న్యూటన్ మూడవ గతి నియమం గురించి చిన్న తరగతులలో చదువుకున్నాం.
“ప్రతీ క్రియకి ఒక ప్రతిక్రియ ఉంటుంది” అని ఆ నియమం చెప్తుంది. మనం ఒక వస్తువు మీద
బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఆ వస్తువు వ్యతిరేక దిశలో మన మీద అంతే బలం ప్రయోగిస్తుంది.
ఒక వస్తువుని మనం తోస్తే అది మనను తిరిగి అంతే బలంతో తోస్తుంది. ఒక వస్తువుని మనం లాగితే
అది తిరిగి అంతే బలంతో మనను తన వైపు లాక్కుంటుంది.
దీన్ని అనుభూతి చెందాలంటే ఓ చిన్న రివాల్వింగ్ కుర్చీ కావాలి.
ఆ కుర్చీలో కూర్చుని పక్కనే నించున్న మనిషిని తొయ్యడానికి ప్రయత్నించండి. వారిని తొయ్యబోయి
వారిచేత తొయ్యబడినట్టు మీరే అల్లంత దూరం మీ కుర్చీతో పాటు జరుగుతారు.
ఈ భావన అర్థం కావడానికి గాలిబుడగ అరవింద్ గుప్తా ప్రదర్శిస్తున్న ఈ చిన్న ప్రయోగాన్ని చూడండి.
రాకెట్ లో కూడా ఇదే జరుగుతుంది. రాకెట్ లో ఇంధనం మండడం వల్ల
పుట్టిన వేడి వాయువులని రాకెట్ బయటికి నెట్టుతుంది. అందుకు ప్రతి క్రియగా ఆ వాయువులు
రాకెట్ ని వ్యతిరేక దిశలో నెట్టుతాయి. వాయువులు వెనక్కి కదిలితే రాకెట్ ముందుకి కదులుతుంది.
మనం ఆడుకునే దీపావళి రాకెట్ల పని తీరు ఇలాగే ఉంటుంది. అయితే
దీపావళి రాకెట్లకి నిజం రాకెట్లకి ఓ ముఖ్యమైన తేడా వుంది. దీపావళి రాకెట్ల లో వాడే
ఇంధనం పొడి ఇంధనం. అంటే ఘన రూపంలో ఉండే ఇంధనం. ఎందుకంటే పొడి మండినప్పుడు అత్యధిక పీడనం
ఉత్నన్నం అవుతుంది. ఆ పీడనాన్ని తట్టుకోడానికి రాకెట్ గోడలు మందంగా, ధృఢంగా ఉండాలి.
దాని వల్ల రాకెట్ బరువుగా రూపొందుతుంది. పైగా పొడి ఇంధనాన్ని వాడినప్పుడు ఒక సారి జ్వలనం
మొదలయ్యాక దాన్ని సులభంగా ఆర్పడం కుదరదు. ఇంధనం అంతా హరించుకున్న వరకు జ్వలనం సాగుతూనే
ఉంటుంది. రాకెట్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంధనాన్ని అవసరమైనంత మేరకు మాత్రమే మండించుకుంటూ,
అక్కర్లేనప్పుడు మంటని ఆర్పుకునే వీలు ఉండాలి.
ఈ సమస్యలకి పరిష్కారంగా ద్రవ ఇంధనాలని వాడుతుంటారు.
కింద చిత్రంలో ద్రవ ఇంధనం మీద పని చేసే ఓ సరళమైన రాకెట్ నిర్మాణాన్ని
చూడొచ్చు. ఇంధులో రెండు టాంకులు ఉన్నాయి. ఒక దాంట్లో ఇంధనం (ఉదాహరణకి ఇథైల్ ఆల్కహాల్)
ఉంది. రెండో దాంట్లో ద్రవ ఆక్సిజన్ ఉంది.
రెండు పంపులు ఆ ద్రవాలని ఓ ప్రత్యేకమైన జ్వలన మందిరం (combustion
chamber) లోకి విడుదల చేస్తాయి. ఇక్కడ రెండు
ద్రవాలు రసాయనికంగా చర్య జరిపి మండుతాయి. అలా పుట్టిన వేడి వాయువులు రాకెట్ వెనుక భాగం
నుండి జువ్వని తన్నుకొస్తాయి. ఆ తాకిడికి రాకెట్ ముందుకి కదులుతుంది.
ముందుకు దూసుకుపోతున్న రాకెట్ ని దాని గమన రేఖలో స్థిరంగా
నిలపడానికి fin లు, ఇతర నియంత్రణ రెక్కలు ఉంటాయి.
ఆ రెక్కలని కదిలిస్తూ రాకెట్ తన చలన దిశలో చిన్న మార్పులు చేసుకోగలదు.
గాల్లో ఎగురుతున్నప్పుడు రెక్కలని కదిలించి గమన దిశని మార్చుకోవచ్చు
గాని, అంతరిక్షంలోకి ప్రవేశించాక, ఆ నిర్వాత సీమలో ఇక రెక్కలతో పనేముంది అని ప్రశ్నించవచ్చు.
ఈ ప్రశ్నకి సమాధానం రాకెట్ శాస్త్రంలో పురోగామి అయిన కాన్స్టాంటిక్
సియాల్కోవ్స్కీ ఆ నాడే చెప్పాడు. రెక్కలని రాకెట్ లోంచి బయటకి ప్రవహిస్తున్న మండే వాయువుల
బాటలో పెట్టమన్నాడు. అప్పుడు రెక్కల దిశ బట్టి బయటికొచ్చే వాయువుల ప్రవాహ దిశ మారుతుంది.
(ఇంకా వుంది)
0 comments