ఆధునిక భౌతిక శాస్త్రం గెలీలియోతో మొదలయ్యిందని చెప్పుకుంటారు. ప్రతీ వివాదంలోను ప్రయోగాత్మక పద్ధతికి, వస్తుగత దృష్టికి ప్రాధాన్యత నిస్తూ, ఆధునిక శాస్త్రీయ పద్ధతికి (scientific method) పునాదులు వేశాడు. ప్రయోగ ఫలితాల ద్వారా ప్రకృతి చెప్పే సాక్ష్యాధారాల బలం ముందు ఎంతటి అధికార బలం, అహంకర బలం అయినా తల ఒగ్గవలసిందేనని నిరూపించాడు. శాస్త్ర సత్యాన్ని నిలబెట్టేందుకై ప్రాణాలని కూడా లెక్క చెయ్యకుండా మతవ్యవస్థతో తలపడ్డ ధీరాత్ముడు గెలీలియో.
గెలీలియో పుట్టింది 1564 లో 15 ఫిబ్రవరి నాడు ఇటలీలోని పీసా నగరంలో. అస్తికత, దైవచింతన బలంగా ఉన్న ఇంట్లో పెరుగున్నా కూడా, తనలో సహజంగా ఉండే శాస్త్రీయ చింతన చిన్నతనంలోనే బహిర్గతం కాసాగింది. గెలీలియో తన ఇంట్లో వాళ్లతో పాటు ప్రతీ ఆదివారం చర్చిలో సర్వీస్ కి వెళ్లేవాడు. ఒకసారి అలాగే చర్చిలో ప్రార్థన జరుగుతోంది. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు చిన్నవాడైన గెలీలియో. అంతలో ప్రవచకుడి వెనుక నేపథ్యంలో అటు ఇటు ఊగుతున్న ఓ దీపం కనిపించింది. ఆ దీపం ఓ పొడవాటి గొలుసుకి వేలాడుతోంది. దీపం ఒకసారి అటు ఇటు ఊగడానికి ఎంత సేపు పడుతుందో తెలుసుకోవాలని అనిపించింది పిల్లవాడికి. దగ్గరలో ఎక్కడా గడియారం కనిపించలేదు. తన ముంజేతి నాడినే గడియారంగా వాడుకుని దీపం ఒక సారి ఊగడానికి ఎంత సేపు పడుతుందో లెక్కపెట్టాడు. మొదట్లో డోలనం (oscillation) యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉండేది. కాని కాలక్రమేణా డోలనం చిన్నది అవ్వసాగింది. ఇక ఒక దశలో దీపం దాని కేంద్ర బిందువుకి కొద్దిగా అటు ఇటు చిన్న చలనాన్ని ప్రదర్శించసాగింది. అయితే డోలనం యొక్క వ్యాప్తి తగ్గుతున్నా, ఒక డోలనానికి పట్టే సమయం మాత్రం మారకపోవడం చూసి గెలీలియో ఆశ్చర్యపోయాడు. ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయం లోకి ఇంకా లోతుగా శోధించడం మొదలెట్టాడు. ఆ శోధన లోంచి పుట్టిందే మనం చిన్నప్పుడు చదువుకున్న లోలకం. లోలకం యొక్క ఆవర్తక కాలం (time period) కేవలం అది కట్టబడ్డ త్రాడు పొడవు మీదే ఆధారపడుతుంది గాని, డోలనం యొక్క వ్యాప్తి (amplitude) మీద గాని, లోలకం బరువు మీద గాని ఆధారపడదని గమనించాడు గెలీలియో. తన చిన్నారి యంత్రానికి ”పల్సిలోగియా’ (pulsilogia) అని పేరు పెట్టాడు. అలా కచ్చితమైన వ్యవధి గల డోలనాలు ప్రదర్శించే లోలకంతో కాలాన్ని కొలవచ్చని, దాన్నో గడియారంలా వాడొచ్చని కూడా ఊహించాడు. ఆ విధంగా మత ప్రవచనాలు కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో గెలీలియో లో దాగి వున్న శాస్త్రవేత్తని తట్టి లేపాయి.
తరువాత యవ్వన దశలో గెలీలియో తన తండ్రి ప్రోద్బలం మీదట వైద్య విద్యలోకి ప్రవేశించాడు. మనసంతా గణిత, భౌతిక శాస్త్రాల మీదే ఉన్నా తండ్రి మాటని కాదనలేకపోయాడు. తను చిన్నప్పుడు కనిపెట్టిన లోలకానికి తన వైద్య విద్యలో కూడా ఒక చక్కని ప్రయోజనం ఉందని గమనించాడు. నాడి చూసి రోగి యొక్క ఆరోగ్య స్థితి గురించి తెలుసుకునే టప్పుడు ఆ నాడి వేగాన్ని కచ్చితంగా కొలవడానికి లోలకాన్ని వాడడం మొదలెట్టాడు. ఆ విధంగా తనకి ఇష్టం లేకపోయినా వైద్య రంగంలో ఓ చిన్న శాస్త్రవిజయాన్ని సాధించాడు గెలీలియో. కాని ఆ రంగంలో ఎంతో కాలం ఇమడలేకపోయాడు. చివరికి తన తండ్రిని ఒప్పించి ఆ చదువుకి మధ్యలోనే తిలోదకాలు వొదిలేశాడు.
శాస్త్రవేత్త అంటే ప్రకృతి గురించి ఎన్నో విషయాలు తెలిసినవాడు అనుకుంటారు చాలా మంది. కాని నిజమైన శాస్త్రవేత్తకి ఉండాల్సిన ముఖ్య లక్షణం తెలిసి ఉండడం కాడు, తెలుసుకోవాలని ఉండడం. కనిపించిన ప్రతీ విషయం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనే గెలీలియోని ప్రతీ విషయాన్ని ప్రశ్నించేలా చేసింది. ఆధారాలు లేనిదే ఏదీ ఒప్పకునేవాడు కాడు. “అది అలా ఉందంతే” అని ఛాందస వాదులు చెప్పే శుష్కవివరణలకి నవ్వేవాడు, వాళ్ల అమాయకత్వాన్ని అవహేళన చేసేవాడు. శాస్త్రవిషయాల్లో ప్రతీ రంగంలోను ప్రాచీన గ్రీకు తాత్వికుడు అరిస్టాటిల్ భావాలు బలంగా పాతుకుపోయిన రోజులవి. అరిస్టాటిల్ చెప్పింది నిజమా కాదా అన్న విచక్షణ లేకుండా, నిర్విమర్శగా ఆయన చెప్పిందంతా వేదమని నమ్మేవాళ్లు పండితులు. ఆయన బోధనలని ఎదిరించడం, ప్రశ్నించడం అవివేకంగాను, అమర్యాదగాను భావించేవారు. అలాంటి అరిస్టాటిల్ మహానుభావుడు బోధనలలో ఒకదాని మీద ఇప్పుడు గెలీలియో ధ్వజం ఎత్తాడు.
గురుత్వాకర్షణ వల్ల వస్తువులన్నీ పైనుండి కిందపడతాయని అందరికీ తెలుసు. అయితే అలా పడుతున్న వస్తువులన్నీ ఒకే విధంగా పడవని కొన్ని ప్రయోగాలలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఓ రూపాయి నాణాన్ని, ఓ ఎండుటాకుని ఒకే ఎత్తునుండి పడేస్తే రూపాయి నాణెం ముందు కిందపడుతుంది. ఎండుటాకు అటూ ఇటూ వయ్యారంగా కాసేపు కొట్టిమిట్టాడి నెమ్మదిగా కిందపడుతుంది. కనుక బరువైన వస్తువులు తేలికైన వస్తువుల కన్నా తొందరగా కిందపడతాయని అరిస్టాటిల్ బోధించాడు. కాని ఇది అన్ని సందర్భాలలోను నిజం కాదని సులభంగా తేల్చవచ్చు. ఉదాహరణకి ఇందాకటి రూపాయి నాణెం తో పాటు ఒక చెంచానో, స్టీలు గ్లాసులో పడేసి చూడండి. రెండూ ఇంచుమించు ఒకే సారి నేలని చేరుతున్నట్టు గమనించొచ్చు. కాని ఈ ప్రాథమిక విషయాన్ని కూడా ఎవరూ ప్రశ్నించకుండా యూరప్ లో ఓ రెండు వేల ఏళ్ల పాటు గుడ్డిగా నమ్ముతూ వచ్చారు.
ఈ విషయంలో అరిస్టాటిల్ చెప్పింది తప్పని నిరూపించడానికి గెలీలియో అట్టహాసంగా ఓ బహిరంగ ప్రదర్శన చేశాడు.
(సశేషం...)
(సశేషం...)
చాల బావుందండి. గెలీలియో ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.