ఇంతవరకు కలలు అనే సమస్యని అర్థం చేసుకోడానికి కావలసిన కొన్ని ప్రాథమిక సూత్రాలని చిత్రీకరిస్తూ వచ్చాను. కలలు ఎందుకు ముఖ్యం అవుతాయంటే, మనిషిలో ప్రతీకలని ఉత్పన్నం చేసే అంతరంగ విభాగాన్ని శోధించాలంటే, అందుకు కలలు అత్యంత విలువైన మూలాలుగా పరిణమిస్తాయి. కలలతో వ్యవహరించేటప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది ఏంటంటే కలలని ఓ వాస్తవంగా స్వీకరించాలి. కలలు నిజాలు. వాటిలో ఏదో అంతరార్థం వుంది అన్న భావన తప్ప మరే ఇతర నిరాధారిత పూర్వభావనలు మనసులో పెట్టుకోకూడదు. రెండవది ఏంటంటే, కలలు అచేతన యొక్క ప్రత్యేక అభివ్యక్త రూపాలు.
ఈ సూత్రాలు ఎంత లోతైనవి అంటే, ఎంత ప్రాథమికమైనవి అంటే వీటిని ఇంత కన్నా సరళంగా వ్యక్తం చెయ్యడానికి వీలుపడదు. అచేతన గురించి ఎవరికి ఎలాంటి అభిప్రాయమైనా ఉండొచ్చు. కాని అందులో శోధించి తెలుసుకో దగ్గది ఏదో వుందని మాత్రం అందరూ ఒప్పుకోక తప్పదు. కలలతో ఎంతో కొంత పరిచయం ఉన్నవారు కలలు వట్టి గందరగోళ సంఘటనలు అని అనుకుంటే అది వారి ఇష్టం. కాని కలలని మామూలు, వాస్తవ సంఘటనలుగా (నిజమే వాటికీ ఒక రకమైన వాస్తవికత ఉంటుందిగా మరి) పరిగణిస్తే వాటి అస్తిత్వానికి ఓ హేతువు ఉందని, వాటికీ ఓ లక్ష్యం, ఓ అంతరార్థం ఉంటుందని అనుకోవాల్సి వుంటుంది.
అచేతన యొక్క తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలంటే మనసులో అచేతన, సచేతన అంశాల మధ్య సంబంధాన్ని ఓ సారి నిశితంగా పరిశీలిద్దాం. అందరికీ సుపరిచితమైన ఓ దైనిక ఘటననే తీసుకుందాం. ఏదో అనాలని నోటిదాకా వస్తుంది, కాని ఉన్నట్లుండి ఏమనాలని అనుకున్నారో మర్చిపోతారు. కొద్ది క్షణాల ముందే మన నాలిక చివర్లో ఆడిన విషయాలు ఒక్కసారిగా మనసులోంచి తుడిచిపెట్టుకుపోతాయి. లేదా ఓ స్నేహితుణ్ణి మరో మూడో మనిషికి పరిచయం చెయ్యబోతుంటారు. ఆఖరు క్షణంలో ఆ మనిషి పేరు మర్చిపోతారు. తల దిమ్మెక్కిపోతుంది, నోట మాట పెగలదు. పేరు నాలిక కొసన ఆడుతుంటుంది గాని పైకి రాదు. ఆ మనిషి పేరు మీరు మర్చిపోయారని కాదు. ఆ క్షణం ఆ పేరు అచేతనలో ఉండిపోయింది. లేదా సచేతనలో ఉన్న పేరు తాత్కాలికంగా అచేతనలోకి జారుకుంది.
ఇంద్రియాల క్రియలో కూడా ఇలాంటి పరిణామాలు కనిపిస్తుంటాయి. నిరంతరాయంగా మోగుతున్న ఓ స్వరాన్ని వింటున్నారనుకోండి. పైగా ఆ స్వరం యొక్క తీవ్రత సరిగ్గా మన వినికిడి శక్తి యొక్క సరిహద్దు వద్ద ఉందనుకోండి. అంటే దాని తీవ్రత అంతకన్నా కాస్త బలహీనంగా ఉంటే ఇక వినిపించదు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో, నిజానికి స్వరం ఆగకుండా మోగుతూనే వున్నా, మనకి మాత్రం ఆగాగి మోగుతున్న భ్రమ కలుగుతుంది. ఈ సందర్భంలో శబ్దం యొక్క మన సంవేదన (sensation) లో డోలనం (oscillation) కలగడానికి కారణం స్వరంలో వచ్చిన మార్పు కాదు. స్వరం మారకుండా మోగుతోంది. ఆ స్వరం మీద లగ్నమైన మన ధ్యాసలో ఉంది ఆ డోలనం. ఆ ధ్యాస నిలకడగా లేకుండా వస్తూ, పోతూ ఉందన్నమాట. అంటే ఆ శబ్దం మన సచేతనకి, అచేతనకి మధ్య ఊగిసలాడుతోందన్నమాట. అచేతనకి, సచేతనకి మధ్య సరిహద్దుని అటు ఇటు డోలాయమానంగా దాటుతోందన్నమాట.
ఒక అంశం మన సచేతన లో నుండి జారుకున్నంత మాత్రాన అసలు దానికి సంబంధించిన వస్తువే మాయమైనట్టు కాదు. సందు తిరిగిన కారు కనిపించకుండా పోతుంది. అయినంత మాత్రాన అసలు కారే గల్లంతు అయినట్టు కాదుగా! మన కను చూపు మేరని దాటిందంతే. అలాగే మన సచేతన లోంచి జారుకున్న ఆలోచనలు అచేతనలో ప్రవేశించాయన్నమాట. అంతేగాని అంతర్థానమై పోయాయని కాదు.
(ఇంకా వుంది)
ఒక అంశం మన సచేతన లో నుండి జారుకున్నంత మాత్రాన అసలు దానికి సంబంధించిన వస్తువే మాయమైనట్టు కాదు. సందు తిరిగిన కారు కనిపించకుండా పోతుంది. అయినంత మాత్రాన అసలు కారే గల్లంతు అయినట్టు కాదుగా! మన కను చూపు మేరని దాటిందంతే. అలాగే మన సచేతన లోంచి జారుకున్న ఆలోచనలు అచేతనలో ప్రవేశించాయన్నమాట. అంతేగాని అంతర్థానమై పోయాయని కాదు.
(ఇంకా వుంది)
0 comments