘ఇది నాకు తెలిసింది చూశావా?’ అని తను కనుక్కున్న దాంట్లో నాకో
రెండు విషయాలు వెల్లడి చేసినా అదంతా నా మెప్పు కోసం నేర్చుకోలేదు. నేను మటుకు ఆ పిల్లవాడు
తను నేర్చుకున్నది ఎప్పుడెప్పుడు నాకు వచ్చి చూపిస్తాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి.
Fantastic Sir!