చలివిడి ముద్దలా, కొంచెం అదే
రంగులో, కనిపిస్తానే గాని నిజానికి నేనో జాలాన్ని. మీరు ఊహించగలిగే దాని కన్నా పెద్ద
జాలాన్ని. కావాలంటే ప్రపంచంలో కెల్లా ఓ అతిపెద్ద
జాలాన్ని ఊహించుకోండి. భూమి మీద మొత్తం జనాభా సుమారు 7 బిలియన్లు. నూటికి సుమారు 87
మందికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పోనీ సెల్ ఫోన్ల వినియోగం నూరు శాత అనుకుందాం.
ప్రతీ సెల్ ఫోన్ లోను 200 కాంటాక్ట్ లు ఉంటాయని
అనుకుందాం. అంటే 7 బిలియన్ల సెల్ ఫోన్లు గల
ఈ జాలంలో, ఒక్కొక్క సెల్ ఫోను రెండొందల ఇతర ఫోన్లతో సూటిగా సంబంధం గలిగి వుంది. ఇది చాలా పెద్ద, సంక్లిష్టమైన జాలం అని సులభంగా
ఒప్పుకోగలం. మెదడులోని జాలం దీని కన్నా నూరు రెట్లు పైగా పెద్దది. ఎందుకంటే మెదడులో
మొత్తం న్యూరాన్ల సంఖ్య 100 బిలియన్లు. ఒక్కొక్క న్యూరానుకి 1,000 నుండి
10,000 వరకు ఇతర న్యూరాన్లతో సంధులు
(connections) ఉంటాయి. అంటే మొత్తం 10^14
– 10^15 సంధులు అన్నమాట. ఇక కొన్ని న్యూరాన్లలో
అయితే తలా లక్షా, రెండు లక్షల సంధులు ఉంటాయి. మెదడులో సెరిబెల్లం అనే ప్రాంతంలో ఉన్నాయి
లేండి చింపిరి జుట్టు బూచాళ్లు… పుర్కిన్యే కణాలు (Purkinje cells) అంటారు వాళ్లని…
వీళ్లకి తలా లక్షన్నర సంధులు దాకా ఉంటాయి (చిత్రం).
ఇక మా తీగలలో ప్రసారం అయ్యే
విద్యుత్ సంకేతాలు మహా జోరుగా పరిగెడతాయి. లేకపోతే మీ కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు,
మీరు తేరుకుని కాలు వెనక్కి తీసుకునే సరికి తెల్లారిపోతే మరి ఇబ్బంది కదండి! నాడీ తీగల్లో
సంకేతం ప్రసారం అయ్యే వేగాల్లో కూడా ఎంతో తేడా ఉంటుందనుకోండి. కొన్ని తీగల్లో అయితే
120 మీటరు/సెకను వేగం వరకు కూడా ఉంటుంది. ఈ
తీగలు కాస్త దళసరిగా అంటే ఓ 20 మైక్రాన్లు
(1 మైక్రాను అంటే ఓ మిల్లీమీటరులో వెయ్యోవంతు!)
మందం కలిగి ఉంటాయి. ఇక మరి కొన్ని తీగలైతే బాగా బక్కపలచగా ఉంటాయి. వీట్లో వేగం మరి
కాస్త నెమ్మది – 4 మీటర్/సెకను దరిదాపుల్లో ఉంటుంది.
ఇన్ని చేస్తాం గానీండి ఒక్కటి
మాత్రం మాకు చాతకాదండి. అదే… పునరుత్పత్తి అంటారు చూశారూ… మా మిగతా కణం తమ్ముళ్ళందరికీ
ఇది బాగా చాతనవును. చర్మం కణం గాళ్ళు, రక్త కణాలు … ఈ కణాలు ఎప్పుడైనా చచ్చిపోయినా
పెద్దగా బెంగ లేదండి. వాళ్ళ సంతానం ఉంటారు గనుక లెక్క సరిపోతుంది. కాని న్యూరాన్లు
ప్రాణాలొదిల్తే వాటి వంశ గౌరవం నిలపడానికి
ఒక్కడు ఉండడండి. మీ మెదడులో న్యూరాన్లు ఒకసారి పోతే ఇక అదే పోవడం అండి. ఇప్పుడు మీ
వయసు 35 అనుకోండి. మీ మెదడులో రోజుకి
1000 న్యూరాన్లు చొప్పున టపా కట్టేస్తుంటాయి.
అందుకే వయసు పైబడుతున్న కొద్ది మెదడు కుంచించుకుంటుంది. బరువు కూడా తగ్గుతుంది. అప్పుడిక
మీ మతి మరుపు పెరిగిపోతుందన్నమాట. పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, తేదీలు లాంటివి గుర్తుకు
రాక తల బాదేసుకుంటూ ఉంటారు. కాని మిగతా ముఖ్యమైన పనుల్లో మాత్రం పొరబాటు రానీకుండా
నేను జాగ్రత్త పడుతుంటాను.
మీ లోని మిగతా అంగాలకి నాకు
ఓ ముఖ్యమైన పోలిక వుంది. మీకు రెండు ఊపిరితిత్తులు – ఎడమ, కుడి వైపుల్లో – ఉన్నాయి.
అలాగే రెండు మూత్ర పిండాలు. రెండు కళ్లు, చెవులు, చేతులు, కాళ్లు… అదే అర్థమయ్యింది
కదండీ… ఇలా చాలా అవయవాలు రెండేసి చెరో వైపు ఉంటాయి. మెదడు మాత్రం ఒక్కటే ఉందని మీరు
అపోహపడతారు. నాకు తెలుసు. కాని మెదడులో కూడా రెండు విభాగాలు చెరోవైపు ఉంటాయి. మీ ఒంట్లో
కుడి వైపున జరిగే తంతులో ఎక్కువగా నా లో ఎడమ భాగం చెప్పు చేతల్లో ఉంటుంది. అలాగే మీ
ఒంట్ళో ఎడమ వైపుని నాలో కుడి భాగం అదిలిస్తుంది. నాలో రెండు భాగాలున్నా రెండూ సరి సమానం
కాదన్నమాట. మనకి చేతులు రెండున్నా కుడి చేయి చేసే పని ఎడమ చేయి చెయ్యలేదు కదండి. అలాగే
మెదడులో కూడా ఒక భాగానిది పై చేయి అవుతుంది. అది తరచు ఎడమ బాగానిది అవుతుంది. ఎడమ మెదడు
కుడి మెదడు మీద పెత్తనం చేస్తున్నట్లయితే అలాంటి మెదడున్న వాళ్ళు కుడి చేతి వాటం గల
వాళ్లయి వుంటారు. అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి ఎడమ చేతి వాళ్లలో కుడి మెదడు పెత్తనం
ఎక్కువ అన్నమాట.
(ఇంకా వుంది)
0 comments