మెదడు
నాతో పోల్చితే లోకంలోని వింతలన్నీ వెలవెల బోతాయి సుమండీ! చూడడానికి
ఒకటిన్నర కిలోల కుక్కగొడుగులా ఉంటాను. ముద్ద ముద్దగా ముద్దుముద్దుగా ఉంటాను! నాలా ఇంత
వైవిధ్యంతో కూడిన క్రియలు ఈ భూమ్మీద ఏ కంప్యూటరూ చెయ్యలేదేమో. నాలో పది వేల కోట్ల న్యూరాన్లు
ఉంటాయి. అది చాలనట్టు అంతకు పది నుండి యాభై రెట్ల సంఖ్యలో గ్లయల్ కణాలు. మాది పెద్ద
కుటుంబం మరి. ఇంత మందిమీ ఆ చిట్టి పుర్రెలో ఇట్టే పట్టేస్తామన్నమాట. ఇంకా గుర్తుపట్టలేదా?
నేనండీ బాబు! మీ మెదణ్ణి!
మిగతా అంగాలు మీలో భాగాలు అని చెప్పుకోవచ్చు. మీ కాలేయం, మీ
ఊపిరి తిత్తులు ఇలా… కాని నా విషయం కాస్త ప్రత్యేకం. అసలు నేనే మీరు. మీరే నేను. (ఓ
ఫిలసాఫికల్ నవ్వు). మీ చెవులు వింటున్నాయంటే అది నా చలవే. మీ నాలుకకి రుచి తెలుస్తోందంటే
అది నా పనే. మీ కళ్ళు, ముక్కు, చర్మం మొదలైన వన్నీ కేవలం నాకు సమాచారాన్ని చేరవేస్తాయి.
కళ్ళు చూడలేవు. వెనుక పొంచి వుండి చూస్తున్నది నేను! మీ కళ్ళ వెనుక చూపుని నేను. చెవుల
లోని వినికిడి నేను. (భగవద్గీతలా వుందా? సారీ!) మీ ఇంద్రియాల క్రియలకి ఆధారమైన అసలు
అవయవాన్ని నేను. మీ ఆలోచనలకి, ఆత్మీయతలకి, భయాలకి, భావావేశాలకి వేదిక నేను. మీ కడుపుకి
ఆకలేస్తోందని నేను చెప్తేగాని మీకు తెలీదు. మీలో వుండి మీ జీవితాన్ని పరిపాలిస్తున్న
అద్భుతమైన మాంసపు ముద్దని నేను.
మీరు నిద్రపోతున్నప్పుడు కూడా నేను మేలుకునే వుంటాను. నిద్రపోతున్నప్పుడు
మీ బయటి నుండి, మీ శరీరం లోపలి నుండి వచ్చే విస్తారమైన సమాచారాన్ని నేను అనుక్షణం సేకరిస్తూ
దానికి తగు రీతుల్లో స్పందిస్తూ ఉంటాను.
ఇక మీరు ఏదైనా అపాయంలో ఇరుక్కుని అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు
నా పని మరీ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు మీరో పచ్చని అరటిపండు తొక్క మీద కాలేసి జారారనుకోండి.
అప్పుడు నేను వెంటనే తమాయించుకుని కాస్త వెసులుబాటుగా ఉన్న మీ రెండో కాలిని, ఇక మీ
మీగతా శరీరాన్ని ఎలా కదిలిస్తే, పడుతున్న మీ శరీరాన్ని మీ మోచేత్తో ఎలా అడ్డుకుంటే,
వీలైనన్ని తక్కువ ఎముకలు విరిగేలా ఎలా పడొచ్చో అన్నీ నియంత్రిస్తుంటానన్నమాట. అంతే
కాక ఈ వివరాలన్నీ మీ స్మృతిలో దాచిపెట్టి, ఈ సారి మళ్ళీ ఏదైనా పచ్చగా రోడ్డు మీద కనిపిస్తే,
ఎక్కడో ఉండొద్దని, కాస్త అప్రమత్తంగా ఉండమని మిమ్మల్ని వెంటనే హెచ్చరిస్తాను. అప్పటికీ
జరిగితే ‘ఖర్మ’ అనుకుంటాను.
ఇలాంటి అత్యవసర పరిస్థితులే కాక ఎన్నో మామూలు రోజూవారీ పనుల
నిర్వహణ నా నెత్తిన ఉంటుంది. ఉదాహరణకి మీ శ్వాస ప్రక్రియ నాపనే. మీ రక్తంలో కార్బన్
డయాక్సయిడ్ పెరుగుతోందని నా సెన్సర్లు నాకు సమాచారం అందిస్తాయి. అంటే మీ శరీరం ఆక్సిజన్
కోసం తపిస్తోందన్నమాట. నేను వెంటనే స్పందించి శ్వాస వేగాన్ని పెంచుతాను. దాంతో మీ ఛాతీలో
కండరాలు మరింత వేగంగా లయబద్ధంగా సంకోచించి, వ్యాకోచించడం మొదలెడతాయి. దాని ఫలితంగా
మీ ఛాతీలో వున్న ఊపిరి తిత్తులు మరింత వేగంగా పెరిగి, కుంచించుకుంటూ ఉంటాయి. మీ ఒంట్ళోకి
మరింత ఆక్సిజన్ ప్రవేశించి పరిస్థితి మామూలు అవుతుంది.
ఇలా వేయి విధాలుగా మిమ్మల్ని కంటికి రెప్పలా కపాడుకుని వస్తుంటాను.
మరి ఇంత గురుతర బాధ్యత నిర్వహిస్తున్న నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా? అందుకే మీ గుండె
పంప్ చేసే రక్తంలో 20% నాకే దక్కుతుంది. పైగా నాకు నిరంతరాయమైన సరఫరా ఉండాలి. దీనికి
ఇంత రక్తపిపాస ఏంటి? అనుకుంటున్నారా? మరి ఏం చెయ్యను? నా ఉద్యోగం అలాంటిది. ఉదాహరణకి
మీ కాల్లోకి కొన్ని నిముషాలు రక్త సరఫరా ఆగిపోతే కాలు తిమ్మిరెక్కుతుంది. మొదట్లో ఏమీ
తెలీకపోయినా కాసేపయ్యాక పిన్నులతో గుచ్చుతున్నట్టు నొప్పి పుడుతుంది. అంతేగాని ఆ కాసేపటికే
ఏకంగా కాలు తీసేయాల్సిన పని రాదుగా? కాని నా తీరు వేరు. మెదడుకి రక్తసరఫరా కాసేపు
(నిముషం కన్నా తక్కువ) తగ్గినా, తల తిరిగినట్టు అవుతుంది, స్పృహ కోల్పోయినంత పనవుతుంది.
ఇక కొన్ని నిముషాల పాటు రక్త సరఫరా ఆగిందంటే… కొంప మునిగినట్టే! నాలో కొంత భాగం తీవ్రంగా దెబ్బ తినవచ్చు. మరెలా? అందుకే
నేను కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మీ శరీరంలో రక్తం ఏ అవయవానికి ఎంత వెళ్లాలో అన్నీ
నియంత్రించేది నేనే కనుక, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వీలైనంత రక్తాన్ని నేనే కొట్టేస్తానన్నమాట!
నాకేసి అలా చూడకండి మరి! నా కేవైనా అయితే మీకు అయినట్టే కదా? మనిద్దరిదీ… (ఇలాంటి సందర్భాల్లో
జనం ఓ భారీ పదం విసుర్తుంటారే…) ..ఆc… అవినాభావ సంబంధం!
(ఇంకా వుంది)
good post ...waiting for balance